ఆరుగాలం శ్రమించి పడించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక ఇప్పటికే అవస్థలు పడుతున్న అన్నదాతలు డాలర్ దెబ్బకు కుదేలవుతున్నారు.
హనుమాన్‌జంక్షన్ రూరల్, న్యూస్‌లైన్ : ఆరుగాలం శ్రమించి పడించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక ఇప్పటికే అవస్థలు పడుతున్న అన్నదాతలు డాలర్ దెబ్బకు కుదేలవుతున్నారు. రూపాయి విలువ పతనంతో, డాలర్ బలోపేతంతో ఎరువులు, పురుగుల మందులు ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో మూలిగే నక్కపై తాటి పండు పడిన చందాన రైతుల పరిస్థితి మారింది. పెట్టుబడి ఖర్చులు పెరిగిపోవడంతో లబోదిబోమంటున్నారు.
బ్రాండెడ్ కంపెనీల మందుల ధరలు లీటరుకు రూ. 50నుంచి రూ. 600 వరకూ పెరగడంతో అన్నదాతలు దిక్కులు చూస్తున్నారు. పురుగుల మందులకు వాడే ముడి సరుకును ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడంతో పాటు డాలర్‌కు భారీ మూల్యం చెల్లించాల్సి రావడం ధరల ఆజ్యానికి ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు. పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరగడం మరోకారణంగా కంపెనీ వర్గాలు అంటున్నాయి.
గడ్డి నివారణ మందులు ధరలు 25నుంచి 30శాతం వరకు పెరిగాయి. ఈ ఏడాది నాలుగు నెలల కాలంలో రెండు సార్లు ఇప్పటికీ ధరలు పెరిగాయి. మరోమారు పెరిగే అవకాశం వుందని పురుగుల మందులు తయారీదారులు చెబుతున్నారు. కూలితోపాటు, దుక్కులు, దమ్ములు ధరలు పెరగ డంతో పెట్టుబడులు రాని పరిస్థితులు నెలకున్నాయని రైతులు గగ్గోలు పెడుతున్నారు.
వరి సాగుకు ఎకరాకు అదనపు భారం రూ. 2500
ధరలు పెరుగుదల కారణంగా వరిసాగుకు ఎకరాకు రూ. 2500ల వరకు అదనపు భారం పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎకరా వరిపంటకు పురుగు మందుల పిచికారీ, గుళికలు వేయడానికి, గడ్డి మందులు చల్లడానికి రూ. 2,500 నుంచి రూ. 3,000 వరకు అవుతోంది. పెరిగిన ధరలు ప్రభావంతో రూ. 5,500 వందల వరకు ఖర్చు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. రబీలో మందుల పిచికారి ఎక్కువ కావడంతో మరింత ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కూరగాయలు, ఉల్లి, మిరప పంటలకు అధికంగా పురుగుల మందులు వాడాలి. ఈ నేసథ్యంలో వాణిజ్య పంటలసాగు మరింత భారం కానుంది. రూపాయి విలువ పెరుగుదలపై ఆర్థిక నిపుణులు దృష్టి సారిస్తే గానీ రైతుల బతుకులు ఒడ్డున పడవని రైతు సంఘ నేతలు పేర్కొంటున్నారు.
పెరిగిన ధరకు సబ్సిడీ ఇవ్వాలి
డాలరు పెరిగిందని ఒక్కసారిగా పురుగుల మం దుల ధరలు పెంచ డం దారు ణం. వ్యవసాయం చేయడం కష్టంగా ఉంంది. డాలరు విలువను బట్టి ఎరువుల పురుగుల మందులు ధరలు పెంచడం సబబు కాదు. అదే రీతిలో వ్యవసాయ ఉత్పత్తులకూ డాలరు ధరను బట్టి మద్దతు ధర నిర్ణయించాలి.. లేదా పెరిగిన ధరలకు సబ్బిడీలు ఇవ్వాలి.
- వేమూరి చిన్నప్ప, కోడూరుపాడు
రైతాంగాన్ని ఆదుకోవాలి
సాగు ప్రారంభిం చిన తర్వాత ఎరువులు, పురుగుల మందుల ధరలు పెరగడం దారు ణం. పెట్టుబడులు పెరుగుతున్నాయి. బ్యాం కులు ఉత్పత్తి వ్యయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా రుణాలు కొంత మేరకు మాత్రమే ఇస్తున్నాయి. పెరిగిన ధరలను బట్టి రుణ పరిమితిని పెంచాలి.
- వంజలపు రమేష్, కానుమోలు