బిరబిరా కృష్ణమ్మ..!
ఆల్మట్టి ప్రాజెక్టులో 15 క్రస్టుగేట్ల ఎత్తివేత
‘జూరాల’లో పూర్తిస్థాయి నీటిమట్టం
గద్వాల: కృష్ణమ్మ బిరబిరా పరుగులిడుతోంది.. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల క్రస్టుగేట్లను ఎత్తడంతో ప్రవాహం ఉరకలెత్తుతోంది.. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. జూరాల ఆయకట్టు పరిధిలో ఖరీఫ్ సీజన్ పంటలకు రెండు ప్రధాన కాల్వల ద్వారా సాగునీటిని మంగళవారం మహబూబ్‌నగర్ జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ విడుదల చేశారు. ప్రస్తుతం ఆల్మట్టి ప్రాజెక్టు రిజర్వాయర్ నీటిమట్టం 1705 అడుగులు కాగా, ఎగువప్రాంతం నుంచి వస్తున్న ఇన్‌ఫ్లోతో 1702 అడుగులకు చేరింది. దీంతో కర్ణాటక అధికారులు ఆల్మట్టి ప్రాజెక్టులో 15 క్రస్టుగేట్లను ఒక మీటరు పెకైత్తి దిగువనదిలోకి 72,298 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ రిజర్వాయర్‌కు ఆల్మట్టి నుంచి భారీస్థాయిలో ఇన్‌ఫ్లో వస్తుండడంతో ప్రాజెక్టులో 25 క్రస్టుగేట్లను ఎత్తి దిగువనున్న జూరాల ప్రాజెక్టుకు 36,478 క్యూసెక్కుల ప్రవాహాన్ని విడుదల చేస్తున్నారు. దీంతో జూరాల జలవిద్యుత్ కేంద్రంలో ఉన్న ఆరు టర్బైన్ల ద్వారా జలవిద్యుదుత్పత్తి చేస్తూ వరద ప్రవాహాన్ని శ్రీశైలం రిజర్వాయర్‌కు బుధవారం నుంచే విడుదల చేయనున్నారు. ఇలా రాష్ట్రంలోని జూరాల, శ్రీశైలం రిజర్వాయర్లకు ఈ వర్షాకాలంలో మొదటిసారిగా కృష్ణమ్మ పరవళ్లు ప్రారంభం కానున్నాయి.
తాలిపేరుకు పోటెత్తిన వరద
చర్ల: ఛత్తీస్‌గఢ్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు తాలిపేరు ప్రాజెక్ట్‌లోకి మంగళవారం వరదనీరు పోటెత్తింది. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ప్రాజెక్ట్‌కు ఐదు గేట్లను మూడు అడుగుల మేర ఎత్తి ఉంచారు. సుమారు 20 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. మధ్యాహ్నం నాలుగుగేట్లను ఎత్తి ఆరువేల క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేయగా సాయంత్రానికి వరద మరింతగా పెరగడంతో మరో గేటును, మిగతా గేట్లను కూడా మూడు అడుగుల మేర ఎత్తారు. 20 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. రాత్రి 8 గంటలకు వరదనీటి ఉధృతి తగ్గుముఖం పట్టింది. రెండుగేట్లను మూసివేసి మూడు గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.