భారీ వర్షాల ప్రభావం: ప్రధాని మోదీ పూణె పర్యటన రద్దు | PM Modi's Visit to Pune Cancelled Due to Heavy Rains | Sakshi
Sakshi News home page

భారీ వర్షాల ప్రభావం: ప్రధాని మోదీ పూణె పర్యటన రద్దు

Published Thu, Sep 26 2024 11:19 AM | Last Updated on Thu, Sep 26 2024 11:35 AM

PM Modi's Visit to Pune Cancelled Due to Heavy Rains

న్యూఢిల్లీ: మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా ప్రధాని నరేంద్ర మోదీ తన పూణె పర్యటనను రద్దు చేసుకున్నారు. రాష్ట్రంలోని పలు నగరాలను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. రోడ్లపైకి నీరు చేరడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ప్రధాని మోదీ ఈరోజు (గురువారం) పుణె మెట్రో రైలు ప్రారంభోత్సవంతో పాటు రూ.22,600 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయాల్సి ఉంది. అయితే భారీ వర్షాల దృష్ట్యా ప్రధాని మోదీ తన పర్యటనను రద్దు చేసుకున్నారు.

భారీ వర్షాల కారణంగా పూణె, పింప్రీ చించ్వాడ్‌లలో పాఠశాలలు, కళాశాలలను  మూసివేశారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. కుండపోత వర్షాల కారణంగా గోవండి-మాన్‌ఖుర్ద్ మధ్య నడిచే ముంబై లోకల్ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పుణె జిల్లాకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. పౌరులు అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రావద్దని, అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

జాతీయ సూపర్‌కంప్యూటింగ్ మిషన్ (ఎన్‌ఎస్‌ఎం) కింద సుమారు రూ. 130 కోట్లతో అభివృద్ధి చేసిన మూడు పరమ రుద్ర సూపర్ కంప్యూటర్‌లను జాతికి అంకితం చేసే కార్యక్రమంలో నేడు ప్రధాని పాల్గొనాల్సి ఉంది.  అలాగే వాతావరణ పరిశోధనల కోసం రూపొందించిన హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ (హెచ్‌పీసీ)సిస్టమ్‌ను కూడా ప్రధాని ప్రారంభించాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్‌కు రూ. 850 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు. అయితే భారీ వర్షాల కారణంగా ఈ కార్యక్రమాలన్నీ నేడు రద్దయ్యాయి.

ఇది కూడా చదవండి: ముంబయిలో భారీ వర్షం.. విమానాల దారి మళ్లింపు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement