సాగునీరు సందేహమే
తంగెడ మేజర్ కాలువ పరిధిలోని వ్యవసాయ భూములకు ఈ ఏడాది సక్రమంగా సాగునీరు అందే పరిస్థితి కన్పించటం లేదు. 35 వేల ఎకరాలకు సాగునీరు అందించే ఈ కాలువ పూర్తిగా పిచ్చి మొక్కలతోను, పూడికతోనూ నిండిపోయింది. కరకట్టలు పూర్తిగా దెబ్బతిన్నాయి. డ్రాప్‌లు శిథిల స్థితికి చేరాయి. అయినప్పటికీ ఆధునీకరణ పనులు ముందుకు సాగక పోవడంతో ఖరీఫ్‌కు ఈ కాల్వ పరిధిలో చివరి భూములకు సాగునీరు అందడం కష్టమేనని అన్నదాతలు భావిస్తున్నారు. తంగెడ మేజర్ కాలువలను నిర్మించిన తరువాత ఇప్పటి వరకు కనీస మరమ్మతులు చేపట్టలేదు. పిడుగురాళ్ల మండలం శాంతినగర్ నుంచి దాచేపల్లి మండలం తంగెడ వరకు 8 కిలో మీటర్లకుపైగా కాలువలో చెట్లు, రబ్బరు ఆకులు మెండుగా పెరిగి ఉన్నాయి. కరకట్టలపై, కాలువలో ముళ్లచెట్లు పెరిగి ఉన్నాయి. కాల్వలో అల్లుకుపోయిన రబ్బరు ఆకులు సాగునీరు పారుదలకు ఆటంకంగా మారాయి.
కొన్నిచోట్ల కరకట్టలు బాగా బలహీనంగా ఉండి నీటి పారుదల ఎక్కువైయితే తెగిపోయే ప్రమాదం ఉంది. ముత్యాలంపాడు అడ్డరోడ్డు వద్ద తంగెడ మేజర్ కాలువ కోతకు గురైంది. నాగార్జునసాగర్ కుడికాలువ ఆధునీకరణ పనుల్లో భాగంగా 35వేల ఎకరాలకు సాగునీరు అందించే ఈకాలువ ఆధునీకరణ పనులు చేపట్టాలని అధికారులు భావించారు. జూలకల్లు బ్రాంచి నుంచి 25 కిలోమీటర్ల పొడవు ఉండే తంగెడ మేజర్ కాల్వకు రూ.14.50 కోట్ల అంచనా వ్యయంతో ఆధునీకరణ చేయాలని 2012 జూలైలో పనులు ప్రారంభించారు. 38 నెలల్లో పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. పూడికతో పాటుగా శిథిలావస్థకు చేరిన డ్రాప్ట్‌ల స్థానంలో కొత్తగా నిర్మించటం, సిమెంట్ లైనింగ్ పనులు, కరక ట్టల బలోపేతం వంటి పనులను చేపట్టాల్సి ఉంది. ఈ కాలువ పరిధిలో ఉన్న 32 డ్రాప్‌లకు గాను ఇప్పటికే 28 నిర్మించారు. మరో నాలుగు నిర్మించాల్సి ఉంది.
ఐదు వేల ఎకరాలకూ అనుమానమే..
కాల్వ ఆధునికీరణ పనులు అనుకున్నంత వేగంగా జరగడం లేదు. సాగునీరు నిలిపివేసిన తరువాత పనులు చేపట్టటంలో జాప్యం జరిగింది. కాంట్రాక్టర్ సకాలంలో పనులు చేపట్టకపోవటంతో ఈ ఖరీప్ సీజన్‌లో సకాలంలో పంటలకు సాగునీరు అందే పరిస్థితి కన్పించటంలేదు. డ్రాప్‌ల నిర్మాణం దాదాపు పూర్తికావచ్చినా కాలువలో పెరిగిన ముళ్లచెట్లు, రబ్బరు ఆకులు, కరకట్టల బలోపేతం, పూడికతీత పనులను చేపట్టాల్సి ఉంది. ఈ కాలువ కింద ఉన్న సుమారు 5వేల ఎకరాల చివరి భూములకు సాగునీరు అందకపోవటంతో ఆ భూముల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పంటలకు నీళ్లతడి వేయలంటే అన్నదాతలు రేయింబవళ్లు కాలువపై జాగారం చేయాల్సిన పరిస్థితులున్నాయి. ఈ ఏడాదైయిన కాలువ ఆధునికీకరణ పనులు ముగిస్తే చివరిభూములకు కూడా సాగునీరు అందుతుందని రైతులు ఆశపడ్డారు. అనుకున్న విధంగా పనులు ముందుకు సాగకపోవడం ప్రస్తుతం వారిని కలవర పెడుతోంది.
పనులను వేగవంతం చేస్తున్నాం.. తంగెడ మేజర్‌కాలువ ఆధునీకరణ పనులను వేగవంతంగా చేయిస్తున్నాం. డ్రాప్‌ల నిర్మాణం దాదాపుగా పూర్తయింది. కొన్నిచోట్ల చెట్ల తొలగింపు, కాలువలో పెరిగిన రబ్బరు ఆకుల తొలగింపు చేపట్టాలి. నిర్ణీత సమయానికి పనులు పూర్తవుతాయని భావిస్తున్నాం. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఖరీఫ్ సీజన్‌లో వ్యవసాయ పంటలకు సాగునీరు అందించే ఏర్పాట్లు చేస్తాం.-ఇరిగేషన్ ఏఈ ఆదినారాయణ