ఆశించినంతగా ఈ ఏడాది వర్షాలు కురవక పోవడంతో ...
3 రాష్ట్రాలకు తాగునీటి కష్టాలు
జలాశయంలో 10 అడుగుల మేర చేరుకున్న పూడిక
వట్టిపోయిన రాజోళిబండ జలాశయం మళ్లింపు పథకం రాయచూరు రూరల్ : ఆశించినంతగా ఈ ఏడాది వర్షాలు కురవక పోవడంతో జలాశయాలు వెలవెలబోతున్నాయి. దీనికి తోడు వేసవి ఎండలు అధికం కావడంతో నీటి కొరత అధికమైంది. దీంతో ప్రజలు, పశువులకు తాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాయచూరు జిల్లాలోని మాన్వి తాలూకా రాజోళిబండ గ్రామం వద్ద తుంగభద్ర నదికి అడ్డంగానిర్మించిన రాజోళిబండ మళ్లింపు పథకం (ఆర్‌డీఎస్) జలాశయం నీరు లేక వట్టిపోయింది. రాజోళిబండ జలాశయంలో 10 అడుగుల మేర పూడిక పేరుకు పోయింది.
రాజోళి బండ జలాశయం నీరు లేక వట్టిపోవడంతో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు వేసవిలో తాగునీటి ఇబ్బందులు ఎదురు కానున్నాయి. తుంగభద్ర నది తీర ప్రాంతంలోని రాయచూరు మాన్వి తాలూకా రాజోళిబండ, తిమ్మాపుర , రాజోళి, కాతరకి, దద్దల, రాయచూరు తాలూకా కుటక నూరు, ఆయనూరు, అరనళ్లి, ఎలెబిచ్చాలి, గట్టుబిచ్చాలి, హనుమాపుర, గోరకల్, జుకూర, కంబాలనత్తి, తెలంగాణలోని గద్వాల, శాంతినగర్, ఐజ, ఆంధ్రప్రదేశ్‌లోని మాధవరం, మంత్రాలయం ప్రాంతాలోని వేలాది గ్రామాల ప్రజలు తాగునీటి కోసం నానాయాతన పడుతున్నారు.