సాక్షి, హైదరాబాద్: సమాజాభివృద్ధిలో ఎన్జీవోల పాత్ర చాలా కీలకమైందని, మహిళల హక్కులు, అత్యాచారాలు లాంటి పలు అంశాలపై ఎన్జీవోలు పోరాడుతున్నారని బీజేపీ మహిళా జాతీయ మోర్చా అధ్యక్షురాలు విజయ రహత్కర్ అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన ‘ఎన్జీవోస్ మీట్’ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉగ్రమూకలకు మోదీ వాళ్ల భాషలోనే సరైన సమాధానం చెప్పారన్నారు. ఎన్జీవోలు ఇచ్చే సలహాలను మోదీ దృష్టికి తీసుకెళ్తామన్నారు. మోదీ తప్ప దేశానికి మరో ప్రత్యామ్నాయం లేదన్నారు. మహిళల అభివృ ద్ధి, సంక్షేమం కోసం ప్రధాని మోదీ అనేక పథకాలను చేపట్టి సమర్థంగా అమలు చేస్తున్నారని చెప్పారు.
మహిళా పక్షపాతి మోదీ
జాతీయవాద ఆలోచనలున్న వారందరూ బీజేపీలోకి రావాలని, ఎన్జీవోస్ నిస్వార్థంగా సేవ చేస్తూనే రాజకీయంగా రాణించాల్సిన అవసరం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పేర్కొన్నారు. మోదీ మహిళా పక్షపాతి అని, రక్షణ శాఖ మంత్రి సహా పలు కీలక పదవులు మహిళలకు కేటాయించడమే ఇందుకు నిదర్శనమని కొనియాడారు. ఎన్జీవోలు చాలా మంచి పనులు చేస్తాయన్నారు. దేశం మొత్తం మీద కమలం వికసిస్తోందని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ ని గెలిపించాలని పిలుపునిచ్చారు. పాక్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడుతున్నా మన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి సర్జికల్ స్ట్రైక్ లు, మెరుపు దాడులను చేస్తూ ఉగ్రవాదులను తుదముట్టించే విధంగా మోదీ ప్రభుత్వం శ్రమిస్తోందన్నారు.
సమాజ మార్పునకు ఎన్జీవోలు
ప్రభుత్వంతో పాటు ఎన్జీవోలు సమాజ మార్పునకు కృషి చేస్తున్నారని ఎంపీ దత్తాత్రేయ అన్నారు. కమర్షియల్‌గా కాకుండా పనిచేసే ఎన్జీవోలకు మోదీ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. అందరమూ కలసి మరోసారి మోదీని ప్రధాని చేయాలని కోరారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యకురాలు ఆకుల విజయ పాల్గొన్నారు.
ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం మానుకోవాలి: లక్ష్మణ్
భారత వైమానిక దళం పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేయడాన్ని దేశ ప్రజలు స్వాగతిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం పాకిస్తాన్ ఇకనైనా మానుకోవాలని పేర్కొన్నారు. ఇది ఒక దేశంపైనో, ప్రాంతంపైనో దాడి కాదని, దీనిని ప్రతీకార చర్యగా కాకుండా ఉగ్రవాదాన్ని అణిచివేసే చర్యగానే చూడాలని తెలిపారు. దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి భారత సేనలు జైషే మహ్మద్ లాంటి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాయని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment