వ్యవసాయం వ్యయసాయంగా మారింది. రైతుల లోగిళ్లలో మరణ మృదంగం మోగిస్తోంది. మూడేళ్లుగా ప్రకృతి ప్రతికూలత, మార్కెట్ మాయాజాలంతో అప్పుల పాలైన రైతులు తీర్చే మార్గం కనుచూపు మేరలో కనపడక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 15 నెలల వ్యవధిలో జిల్లాలో 52 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
కొరిటెపాడు(గుంటూరు): జిల్లాలో ఒక్క సెప్టెంబరు నెలలోనే 8 మంది, అక్టోబరులో ఇ ప్పటివరకు ఏడుగురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వీరంతా సాధారణ, మధ్య తరగతి కౌలు రైతులు. రైతులకు భరోసా కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలను ఆదుకునేందుకు ప్రకటించిన ప్యాకేజీ అరకొరగా ఉంది. అదీ సకాలంలో అందని పరిస్థితి నెలకొంది.
గత సీజన్ ఉత్పత్తులు ఇంకా అమ్ముడుపోలేదు :గత సీజన్ పంట ఉత్పత్తుల అమ్మకాలు నేటికీ పూర్తి కాకపోవడం, అంతకుముందు ఏడాది కలసి రాకపోవడం, ఈ సీజన్‌లో సాగునీటి కొరత వెన్నాడుతూ ఉండటంతో రైతులు మనోధైర్యం కోల్పోతున్నారు. తీసుకున్న అప్పులు తీర్చే మార్గం కన్పించక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. జిల్లాలో ఖరీఫ్, రబీ సీజన్లు కలిపి సుమారు 27 లక్షల ఎకరాల్లో ఏడు లక్షల మంది రైతులు వివిధ పంటలు సాగు చేస్తున్నారు. వారిలో చిన్న, సన్నకారు రైతులే కాక, కౌలుకు చేసుకునే వారు అధికం. వ్యవసాయమే ఎక్కువ శాతం రైతు కుటుంబాలకు జీవనాధారంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఒకటి, రెండు సంవత్సరాలు ఏదైనా ఇబ్బందికర పరిస్థితి వస్తే దానిని తట్టుకునే శక్తిలేక బలవర్మరణాలకు పాల్పడుతున్నారు. గడచిన సీజన్‌లో జిల్లాలో పత్తి, వరి, మిరప, మొక్కజొన్న, కంది వంటి పంటలు విస్తారంగా సాగుచేశారు. అయితే ప్రకృతి ప్రతికూలత కారణంగా పెట్టుబడి ఖర్చులు ఇబ్బడిముబ్బడిగా అయ్యాయి. అందుకు అనుగుణంగా ధర దక్కలేదు. ఒక్క మిరప పంటకు మినహా ఇతర ఏఒక్క దానికీ గిట్టుబాటు ధర లభించలేదు. ఈ పంటలు సాగుచేసే వారిలో ఎక్కువ శాతం కౌలు రైతులతో పాటు చిన్న, సన్నకారు రైతులు కావడంతో బ్యాంకుల నుంచి అవసరమైన మేర రుణాలు పొందలేక ప్రైవేట్ వ్యక్తుల నుంచి అధిక వడ్డీలకు అప్పలు తెచ్చారు. అంతకు ముందు సీజన్‌లోనూ ఇదే పరిస్ధితి. దీంతో వరుసగా రెండేళ్లు ఆదాయం లేక అప్పులు తీర్చేమార్గం కన్పించక అధిక శాతం రైతులు మానసికంగా కుంగిపోయారు. ఈ ఏడాది వర్షాభావం వెంటాడటంతో పంటల సాగు ముందుకు కదలలేదు. మరోవైపు అప్పులు ఇచ్చిన వారి నుంచి క్రమంగా ఒత్తిడి పెరిగింది. దీంతో ఆదాయం లేక, అప్పలు తీర్చే మార్గం కన్పించక భవిష్యత్తుపై నమ్మకాన్ని కోల్పోయిన పలువురు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నప్పటికీ రైతులకు భరోసా కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ప్రభుత్వం రూ.5లక్షలు ప్రకటించింది. సాయం పంపిణీలో జాప్యం జరుగుతోంది. కొన్ని మరణాలను ప్రభుత్వం గుర్తించడం లేదు. ఈ 15 నెలల వ్యవధిలో 52 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే జిల్లా యంత్రాంగం ఆరుగురినే గుర్తించడం గమనార్హం.
నివేదికలు జాప్యం : ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు ప్రభుత్వం పరంగా ఎటువంటి సహాయం అందడం లేదు. ఆత్మహత్యలను నిర్ధారణ చేయడానికి ప్రభుత్వం నియమించిన కమిటీలో సభ్యులైన డీఎస్పీ, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకుడు, తహశీల్దార్లు ఈ మరణాలపై నివేదిక ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారు. ప్రభుత్వం బ్యాంకులో తీసుకున్న రుణాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటుంది. ప్రైవేట్ వ్యక్తుల నుంచి తీసుకున్న రుణాలను గుర్తించడం లేదు. దీంతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల నుంచి బాధలు తప్పడం లేదు.
-వై.రాధాకృష్ణ,
ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి
మరణ మృదంగం
Published Wed, Oct 28 2015 1:12 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement