దంపతుల విషాదాంతం
=ఆర్థిక బాధలే ఆత్మహత్యకు కారణమని అనుమానం
=కారులోనే పురుగు మందు తాగి బలవన్మరణం
=అనాథలుగా ఇద్దరు కుమారులు
తగరపువలస రూరల్, న్యూస్‌లైన్: ఆర్థిక సమస్యలే ఆ దంపతులను పొట్టన పెట్టుకున్నాయి. వారి ఇద్దరు కొడుకుల్నీ అనాథల్ని చేశాయి. భీమునిపట్నం శివారులో బుధవారం సాయంత్రం కారు లో భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పడిన వైనం వెలుగుచూసింది (సంఘటన వివరాలు మెయిన్‌లో). మురళీనగర్ ఎన్జీవో కాలనీకి చెందిన దర్భా వెంకటేష్ (40) సత్యసాయి కన్‌స్ట్రక్షన్ పేరిట రైల్వేలో సివిల్ కాంట్రాక్టర్‌గా పనులు చేయించేవారు. ఆయన భార్య హేమలత కొమ్మాదిలోని ఓ ప్రయివేటు స్కూలులో హిందీ పండిట్. మంగళవారం ఈ దంపతులు ఆత్మహత్యకు పాల్పడారు.
ఆత్మహత్యకు ముందు సం ఘటన స్థలం నుంచి పెద్ద కుమారుడు తేజకు తల్లి ఫోన్ చేసింది. ‘ఎక్కడ ఉన్నావు అమ్మా’ అని ప్రశ్నిస్తే భీమిలి దగ్గరలో ఉన్నామని సమాధానం చెప్పింది. తర్వాత తండ్రి ఫోన్ చేసి జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. ఇవే తమ తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆఖరి మాటలని చెబుతూ తేజ రోదించాడు. కారులో వెళ్లిన తమ తల్లితండ్రులు ఎంతకీ రాకపోయేసరికి అనుమానంతో మంగళవారం సాయంత్రం తేజ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మర్నాడు ఉదయం వెతుకుతామని పోలీసులు వీరికి చెప్పారు. కుటుంబ సభ్యులు వీరి ఆచూకీ కోసం అన్వేషిస్తుండగా వెంకటేష్ ప్రయాణించిన కారు దొరతోట సమీపంలో కనిపించింది. వెళ్లిచూడగా వెంకటేష్..హేమలతలు విగతజీవులై కనిపించారు.
ఇది తెలిశాక భీమిలి ఇన్‌స్పెక్టర్ ఎస్.లక్ష్మణమూర్తి సిబ్బందితో సంఘటన స్థలికి చేరుకున్నారు. కారు డోర్లు తెరుచుకోకపోవడంతో పగులగొట్టి తెరిచారు. అప్పటికే మృతదేహాలు పాడై దుర్వాసన వస్తున్నాయి. మృతునిది కృష్ణా జిల్లా గుడివాడ., మృతురాలిది మధ్యప్రదేశ్ బాలాఘడ్ జిల్లా. వీరికి 1996లో వివాహమైంది. బతుకు తెరువు కోసం విశాఖ వచ్చి కొన్నేళ్ల క్రితం స్థిరపడ్డారు. వీరికి తేజ, స్వరూప్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. తేజ రామా టాకీస్ చైతన్యలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. స్వరూప్ స్థానిక రోమన్ స్కూలులో పదవ తరగతి చదువుతున్నాడు.
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రైల్వే కాంట్రాక్టరు పనిచేసిన వెంకటేష్ కొద్దికాలంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాడు. బిల్లులు సకాలంలో రాకపోవడంతో అప్పులు చేశాడు. ఈ ఒత్తిడి బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో చెక్కు బౌన్సు అయింది. పోలీసు కేసు నమోదయింది. పోలీసులు విచారణ నిమిత్తం పిలవడంతో భార్యాభర్తలు భయంతో ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పరువు పోతుందన్న భయంతో దంపతులు బలవన్మరణం పొంది ఉంటారంటున్నారు.