జలసిరి ఆవిరి
- శివారు ప్రాంతాలకు నీటి సరఫరాలో కోత
- వట్టిపోయిన జంట జలాశయాలు
- వరుణుడి కరుణపైనే జలమండలి ఆశలు
- ఇప్పటికైతే లోటు వర్షపాతం నమోదు
- ఆందోళన చెందుతున్న జలమండలి అధికారులు, జనం
సాక్షి, సిటీబ్యూరో: గతేడాదితో పోలిస్తే జలాశయాల్లో రెండు మూడడుగుల మేర నీటి నిల్వలు ఎక్కువే ఉన్నట్టు గణాంకాలు చూపిస్తున్నారు. కానీ, సరిపడా తాగునీటిని సరఫరా చేయలేక నగరవాసుల గొంతెండబెడుతున్నారు. ఇదీ జలమండలి అధికారుల తీరు. వర్షాకాలంలోనూ నగరంలో నీటికి కటకట ఏర్పడింది. సీజన్ ప్రారంభమై నెలవుతున్నా లోటు వర్షపాతం నమోదు కావడంతో జలాశయాలు డెడ్ స్టోరేజీకి చేరుకున్నాయి. ఫలితంగా మంచినీటి సరఫరాలో జలమండలి అధికారులు కోతలు విధిస్తుండడంతో జనం అల్లాడిపోతున్నారు. ఇప్పుడు ఇవేం కోతలంటూ మండిపడుతున్నారు.
నైరుతి రుతుపవనాలు నగరాన్ని తాకినా ఆశించిన మేర వర్షాలు కురవలేదు. దీంతో గ్రేటర్ దాహార్తిని తీరుస్తున్న జలాశయాల్లో నీటినిల్వలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇప్పుడిప్పుడే రుతుపవనాలు క్రమంగా విస్తరిస్తున్నాయని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. వరుణుడు కరుణించని పక్షంలోనీటి నిల్వలు మరింత తగ్గే ప్రమాదం ఉందని జలమండలి వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
వరుస వర్షాలతో ఇప్పటికే జలాశయాలు జలకళ సంతరించుకోవాల్సిన తరుణంలో ఈదురుగాలులు, ఎండవేడిమితో ఆయా జలాశయాల్లోని నీరు ఆవిరవుతోంది. సాధారణంగా ఏటా జూన్ చివరి నాటికి మహా నగరం పరిధిలో సాధారణ వర్షపాతం 121.8 మిల్లీమీటర్లుగా నమోదు కావాలి. కానీ ఈసారి కేవలం 81.6 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదైంది. అంటే 40.2 మిల్లీమీటర్ల వర్షపాతం లోటు ఏర్పడింది.
మరోవైపు జలాశయాల ఎగువ ప్రాంతాల్లోనూ తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ఇన్‌ఫ్లో(జలాశయాల్లోకి వచ్చే నీరు) లేకుండా పోయింది. అదీగాక ఉష్ణోగ్రతలు తగ్గకపోవడంతో రోజురోజుకూ ఆవిరయ్యే నీటిశాతమూ పెరుగుతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఎల్ నినో ప్రభావం వల్లే జూన్‌లో వర్షాలు కురవలేదని, జూలై మొదటి వారంలో పుష్కలంగా వర్షాలు కురుస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
3.50 లక్షల కుళాయిలకు అరకొర నీటి సరఫరా
అప్రకటితవిద్యుత్ కోతలు, జలాశయాల్లో తగ్గుతున్న నీటి నిల్వల నేపథ్యంలో నగరంలో జలమండలి నీటి సరఫరాలో కోతలు విధిస్తోంది. పాతనగరం, కాప్రా, మల్కాజిగిరి, అల్వాల్, బోడుప్పల్, హయత్‌నగర్, కర్మన్‌ఘాట్, ఉప్పల్, బాలానగర్, కుత్బుల్లాపూర్, సైనిక్‌పురి, శేరిలింగంపల్లి, మియాపూర్, చందానగర్, కూకట్‌పల్లి తదితర శివారు ప్రాంతాలకు వారం, పది రోజులకోమారు మాత్రమే నీటిని సరఫరా చేస్తున్నారు. జలమండలి పరిధిలో 8.05 లక్షల కుళాయి కనెక్షన్లు ఉండగా ఏకంగా 3.50 లక్షల కనెక్షన్లకు అరకొర నీటిని సరఫరా చేస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాల వాసులు మంచి నీటికి నిత్యం అవస్థలు పడుతున్నారు.
సాంకేతికంగా ఇబ్బందులు..
ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌తోపాటు నగరానికి నీటిని సరఫరా చేసే జలాశయాల్లో నీటిమట్టం డెడ్ స్టోరేజికి చేరుకున్నాయి. విచిత్రమేమిటంటే గత ఏడాది జూన్ 28 నాటికి ఈ ఏడాది అదే తేదీ నాటికి జలాశయాల నిల్వలను పరిశీలిస్తే ఈసారి కాస్త ఎక్కువే ఉన్నట్టున్నా.. సాంకేతికంగా పరిశీలిస్తే నీటిమట్టాలు గత ఏడాదికంటే తక్కువేనని అధికారులు చెబుతున్నారు.