మంచిర్యాల టౌన్, న్యూస్‌లైన్ : దేశంలో 60శాతం ఉన్న యువత సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పొల్సాని మురళీధర్‌రావు అన్నారు. బుధవారం స్థానిక పద్మావతి గార్డెన్స్‌లో జరిగిన నవభారత యువ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్య, ఉద్యోగం తదితర రంగాల్లో ఎలాంటి అవకాశాలు లేక అభివృద్ధికి దూరమవుతున్నారని తెలిపారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నేడు ఆహార ఉత్పత్తి పెరగడం లేదని, పక్కనే గోదావరి ఉన్నా సాగునీరు లేక పంటలు చేతికందడం లేదని తెలిపారు.
పాజెక్టుల నిర్మాణంతో రైతాంగానికి సాగునీరందించి వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయాల్సి ఉన్నా ప్రభుత్వాల చేతిగాని తనంతో వ్యవసాయం నిర్వీర్యమయ్యే పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి సారించి రైతుల ఆత్మహత్యలను అరికట్టాలని డిమాండ్ చేశారు. నేటి యువత శాస్త్ర, సాంకేతిక రంగాల్లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్నా.. అవకాశాలు లేక మేథాసంపత్తి సరిహద్దులు దాటుతోందని తెలిపారు. ఏమాత్రం అవకాశాలు ఉన్నా యువత తమ ప్రతిభా పాటవాలతో దేశాన్ని 200ఏళ్లు ముందుకు తీసుకెళ్లే సత్తా చాటుతుందని స్పష్టం చేశారు. ప్రత్యేక తెలంగాణ విషయంలో బీజేపీ ప్రాధాన్యతను గుర్తించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసిందని అన్నారు.
జాప్యం చేయకుండా పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని, ఇందుకు బీజేపీ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమని, హైదరాబాద్ లేని తెలంగాణ అవసరం లేదని స్పష్టం చేశారు. కొత్త రాజకీయ పంథాను చాటేలా ఈ నెల 17న హైదరాబాద్‌లో నిర్వహించనున్న నరేంద్రమోడీ సభను జయప్రదం చేయాలని కోరారు. బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి తులా ఆంజనేయులు, బీజేపీ జిల్లా ఇన్‌చార్జి వి.మురళీధర్‌గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోనె శ్యాంసుందర్‌రావు, ఆరుముళ్ల పోశం, జిల్లా అధ్యక్షుడు అయ్యన్నగారి భూమ న్న, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్‌గౌడ్, ఉపాధ్యక్షుడు పెద్దపల్లి పురుషోత్తం, తెలంగాణ ఉద్యమ కమిటీ చైర్మన్ వెరబెల్లి రవీందర్‌రావు, నాయకులు మున్నారాజ్ సిసోడియా, పెందూర్ ప్రభాకర్, పూసాల వెంకన్న పాల్గొన్నారు.
సంక్షేమాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వం
Published Thu, Aug 8 2013 4:03 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
Advertisement
Advertisement