మెతుకు పండితే.. బతుకు పండగే
పుడమి గొంతులో పురుగు మందు పోస్తున్నారు. మొలకెత్తింది విషబీజమని తెలియక మురిసిపోతున్నారు. రుచిలేని దిగుబడి అద్భుతమని భ్రమిస్తున్నారు. నష్టపోయిన రోజు.. అదే పురుగు మందుతో ఊపిరి తీసుకుంటున్నారు. వీటన్నిటికీ ఒకటే పరిష్కారం.. పెట్టుబడి లేని వ్యవసాయం. బడుగు రైతు సైతం దిగుబడి సాధించాలి. ఆరోగ్యకరమైన పంటలతో ఆనందం అనుభవించాలి.. అదే లక్ష్యంగా ప్రకృతి వ్యవసాయం ఊపందుకుంటోంది. జీవామృతాలతో చేనుకు జీవం పోస్తోంది.
అన్నదాత బతుకులో ఆశలు కురిపిస్తోంది. అద్భుతమైన పంటలతో జగతికి ఆదర్శంగా నిలవాలని తపిస్తోంది. బొబ్బిలి నియోజకవర్గంలోని మెట్టవలస క్లస్టర్‌లో వ్యవసాయశాఖ సాగిస్తున్న పకృతి వ్యవసాయ ప్రస్థానం విజయవంతంగా సాగిపోతోంది.
♦ ఊపందుకున్న ప్రకృతి వ్యవసాయం
♦ మెట్టవలస క్లస్టర్‌లో ప్రయోగాత్మకంగా అమలు
♦ వరి, వేరుశనగ, చెరకు,కూరగాయ పంటల సాగు
♦ ఆసక్తి చూపుతున్న వందలాది రైతులు
బొబ్బిలి రూరల్: హరిత విప్లవం రైతుల పాలిట శాపంగా పరిణమించింది. బహుళ జాతి సంస్థల నుంచి పొటాష్ దిగుమతి చేసుకోవలసి వచ్చింది. యూరియా, నత్రజనితో మొదలైన సాగు దుష్పరిణామాలనిస్తోంది.
రసాయనాల అవశేషం పంట గింజలను విషతుల్యం చేస్తోంది. జన్యులోపాలున్న పిల్లలకు.. వ్యాధుల విజృంభణకు కారణమవుతోంది. రైతుల జీవితాలను చిది మేస్తోంది. అప్పులపాలై రోడ్డు న పడేస్తోంది. ఇవన్నీ ప్రముఖ ప్రకృతి వ్యవసాయ నిపుణుడు సుభాష్‌పాలేకర్‌ను కదిలించాయి. పెట్టుబడి లేని వ్యవసాయానికి రూపకల్పన చేయించాయి. ప్రకృతి వ్యవసాయ విధానాన్ని ఆవి ష్కరించాయి.
రుచికరమైన పోషక విలువలున్న ఆహారధాన్యాల ఉత్పత్తికి కారణమవుతున్నా యి. అన్నదాత కన్నీళ్లు తుడుస్తున్నాయి. పంటకు గిట్టుబాటుకు తెచ్చి పెడుతున్నాయి. ప్రకృతి వ్యవసాయాన్ని గుర్తించిన వ్యవసాయ శాఖ బొబ్బిలి మండలం మెట్టవలసను ఎంపిక చేసి ప్రయోగాత్మకంగా సాగు చేయిస్తోంది.
ప్రస్తుతం మెట్టవలస, గొర్లె సీతారాంపురం 100 మంది కూరగాయ రైతులు ఈ ఏడాది ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టారు. కాశిందొరవలస, నారాయణప్పవలస గ్రామాల్లో 30 మంది 100 ఎకరాల వరకు వరి, చెరకు పండిస్తున్నారు. ఈ ప్రభావంతో గోపాలరాయుడుపేట, నారసింహుని పేట, మల్లంపేటలో వేరుశనగ, చెరకు, వరి సాగు చేస్తున్నారు.
అంతా సహజసిద్ధమే
రసాయన ఎరువులు వాడకుండా సహజసిద్ధంగా లభించే ఆవుమూత్రం, ఆవుపేడ, పప్పుల పిండి, వివిధ రకాల ఆకులు, పుట్టమన్ను, బెల్లం తదితర పదార్థాలతో పండించడమే ప్రకృతి వ్యవసాయం. ప్రస్తుతం ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించే పంటలకు మంచి డిమాండ్ ఉంటోంది.
ఈ విధానంలో విత్తనశుద్ధి నుంచి పంటలకు కావలసిన పోషకపదార్థాలు, పురుగు మందుల నివారణకు రైతులే సొంతంగా మందులు తయారుచేసుకోవచ్చు. కొన్ని ప్రాంతాలలో వీటిని ఇటీవల అందుబాటులో ఉంచారు. మెట్టవలసలో ఘన జీవామృతం, ద్రవజీవామృతం, నీమాస్త్రం తయారు చేస్తున్నారు. వెలుగు ఆధ్వర్యంలో వాండ్రాసి లక్ష్మి వీటిని తయారు చేసి విక్రయిస్తోంది.
విత్తనశుద్ధికి బీజామృతం
కావలసిన పదార్ధాలు: ఇరవై లీటర్ల నీరు, 5కిలోల ఆవుపేడ, 5 లీటర్ల ఆవు మూత్రం, సున్నం 50 గ్రాములు, గుప్పెడు పుట్టమన్ను.
తయారీ విధానం: ఆవుపేడను 20 లీటర్ల నీటిలో మూటతో వేలాడదీసి, ఆవుమూత్రం, సున్నం కలిపి 12 గంటల పాటు ఉంచాలి. దీనిలో పుట్టమన్ను వేసి రోజుకు 2సార్లు కర్రతో కలిపి 3 రోజులుంచితే బీజామృతం తయారవుతుంది.
వాడే విధానం.. ఉపయోగాలు: ఈ మిశ్రమాన్ని విత్తడానికి సిద్ధంగా ఉన్న విత్తనాలపై చల్లి, నీడలో ఆరబెట్టి నాటాలి. విత్తనాల నుంచి సంక్రమించే వ్యాధులను నివారిస్తుంది. అరటి పిలకలు, చెరుకు కణుపులు, వరి, ఉల్లి, మిరప, టమాటా, వంగ మొదలైన నారును బీజామృతంలో ముంచి నాటాలి.
‘ఘన’ మైన దిగుబడికి ‘జీవామృతం’
కావలసిన పదార్ధాలు: దేశవాళీ ఆవు పేడ 10 కిలోలు, ఆవు మూత్రం 10 లీటర్లు, బెల్లం 2 కిలోలు, పప్పుదినుసుల పిండి 2 కిలోలు, గుప్పెడు పుట్టమన్ను
తయారీ విధానం: అన్ని పదార్ధాలతో ఆవు మూత్రాన్ని కలపాలి. ఈ మిశ్రమాన్ని ఓ పాత్రలో బాగా మగ్గబెట్టి 7రోజులు ఉంచాలి. రోజూ తీసి కలపాలి. ఎండబెట్టి పొడిచేసి 6 నెలలు నిల్వ ఉంచుకోవచ్చు.
ఉపయోగాలు: దీనిని ఆఖరి దుక్కులో వేస్తే పంటలకు ఎంతో మేలు కలుగుతుంది. పంటలకు కావలసిన అన్ని రకాల సూక్ష్మ, స్థూల పోషకాలకు ఉపయోగపడుతుంది.
ద్రవ జీవామృతం
కావలసిన పదార్ధాలు: నీరు 200 లీటర్లు, దేశవాళీ ఆవుపేడ 10 కిలోలు, ఆవుమూత్రం 10 లీటర్లు, బెల్లం 2కిలోలు లేదా 4 లీటర్ల చెరుకు రసం, పప్పు దినుసుల పిండి 2 కిలోలు, గుప్పెడు పుట్టమన్ను.
తయారీ విధానం: పెద్ద డ్రమ్ములో 200 లీటర్ల నీటిని పోసిపైన చెప్పిన అన్నిటినీ పోసి బాగా కర్రతో కలపాలి. ఈ ద్రావణాన్ని 4 నుంచి 7రోజులు పులియబెట్టి రోజూ 3, 4సార్లు కర్రతో కలపాలి. వారం తరువాత ద్రవజీవామృతం తయారవుతుంది.
ఉపయోగాలు: పంట నీటికాల్వలో 200 లీటర్ల జీవామృతం డ్రమ్మును ఉంచి నల్లా బిగించాలి. నీరు పారుతున్నప్పుడు నల్లా వదిలితే నీటితో పాటు ద్రవజీవామృతం పొలంలోకి వెళ్తుంది. ఎకరానికి 200 లీటర్ల జీవామృతం వాడాలి. ద్రవజీవామృతాన్ని బావిలో కూడా కలపవచ్చు. డ్రిప్ ద్వారా కూడా వేయవచ్చు. వందల లీటర్ల జీవామృతాన్ని నెలరోజుల వ్యవధిలో 3,4సార్లు చల్లుకోవాలి.
అమృతజలం
కావలసిన పదార్దాలు: పది లీటర్ల ఆవుమూత్రం, 20 కేజీల ఆవుపేడ, 15 కేజీల వేపపిండి, 400 గ్రాముల నువ్వుల నూనె, 2 కేజీల బెల్లం, 2 కేజీల పప్పు దినుసుల పిండి, 200 లీటర్ల నీరు
తయారీ విధానం: 200 లీటర్ల నీటిలో ఈ పదార్ధాలను వేసి 3రోజుల పాటు మురగనివ్వాలి. సన్నని గుడ్డతో వడబోసి మొక్కలకు సాగునీటి ద్వారా అందించాలి.
ఉపయోగం: మొక్కలకు నత్రజని, భాస్వరం, పొటాష్ అందుతుంది.
దశపర్ణి కషాయం
కావలసిన పదార్దాలు: 200 లీటర్ల నీరు, దేశవాళీ ఆవుపేడ 2 కేజీలు, ఆవుమూత్రం 10 లీటర్లు, పసుపుపొడి 200 గ్రాములు, శొంఠిపొడి 200 గ్రాములు లేదా అల్లం పొడి 500 గ్రాములు, పొగాకు కేజీ, పచ్చిమిరపకాయల పేస్టు కేజీ లేదా కారం కేజీ, వెల్లుల్లి పేస్టు 100 గ్రాములు, బంతిపూలు ఆకులు, కాండంతో సహా 2 కేజీలు తీసుకోవాలి.
కావలసిన 10 రకాల ఆకులు: వేపాకు 2కేజీలు, గానుగ ఆకు 2 కేజీలు, ఉమ్మెత్త ఆకులు 2 కేజీలు, జిల్లేడు ఆకులు 2కేజీలు, సీతాఫలం ఆకులు 2 కేజీలు, మునగ ఆకులు 2 కేజీలు, ఆముదం ఆకులు 2 కేజీలు, అత్తాకోడలు(బేలి లేదా లేంటినా) ఆకులు 2 కేజీలు, వావిలి ఆకులు 2 కేజీలు, తులసి లేదా అడవి తులసి ఆకులు అరకేజీ తీసుకోవాలి.
తయారీ విధానం: ముందుగా పదార్ధాలు, పేస్టు, ఆవుమూత్రం, పేడను డ్రమ్ములో కలిపి వేయాలి. పదిరకాల ఆకులను మెత్తగా దంచి వాటిని డ్రమ్ములో కలిపి రోజూ 3సార్లు గడియారం ముళ్లు తిరిగే దిశలో 3నిమిషాల పాటు తిప్పాలి. ఇలా 40 రోజులు నిల్వ ఉంచి రోజూ తిప్పాలి. 41వ రోజున తీస్తే మంచి కషాయం తయారవుతుంది. దీన్ని పలుచని గుడ్డతో వడకట్టి 6 నుంచి 10 లీటర్ల కషాయాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరాకు వేయాలి. ఈ కషాయం 6 నెలల వరకు నిల్వ ఉంటుంది.
ఉపయోగాలు: వరిపై రసం పీల్చేపురుగు నివారిస్తుంది. మామిడిలో బూడిద తెగులు నివారిస్తుంది.
కీటక నాశని నీమాస్త్రం
కావలసిన పదార్ధాలు: నీరు 200 లీటర్లు, ఆవుపేడ 2 కిలోలు, ఆవుమూత్రం 10 లీటర్లు, వేపాకులు, రెమ్మలు,చిగుర్లు 10 కిలోలు
తయారీ విధానం: పది కిలోల వేపను బాగా రుబ్బి, 200 లీటర్ల నీటిని తీసుకుని డ్రమ్‌లో బాగా కలపాలి. పది లీటర్ల ఆవుమూత్రం కలిపి, ఇందులో 2 కిలోల ఆవుపేడను కర్రతో బాగా తిప్పి కలపాలి. 48 గంటల వరకు మూసి ఉంచి రోజూ 3సార్లు కలపాలి. తరువాత పలుచని గుడ్డతో వడగడితే నీమాస్త్రం తయారవుతుంది.
ఉపయోగాలు: నీమాస్త్రాన్ని పంటపొలాల్లో చల్లితే అన్నిరకాల పురుగుల గుడ్లను చంపుతుంది. తెగుళ్ల నివారణకు దోహదపడుతుంది. పంట విత్తిన 20, 45, 60 రోజులకోమారు చల్లాలి.
రైతులకు వరం
ప్రకృతి వ్యవసాయం రైతులకు వరం. బొబ్బిలి క్లస్టర్‌లో ప్రయోగాత్మకంగా వాడుతున్నాం. వీలైనంత ఎక్కువ మంది రైతులతో ప్రకృతి సేద్యం చేయిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయంపై అందరికీ అవగాహన పెంపొందించాలి.
- ఎం.శ్యామసుందరరావు, ఏవో, బొబ్బిలి
ప్రకృతి వ్యవసాయంతో లాభాలు
ప్రకృతి వ్యవసాయంలో వరి, చెరుకు పండిస్తున్నాను. పంట దిగుబడి బాగుంది. పంటకు ధర బాగానే వస్తోంది. ఎలాంటి రసాయనాలు లేని పంటలు పండించాననే సంతృప్తి కలుగుతోంది. నాలుగెకరాల్లో వరివేసి ఘనజీవామృతం వేసి పంటలు పండిస్తున్నాను.
- బలగ సింహాచలమ్మ, మల్లమ్మపేట
ఎంతో లాభదాయకం
సేంద్రియ వ్యవసాయం బాగుంది. దశపర్ణి కషాయంతో చెరుకు, వరి పంటలు పండిస్తున్నాను. ప్రస్తుతం చెరో 4 ఎకరాల్లో వరి, చెరుకు వేశాను. వేరుశనగ పంట పండిస్తున్నాను. రాబోయే రోజుల్లో మరింత విస్తరించి ప్రకృతి వ్యవసాయం చేస్తాను. ఈ వ్యవసాయం లాభదాయకం
- కర్రి శ్రీనివాసరావు, గోపాలరాయుడు పేట