కర్ర పెండలం దుంపల్లో చాలా పోషకాలుంటాయని మనకు తెలుసు. అయితే, కర్రపెండలం మొక్కల ఆకులతో చక్కని సేంద్రియ పురుగు మందులను తయారు చేయవచ్చని డా. సి. ఎ. జయప్రకాశ్ నిరూపించడంతోపాటు పేటెంటు సైతం పొందారు. కేరళలోని శ్రేకరియంలో గల కేంద్రీయ దుంప పంటల పరిశోధనా సంస్థ (సిటిసిఆర్‌ఐ) లో ఆయన ప్రధాన శాస్త్రవేత్తగా విశేష పరిశోధనలు చేస్తున్నారు. కర్రపెండలం ఆకులను తిన్న పశువులు చనిపోతాయి. వీటిలో వుండే శ్యానోజన్ అనే రసాయన సమ్మేళనం విషతుల్యమైనది కావటమే ఇందుకు కారణం. ఇది గ్రహించిన డా. జయప్రకాశ్ 13 ఏళ్ల క్రితం పరిశోధనలు ప్రారంభించారు. విశేష కృషి చేసి విజయం సాధించారు.
శ్యానోజన్ సమ్మేళనాన్ని ఆకుల్లో నుంచి వెలికితీయడం కోసం తొలుత ఒక యంత్రాన్ని కనుగొన్నారు. ఇందుకోసం విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ సాయం తీసుకున్నారు. అనేక ఏళ్లు పరిశోధన చేసి ఎట్టకేలకు నన్మ, మెన్మ, శ్రేయ అనే మూడు రకాల సేంద్రియ పురుగుమందులను తయారు చేశారు. ఒక కిలో కర్రపెండలం ఆకులతో ప్రత్యేక యంత్రం ద్వారా 8 లీటర్ల సేంద్రియ పురుగుమందు తయారు చేయవచ్చని డా. జయప్రకాశ్ తెలిపారు.
నన్మ, మెన్మ, శ్రేయ సేంద్రియ పురుగుమందులు ఉద్యాన పంటలు సాగు చేసే రైతులకు తీవ్రనష్టం కలిగిస్తున్న పురుగులను అరికడతాయి. అరటిలో సూడోస్టెమ్ వీవిల్, కొబ్బరిలో రెడ్‌పామ్ వీవిల్‌తో పాటు అనేక పండ్ల / కలప పంటల్లో కనిపించే కాండం తొలిచే పురుగులను ఈ సేంద్రియ పురుగుమందులు సమర్థవంతంగా అరికడతాయని డా. జయప్రకాశ్ ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు.
డీఆర్‌డీవో తోడ్పాటుతో ఈ పురుగుమందును వాయువు రూపంలోకి మార్చుతున్నారు. ఆహార గోదాముల్లో కనిపించే పురుగులను సమర్థవంతంగా ఈ వాయు రూపంలోని సేంద్రియ పురుగుమందు అరికడుతుందట. లైసెన్స్ ఫీజు చెల్లించే ప్రభుత్వ/ప్రైవేటు సంస్థలకు ఈ పురుగుమందుల తయారీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని సిటిసిఆర్‌ఐ సంచాలకులు డాక్టర్ షీల ప్రకటించారు.
కర్రపెండలం ఆకుల రసం తో లీటరు పురుగుమందు తయారు చేయడానికి కేవలం రూ. 20 మాత్రమే ఖర్చవుతుందట. ఈ పురుగుమందులు ఆకులతో తయారు చేసినవి కావటం వల్ల రసాయన పురుగుమందులకు మల్లే పురుగులు వీటికి ఎప్పటికీ అలవాటుపడిపోవు. ప్రభుత్వ సంస్థలు ఇటువంటి చక్కని సేంద్రియ పురుగుమందులను స్వయంగా తయారు చేయించి రైతులకు సరసమైన ధరకు అందిస్తే ఎంతో మేలు జరుగుతుంది. వివరాలకు.. సిటిసిఆర్‌ఐ ప్రధాన శాస్త్రవేత్త డా. జయప్రకాశ్‌ను ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు: prakashcaj@gmail.com
డా. సి.ఎ.జయప్రకాశ్
పెండలం ఆకులతో పురుగుమందులు
Published Tue, Jun 22 2021 1:30 AM | Last Updated on Tue, Jun 22 2021 1:30 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment