తిరుమలగిరి : సేంద్రియ పద్ధతులతో పంటలు పండించే రోజులు పోయాయి. ప్రస్తుతం ప్రతి పంటకు క్రిమిసంహారక మందులను పిచికారీ చేయడం సర్వసాధారణమైంది. చీడపీడలు సేంద్రియ మందులకు సైతం లొంగని పరిస్థితి ప్రస్తుతం ఏర్పడటంతో రసాయన మందులు అధిక మోతాదులో పిచికారీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం ప్రధానంగా పత్తి, వరి, పెసర తదితర పంటలకు తెగులు ఆశించడంతో రైతులు రసాయన మందులు కొడుతున్నారు. ఈ నేపథ్యంలో క్రిమిసంహారక మందులను ఎలా పిచికారీ చేయాలి.. రైతుల ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మండల వ్యవసాయాధికారి వెంకటేశ్వర్లు ఇస్తున్న పలు సూచనలు ఆయన మాటల్లోనే..
రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..
1. పురుగుమందుల డబ్బాలను వినియోగించడానికి ముందు డబ్బాపై ఉన్నలేబుళ్లు, వివరాల పత్రాలను జాగ్రత్తగా చదవాలి.
2. క్రిమి సంహారక మందులు నీటిలో కలిపేటప్పుడు చేతితో కాకుండా చిన్నపాటి కట్టెతో కలపాలి.
3. దుస్తులపై గాని, కిందగాని పడనీయకుండా ఇతర సాధనాలను ఉపయోగించి పిచికారీ చేసే డబ్బాలో పోసుకోవాలి.
4. పిచికారీ సమయంలో శరీరానికి పూర్తి రక్షణ కల్పించే దుస్తులు ధరించాలి. ముక్కులకు మాస్కులు, చేతులకు తొడుగులు, కళ్లకు అద్దాలు, కాళ్లకు నిండుగా బూట్లు ధరించిన తరువాతనే పిచికారీ చేయాలి.
5. గాలి వీచే దశలోనే మందులను పిచికారీ చేయాలి.
6. గాలికి ఎదురుగా పిచికారీ చేయడం ప్రాణాంతకం.
7. డబ్బాలకు గల నాజిళ్లు శుభ్ర పరచడానికి నోటితో గాలిని ఊదవొద్దు.
8. ఆహార పదార్థాలతో పాటు పురుగు మందులను తీసుకెళ్లకూడదు.
9. ప్రధానంగా పురుగు మందుల డబ్బాను పిల్లలకు అందకుండా ఎల్తైన ప్రదేశాల్లో భద్రపర్చుకోవాలి.
10. పురుగు మందులను పిచికారీ చేసేటప్పుడు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవద్దు.
11. బీడీ, సిగరెట్‌లు తాగవద్దు.
12. పిచికారీ సమయంలో మందు ఒంటిపై గాని, దుస్తులపై పడగానే వెంటనే శుభ్రం చేసుకోవాలి.
13. పిచికారీ చేసిన తరువాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.
14. కాలి మందుల డబ్బాలను ధ్వంసం చేయడం, కాల్చి వేయడం లేదా గొయ్యి తవ్వి పాతిపెట్టాలి.
15. మందు చల్లిన పొలం వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి.
16. ప్రమాదవశాత్తు విష ప్రమాదానికి లోనయితే వెంటనే వైద్యుల వద్దకు వెళ్లి చికిత్స చేయించుకోవాలి.
17. ఏ పురుగు మందులను వాడారో ఆ కరపత్రాన్ని వైద్యులకు చూపించినట్లయితే వైద్యం చేయడం సులభమవుతుంది.