నల్లగొండ టూటౌన్ : దేశంలోని అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రధానమంత్రి మోదీ సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ అన్నారు. సోమవారం స్థానిక బీజేపీ కార్యాలయంలో జరిగిన పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మోదీ దేశంలోని ప్రజలందరికీ అవినీతి రహిత పాలన అందిస్తూ వారి అభ్యున్నతి కోసం అహర్నిశలు పని చేస్తున్నారని తెలిపారు. 70 ఏళ్లలో కాంగ్రెస్ చేయలేని అభివృద్ధిని మోదీ 30 నెలల్లో చేసి చూపించారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రచారం చేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. అనేక పథకాలు ప్రవేశ పెట్టి అన్ని వర్గాల ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలిచిందని చెప్పారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులను ప్రజలను చీదరించుకుంటున్నారని, దేశ భవిష్యత్ కోసం, పేద ప్రజల కోసం పెద్ద నోట్లు రద్దు చేశారని తెలిపారు.
ముస్లింలను మభ్యపెడుతున్న టీఆర్‌ఎస్
మతపరమైన రిజర్వేషన్లు సాధ్యం కాకున్నా.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ముస్లింలను మభ్యపెడుతోందని అన్నారు. అన్ని వర్గాల పేదలకు లబ్ధి చేకూరేలా ఆర్థిక పరమైన రిజర్వేషన్లు తెస్తే మద్దతిస్తామని పేర్కొన్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని సీఎం కేసీఆర్ చెప్పడం హాస్యాస్పదమన్నారు. 50 శాతం రిజర్వేషన్లు మించొద్దని సుప్రీంకోర్డు చెప్పిందని గుర్తు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను విస్మరించిన టీఆర్‌ఎస్‌కు పరాభవం తప్పదన్నారు. బీజేపీ అన్ని స్థాయిల్లో బలోపేతం చేస్తామని.. 2019 తెలంగాణలో బీజేపీదే అధికారం అని అన్నారు. వందేళ్ల కాంగ్రెస్ పార్టీ దేశంలో కొన్ని ప్రాంతాలకే పరిమితమైందని, వామపక్షాల పని అయిపోయిందని, ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలుగా మిగిలిపోయాయన్నారు. ఫిబ్రవరి 8 లోగా మండల కమిటీల సమావేశాలు పూర్తి చేయాలని తెలిపారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు నూకల నర్సింహారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో బీజేపీ బూత్ స్థాయి నుంచి బలోపేతం చేసి తిరుగు లేని పార్టీగా అభివృద్ధి చేస్తామన్నారు. అనంతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ను ఘనంగా సత్కరించారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. మనోహర్‌రెడ్డి, పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోలి మధుసూదన్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కంకణాల శ్రీధర్‌రెడ్డి, నాయకులు ఓరుగంటి రాములు, పాదురి కరుణ, వీరెళ్లి చంద్రశేఖర్, శ్రీరామోజు షణ్ముఖ, బెజవాడ శేఖర్, బండారు ప్రసాద్, నూకల వెంకట్‌నారాయణరెడ్డి, పోతెపాక సాంబయ్య, కూతురు సత్యవతి, రమణారెడ్డి, రావుల శ్రీనివాస్‌రెడ్డి, మెరిశెట్టి నాగేశ్వర్‌రావు, బొజ్జ నాగరాజు, పెరిక మునికుమార్, వాసుదేవుల జితేందర్‌రెడ్డి, దర్శణం వేణు, చింతల సుజాత, కొప్పు జయశ్రీ, రావెళ్ల కాశమ్మ తదితరులు పాల్గొన్నారు.
అన్ని వర్గాల సంక్షేమమే బీజేపీ లక్ష్యం
Published Tue, Jan 31 2017 2:20 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement