సేంద్రియ వ్యవసాయంపై అపోహలెందుకు?
రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా పంటలు సాగు చేసే వ్యవసాయ పద్ధతులనేకం ఉన్నాయి. ఈ పద్ధతులను అవలంబిస్తున్న వ్యక్తులు, సంస్థల మధ్య వ్యవసాయంలో రసాయనాల అవసరం లేదనటం వంటి కొన్ని అంశాలపై ఏకీభావం ఉన్నప్పటికీ.. మరికొన్ని విభేదాలు కనిపిస్తున్నాయి. పరస్పర అపనమ్మకాలను, అపోహలను పక్కన పెట్టి.. అనుభవాలను కలిసి పంచుకుంటే సేంద్రియ వ్యవసాయం దిశగా వేగంగా మార్పు వస్తుందంటున్నారు డాక్టర్ జీ వీ రామాంజనేయులు.
హరిత విప్లవంతో సమస్యలు ఎదుర్కొన్న తర్వాత, భారత దేశం ఇప్పుడు వ్యవసాయంలో మరో కొత్త విప్లవానికి తయారవుతోంది. దేశవ్యాప్తంగా అనేక మంది రైతులు, సంస్థలు ప్రత్యామ్నాయ వ్యవసాయ పద్ధతుల వైపు అడుగులు వేస్తున్నారు. ఆధునిక(రసాయనిక) వ్యవసాయ పద్ధతుల్లోని నష్టాలు, పర్యావరణానికి కలుగుతున్న ముప్పు, ఆరోగ్యానికి కలుగుతున్న హానిని గుర్తెరిగి, సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు. దీనికి తోడు ఆహార పదార్థాల్లో ఆధునిక రసాయనాల అవశేషాల పట్ల వినియోగదారుల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకత సేంద్రియ వ్యవసాయ పద్ధతులకు ప్రాముఖ్యత కలిగిస్తోంది.
అయితే, సేంద్రియ వ్యవసాయం చేయటానికి అవసరమైన వనరులున్నాయా? అని ఒక వైపు, సేంద్రియ వ్యవసాయం రసాయనిక వ్యవసాయం కంటే ప్రమాదకరం? అని ఇంకొక వైపు ప్రచారాలు సాగటంతో అటు రైతుల్లోను, ఇటు వినియోగదారుల్లోను కొన్ని అనుమానాలు చోటు చేసుకుంటున్నాయి.
సేంద్రియ వనరులున్నాయా?
సేంద్రియ పద్ధతుల్లో పేడని కేవలం నత్రజని, భాస్వరం, పొటాష్ అందించే రసాయన పదార్థంగా చూడకుండా, గాలి నుంచీ నత్రజని మొదలైన వాయువులను నైట్రేట్ల రూపంలో స్థిరీకరించే సూక్ష్మజీవులను అందించే వనరుగా చూస్తాం. ఈ సూక్ష్మజీవులు పశువుల కడుపులో వుంటూ అవి తినే ఆకులూ, కొమ్మలను జీర్ణం చేసుకోవటంలో సహాయం చేస్తాయి. వీటిని వాడినప్పుడు భూమిలో కూడా అటువంటి పనే చేస్తాయి. దానికి తోడు భూమిలో వుండి.. వాడుకోదగిన రూపంలో లేని భాస్వరం లాంటి పోషకాలను అందుబాటులోకి తెస్తాయి. అయినా కేవలం నత్రజని, భాస్వరం, పొటాష్‌ల గురించి ఆలోచించినా, దేశంలో పంట వ్యర్థాలు, పశువుల పేడ రూపంలో చాలానే దొరుకుతాయి. అయితే వీటిని సేకరించటంలో సమస్యలు, ఖర్చులు, శ్రమ ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం రసాయనిక ఎరువుల మీద పెడుతున్న 60 వేల కోట్ల సబ్సిడీ (2014లో అది 70 వేల కోట్లు వున్నది. అప్పటి నుంచి భారాన్ని రైతుల మీదకు మార్చారు)లో కొంత భాగాన్ని రైతులకు నేరుగా సబ్సిడీల రూపంలో అందించవచ్చు.
దేశీ ఆవు లేకపోతే సేంద్రియ వ్యవసాయం చేయలేమా?
దేశీ ఆవు పేడ మాత్రమే వాడాలనే మాట మనకు తరచూ వినిపిస్తూ ఉంది. మిగతా జీవాలు వున్నా వాటి పేడ ఉపయోగపడదేమో అని చాలా మంది రైతులు సేంద్రియ వ్యవసాయానికి మారటానికి భయపడుతున్నారు. నిజానికి ఆవు అయినా, గేదె అయినా.. గడ్డి, పచ్చిరొట్టల మీద ఎక్కువగా ఆధారపడినవైతే వాటి పేడని రైతులు నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. అయితే, కష్టమైన వాతావరణంలో కూడా దేశీ ఆవు తట్టుకుంటుంది కాబట్టి, కొత్తగా పశువులు కొనుక్కునే వాళ్లు దేశీ ఆవును కొనుక్కుంటే మంచిది. మార్కెట్‌లో దొరికే బయో ఫెర్టిలైజర్లన్నిటిలో ఉన్న సూక్ష్మజీవులు పశువుల పేడలో ఉన్నవే.
వర్మీ కంపోస్ట్ ప్రమాదకరమా?
వర్మీ కంపోస్ట్ (వానపాముల ఎరువు) భూమిలో భారలోహాలను పెంచుతుంది, అసలు వీటి కోసం వాడే విదేశీ వానపాములు అత్యంత ప్రమాదకరం అనే అభిప్రాయం ఉంది. ఇది పూర్తిగా అపోహే. వానపాములలో భూమిపైన పాకేవి, భూమి లోపలికి తొలుచుకు వెళ్లేవి అని.. ప్రధానంగా రెండు రకాలుంటాయి. భూమిలోకి తొలుచుకు వెళ్లే వానపాములను వాడితే కంపోస్ట్ గుంతలో నుంచి భూమిలోకి వెళ్లిపోతాయి కాబట్టి.. నేలపైన పాకే వాటిని వాడతారు. మన దేశంలో సుమారు మూడు వందల రకాల వానపాములు ఉన్నాయి. అందులో కొన్ని పైన పాకేవి, ఇంకొన్ని భూమిలోకి తొలుచుకు వెళ్లేవి. ఈ వానపాములు భార లోహాలను పెంచుతాయి అన్నది కూడా పెద్ద అపోహే. పంట వ్యర్థాలలో అప్పటికే ఉన్న భార లోహాలే కంపోస్ట్‌లోకి వస్తాయే గానీ.. వానపాములు కొత్తగా భార లోహాలను తయారు చేయవు. పంట వ్యర్థాలు కంపోస్ట్‌గా మారే క్రమంలో మొత్తం పరిమాణం బాగా తగ్గుతుంది. కాబట్టి భార లోహాల మోతాదు కొంచెం పెరిగినట్టు అనిపిస్తుంది. అంటే.. కంపోస్టు చేయకుండా ఆచ్ఛాదన(మల్చింగ్) చేసినా లేక భూమిలో కలిపి దున్నినా ఇదే జరుగుతుంది.
సేంద్రియ వ్యవసాయంలో అసలు సమస్యలే లేవా?
సేంద్రియ వ్యవసాయంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఉదాహరణకు.. నాణ్యతా ప్రమాణాలు పాటించటంపై సేంద్రియ సర్టిఫికేషన్ ప్రక్రియ ఆధారపడి ఉంటుంది. ఈ పద్ధతిలో కొంచెం ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అయితే, ప్రత్యామ్నాయంగా పీజీఎస్ లాంటి వాటి ద్వారా సర్టిఫికేషన్ పొందవచ్చు.
కాబట్టి, అపోహలను పక్కన పెట్టి పరిస్థితులకు అనుగుణంగా, స్థానికంగా దొరికే వనరులతో చేపట్టే సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లే దిశగా రైతులు ప్రయత్నం చేయవచ్చు. అలాగే పరస్పర అపనమ్మకాలను పక్కన పెట్టి, వివిధ జీవావరణ వ్యవసాయ (ఎకలాజికల్ ఫార్మింగ్) పద్ధతులను ప్రోత్సహిస్తున్న సంస్థలు/వ్యక్తులు తమ అనుభవాలను కలిసి పంచుకుంటే.. అందరి విజ్ఞానం పెంపొందుతుంది. ఇటువంటి మార్పును వెతుకుతున్న రైతులతో పాటు ప్రభుత్వం కూడా తోడ్పాటును అందించగలిగితే.. సేంద్రియ వ్యవసాయం దిశగా త్వరితగతిన మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.