వరద ప్రాంతాల్లో పారిశుధ్యం అస్తవ్యస్తం | Transmitted diseases increasing in adilabad | Sakshi
Sakshi News home page

వరద ప్రాంతాల్లో పారిశుధ్యం అస్తవ్యస్తం

Published Thu, Aug 8 2013 3:57 AM | Last Updated on Fri, Sep 1 2017 9:42 PM

Transmitted diseases increasing in adilabad

ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : వర్షం, వరదలతో జిల్లా అతలాకుతలమైంది. పక్షం రోజులుగా వర్షం ఎడతెరిపి లేకుండా కురియడం, వరదలు పోటెత్తడం, మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలకు పెన్‌గంగ, ప్రాణహిత, గోదావరి ఉప్పొంగి బ్యాక్‌వాటర్ గ్రామాల్లో చేరింది. పక్షం రోజులుగా కాగజ్‌నగర్, చెన్నూర్, ఆదిలాబాద్ డివిజన్‌లలోని వందలాది గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. జైనథ్, బేల, తాంసి, కౌటాల, సిర్పూర్(టి), బెజ్జూరు, దహెగాం, వేమనపల్లి, కోటపల్లి, చెన్నూరు తదితర మండలాల్లోని గ్రామాల్లో వరదలతో జంతువుల కళేబరాలు ఇళ్లలోకి చేరాయి. చెత్తాచెదారం కొట్టుకొచ్చి గ్రామాలు కంపుకొడుతున్నాయి. డ్రెయినేజీలు, రహదారులపై నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. మంచనీటి బావుల్లో వర్షం నీరు చేరడంతో వాంతులు, విరోచనాలు అవుతున్నాయి. దోమలు, ఈగలు వృద్ధి చెంది వ్యాధులు వ్యాపిస్తున్నాయి. పక్షం రోజుల వ్యవధిలోనే ఆరుగురు మృత్యువాత పడ్డారు. వందలాది మంది జ్వరం, విషజ్వరం, డెంగీ, మలేరియా, డయేరియా, టైఫాయిడ్, ఒళ్లునొప్పులతో బాధపడుతున్నారు. అనేక పల్లెలు మంచం పట్టాయి. ప్రజలు అంటూవ్యాధులు ప్రబలే అవకాశం ఉండటంతో భయపడుతున్నారు. రహదారులు కోతలకు గురవడంతో వైద్య చేయించుకోవడానికి బయటికి వెళ్లలేని పరిస్థితి. వైద్యులు కూడా గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం లేదు. గ్రామపంచాయతీ సిబ్బంది కనీసం బ్లీచింగ్ పౌడర్, క్లోరినేషన్ చేయడం లేదు.
 
 ఉప్పొంగుతున్న వాగులు.. ప్రాణాలు హరీ..
 వర్షాలు, వరదలతో వాగులు ఉప్పొంగుతున్నాయి. రహదారులపై నుంచి వరద పారడంతో బాహ్యగ్రామాలతో సంబంధాలు తెగిపోయాయి. రహదారులు, కాజ్‌వేలు, బ్రిడ్జిలు తెగిపోవడంతో రాకపోకలు స్తంభించాయి. ఎటూ వెళ్లాలన్నా కాలినడక వెళ్లాల్సిందే. ఆసిఫాబాద్, చెన్నూర్, కాగజ్‌నగర్ డివిజన్‌లలోని కెరమెరి, బెజ్జూర్ మండలాల్లో రోగులను మంచంపై తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ఇంకొందరు పరిస్థితి విషమంగా ఉండటంతో పడవలు ఆశ్రయించారు. బెజ్జూరు మండలం నందిగామ్‌కు చెందిన దుర్గం కార్తిక్ తీవ్ర జ్వరంతో అస్వస్థతకు గురికాగా భారీ వర్షాలతో గ్రామం దాటే పరిస్థితి లేదు. దీంతో మోకాళ్లలోతు నీళ్లలో బెజ్జూరు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆలస్యం కావడంతో ప్రాణాలు వదిలాడు. ఇదే మండలంలో ఓ నిండు గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో కిలోమీటర్ వరకు వాగు దాటించి ఆస్పత్రికి చేర్పించారు. ఇదే విధంగా వేమనపల్లి మండలం జాజులపేట గ్రామంలో అంజలి అనే చిన్నారి మృత్యువాత పడింది.
 
 మందుల కొరత
 జిల్లా ఆస్పత్రులను మందుల కొరత వేధిస్తోంది. వాంతులు, విరోచనాలకు వచ్చే ఫ్యూరోజొలిడాన్, డోమ్‌పెరిడాన్ ద్రావణాలు కూడా అందుబాటులో లేవు. సాక్షాత్తు జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో కూడా ఇదే పరిస్థితి. రోగులు బయట మందుల దుకాణం నుంచి కొనుగోలు చేస్తున్నారు. వాంతులు, విరోచనాలు అయ్యేటప్పుడు ఉపశమనం కోసం ఇచ్చే ఓఆర్‌ఎస్ ద్రావణం ప్యాకెట్లు, ప్యూరోజొలిడాన్ సిరప్ కొరత ఉంది. పిల్లలకు జ్వరం కోసం పారాసిటమాల్ సిరప్ లేకపోవడంతో పరిస్థితి తీవ్రంగా ఉంది. దగ్గు కోసం ఇచ్చే వ్యాధి నిరోధక మందులు అమాక్సిలిన్ పలు ఆస్పత్రుల్లో లేవు. దగ్గు కోసం ఇచ్చే సీపీఎం సిరప్, దమ్ము కోసం ఇచ్చే సాల్‌బుటమాల్ సిరప్, దమ్ము, దగ్గు కోసం ఇచ్చే డేరిఫిలిన్ ఇంజక్షన్ కూడా లేకపోవడంతో రోగులకు సరైన చికిత్స అందడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రిమ్స్‌లోనే రోగులు ఒకే బెడ్డుపై ఇద్దరు పడుకుని చికిత్స పొందుతున్నారు. దుర్వాసన భరించలేక ముక్కు మూసుకుంటున్నారు. జిల్లాలోని ఏరియా, కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లకు కూడా పెద్ద ఎత్తున జ్వరపీడితులు రావడంతో పడకలు ఖాళీలేక ఇబ్బంది పడుతున్నారు. ఒక్కో పడకపై ఇద్దరు రోగులకు చికిత్స అందిస్తున్న దృశ్యాలు రిమ్స్‌లో ప్రతి వార్డులోను కనిపిస్తున్నాయి. దీంతో సరైన చికిత్స అందకుండానే తిరుగుముఖం పట్టిమృత్యువాత పడుతున్నారు. బజార్‌హత్నూర్ మండలం దిగ్నూర్ గ్రామానికి చెందిన ఇస్రు డయేరియా బారిన పడగా రిమ్స్‌కు చికిత్స కోసం తరలించగా సరైన చికిత్స అందించకుండానే ఆయనను డిశ్చార్జి చేయడంతో గ్రామానికి తీసుకెళ్లారు. మరుసటి రోజే మృతి చెందాడు. వైద్య సేవలు పూర్తిస్థాయిలో అందించకుండానే పలు చోట్ల మెడికల్ క్యాంపులను ఎత్తివేస్తుండడంతో వ్యాధిగ్రస్థులు సతమతమవుతున్నారు.
 
 గ్రామాల్లో పారిశుధ్యం అస్తవ్యస్తం
 వర్షాలు, వరదలతో చెత్తాచెదారం, కొత్తనీరు వచ్చి చేరింది. డ్రెయినేజీలు, రహదారులపై నీరు నిల్వ ఉంటుంది. దోమలు, ఈగలు వ్యాపిస్తున్నాయి. వీటిని నివారించడానికి బ్లీచింగ్, క్లోరినేషన్ చే యాలి. సిబ్బంది కొరత కారణంగా పారిశుధ్య కార్యక్రమాలు స జావుగా జరగడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలోని 866 గ్రామ పంచాయతీలకు గత నెల రూ.10 వేల చొప్పున ఒక్కో గ్రామ పంచాయతీకి ఎన్‌ఆర్‌హెచ్‌ఎం నిధులను మలేరియా విభాగం నుంచి విడుదల చేసినట్లు అధికారులు పేర్కొంటున్నా రు. కలుషిత నీరు తాగిన ప్రజలు అస్వస్తకు గురవుతున్నారు. దో మ లార్వాలు వృద్ధి చెందకుండా బెటైక్స్ స్ప్రే చేయాల్సి ఉన్నప్పటికి గ్రామాల్లో నిధుల కొరత కారణంగా అది జరగడం లేదు. కొత్త సర్పంచ్‌లు కొలువుదీరినప్పటికి ఇంక చెక్‌పవర్ మంజూరు కాకపోవడంతో నిధుల విడుదలలోను జాప్యం జరుగుతుంది. ఎంపీడీఓలు, స్పెషల్ అధికారులు, ఈవోఆర్డీలు పారిశుధ్య కార్యక్రమాలపై దృష్ఠిసారించకపోవడంతో పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది.
 
 వైద్యుల కొరత
 జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో 20 వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లాలో మూడు ఏరియా ఆస్పత్రులు నిర్మల్, భైంసా, మంచిర్యాల, ఆరు కమ్యునిటీ హెల్త్ సెంటర్‌లు ఖానాపూర్, ఉట్నూర్, సిర్పూర్-టి, బెల్లంపెల్లి, ఆసిఫాబాద్, నిర్మల్ ఎంసీహెచ్ ఉండగా ఏరియా, కమ్యునిటీ హెల్త్‌సెంటర్లలో సగానికిపైగా కాంట్రాక్టు డాక్టర్‌లతోనే నెట్టుకొస్తున్నారు. ఉట్నూర్, ఆసిఫాబాద్‌లో రెగ్యులర్ వైద్యులు లేరు. సిర్పూర్‌లో ఒక్కరు మాత్రమే రెగ్యులర్ వైద్యుడు ఉన్నారు. జిల్లాలో ఎజెన్సీ ప్రాంతంలోని 33 పీహెచ్‌సీలను కలుపుకొని మొత్తంగా 72 పీహెచ్‌సీలు ఉండగా 174 వైద్యుల పోస్టులకు గాను 142 మంది పనిచేస్తున్నారు. దీంట్లో 89 మంది రెగ్యులర్ కాగా 53 మంది కాంట్రాక్టు వైద్యులు ఉన్నారు. ఒక్కో వైద్యునికి మూడు, నాలుగు పీహెచ్‌సీల ఇన్‌చార్జీలుగా నియమించడంతో పూర్తిస్థాయిలో బాధ్యతలు నిర్వర్తించడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉట్నూర్ అడిషనల్ డీఎంహెచ్‌వోనే ఆరు పీహెచ్‌సీల బాధ్యతలను నిర్వర్తిస్తూ అదనంగా అడిషనల్ డీఎంహెచ్‌వో బాధ్యతలు నిర్వర్తిస్తుండడం గమనార్హం. అయినా అధకారులు వైద్య శిబిరాలు నిర్వహించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. కాగా వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి స్వామి తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement