మనీలా: ఉత్తర ఫిలిప్పీన్స్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో వరదలు పోటెత్తడంతో అధికారులు ముందస్తు జాగ్రత్తగా పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. వరదల కారణంగా ప్రభుత్వం పలు కార్యక్రమాలను వాయిదా వేసుకుంది. వరద ముంపు ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీచేసింది. ఉష్ణమండల తుఫాను యాగీ మనీలాకు ఆగ్నేయంగా ఉన్న కామరైన్స్ నోర్టే ప్రావిన్స్‌లోని విన్జోన్స్ పట్టణ తీరాన్ని తాకింది.
వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం గంటకు 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచనున్నాయి. పర్వత ప్రాంతాలలో కొండచరియలు విరిగిపడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తూర్పు కామరైన్స్ సుర్ ప్రావిన్స్‌లోని నాగా పట్టణంలో విద్యుదాఘాతంతో ఒకరు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. మనీలాతో సహా దేశంలోని అత్యధిక జనాభా కలిగిన ప్రాంతమైన లుజోన్‌లో టైఫూన్ హెచ్చరికలు జారీ అయ్యాయి. తుఫాను వాతావరణం కారణంగా పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు మూసివేశారు. రాజధానికి సమీపంలో ఉన్న మరికినా నదిలో నీటిమట్టం పెరిగిన దృష్ట్యా స్థానికులను హెచ్చరిస్తూ అధికారులు సైరన్ మోగించారు.
ఉత్తర సమర్ ప్రావిన్స్‌లోని కోస్ట్ గార్డు సిబ్బంది రెండు గ్రామాలకు చెందిన 40 మందిని రక్షించారు. తుఫాను కారణంగా పలు ఓడరేవుల్లో షిప్పింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. తుఫాను వాతావరణం కారణంగా పలు దేశీయ విమానాల రాకపోకలను రద్దుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment