ఉట్నూర్ రూరల్/తానూర్/దండేపల్లి, న్యూస్‌లైన్ : వర్షాలు రైతుల ఊపిరి తీస్తున్నాయి. పక్షం రోజులుగా కురిసిన వర్షం నీరు చేలలో చేరడంతో మొక్కలు కుళ్లిపోయాయి. దీంతో దిగుబడి రాదని, అప్పులు తెచ్చి పెట్టిన పెట్టుబడి ఎలా తీర్చాలనే బెంగతో ముగ్గురు రైతులు మనస్తాపం చెంది బుధవారం పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఉట్నూర్ మండలం సాలేవాడ(బి) గ్రామపంచాయతీ పరిధిలోని తాండ్రా గ్రామానికి చెందిన గిత్తే కిషన్(48), తానూర్ మండలం హిప్నెల్లి తండాకు చెందిన రాజేశ్(25), దండేపల్లి మండలం తానిమడుగు గ్రామానికి చెందిన మాదావత్ శ్రీరాం(48)లు ఆత్మహత్య చేసుకున్నారు.
చేలో నీరు చేరి..
ఉట్నూర్ మండలం సాలేవాడ(బి) గ్రామపంచాయతీ పరిధిలోని తాండ్రా గ్రామానికి చెందిన గిత్తే కిషన్(48)కు మూడెకరాల భూమి ఉంది. ఇందులో పత్తి సాగు చేశాడు. మొదటి కురిసిన వర్షాలకు మొక్కలు కుళ్లిపోయాయి. మళ్లీ సోయా సాగు చేశాడు. పక్షం రోజుల క్రితం కురిసిన వర్షాలకు మొక్కలు కొట్టుకుపోయాయి. రెండుసార్లు పెట్టుబడి నష్టం వాటిల్లడంతో మనస్తాపం చెందాడు. బుధవారం వేకువజామున ఇంట్లో పురుగుల మందుతాగాడు. కుటుంబ సభ్యులు గమనించి ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందాడు. కిషన్‌కు భార్య గంగాబాయి ఉంది. ఆమె ఫిర్యాదు మేరకు ఎస్సై సత్యనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
యువరైతు..
తానూరు మండలం హిప్నెల్లి తండాకు చెందిన రాజేశ్‌కు ఆరు నెలల క్రితం వివాహమైంది. తనకున్న రెండెకరాలతోపాటు మరో పదెకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేస్తున్నాడు. పెట్టుబడి కోసం ప్రైవేటుగా రూ.లక్ష అప్పు చేశాడు. పక్షం రోజుల క్రితం కురిసిన వర్షానికి చేలలో నీరు నిలిచి మొక్కలు కుళ్లిపోయాయి. దిగుబడి వచ్చే అవకాశం లేక అప్పులు ఎలా తీర్చాలని మనస్తాపం చెంది ఇంట్లో పురుగుల మందుతాగాడు. కుటుంబ సభ్యులు గమనించి భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. రాజేశ్‌కు తల్లి సక్కుబాయి, తండ్రి ఉత్తం, భార్య లక్ష్మి ఉంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై మసూద్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ముథోల్ ఎమ్మెల్యే వేణుగోపాలాచారి భైంసా ఏరియా ఆస్పత్రిలో రాజేశ్ మృతదేహన్ని పరిశీలించారు. ఆర్థిక సాయం అందిస్తామన్నారు.
కౌలు రైతు..
దండేపల్లి మండలంలోని తానిమడుగు గ్రామానికి చెందిన మాదావత్ శ్రీరాం(48)కు ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు కుమారులు. గతేడాది పెద్దకూతురుకు పెళ్లి చేశాడు. దీంతో కొంత అప్పుల పాలయ్యాడు. మరో ఇద్దరు ఆడపిల్లలు పెళ్లికి ఉన్నారు. ఈ యేడు ఐదెకరాల భూమి కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశాడు. ఇందుకు రూ.లక్ష అప్పు చేశాడు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పత్తి చేనులో నీళ్లు నిలిచి మొక్కలు కుళ్లిపోయాయి. దీంతో పంట దిగుబడి రావడం అనుమానమే అని భావించాడు. ప్రస్తుతం, గతంలో చేసిన అప్పులు రూ.2లక్షలు కావడంతో మనస్తాపం చెందాడు. బుధవారం మధ్యాహ్నం పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు లక్సెట్టిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందించే లోపు మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై శ్రీనివాస్ వివరించారు.
ఊపిరి తీసిన వర్షాలు
Published Thu, Aug 8 2013 3:44 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement