ఆర్గానిక్‌ సాగుతో శ్రీలంక కొత్త చరిత్ర | Devinder Sharma Guest Column On Organic Crop Cultivation in Sri Lanka | Sakshi
Sakshi News home page

ఆర్గానిక్‌ సాగుతో శ్రీలంక కొత్త చరిత్ర

Published Mon, Oct 11 2021 12:24 AM | Last Updated on Mon, Oct 11 2021 7:38 AM

Devinder Sharma Guest Column On Organic Crop Cultivation in Sri Lanka - Sakshi

రసాయనిక ఎరువులు, పురుగుమందుల దిగుమతులను నిషేధించడం ద్వారా శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే పర్యావరణ హితమైన ఆహారోత్పత్తులు, ఆర్గానిక్‌ సాగుపై విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. రసాయనిక ఎరువులను, పెస్టిసైడ్స్‌ని నిషేధించిన మొట్టమొదటి దేశం శ్రీలంక. తమ ప్రయోజనాలకు గండి పడుతోందన్న విషయం గ్రహించిన అంతర్జాతీయ వాణిజ్య వ్యవసాయ సంస్థలు... ఆర్గానిక్‌ ఉత్పత్తుల వల్లే శ్రీలంకలో ఆహార సంక్షోభం ఏర్పడిందంటూ ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నాయి. కానీ అంతర్జాతీయంగా ఆర్గానిక్‌ ఆహార ఉత్పత్తులకు డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో శ్రీలంక తప్పకుండా లబ్ధి పొందుతుంది. తన పంటలకు ఆర్గానిక్‌ ట్యాగ్‌ ద్వారా ప్రపంచ మార్కెట్లో శ్రీలంక ప్రభంజనం సృష్టించగలదు. 

రసాయనిక ఎరువులు, పురుగుమందులను సంపూర్ణంగా నిషేధిస్తూ ఆర్గానిక్‌ ఆహారోత్పత్తుల వైపు అడుగు వేస్తూ శ్రీలంక తీసుకున్న విప్లవాత్మక నిర్ణయానికి వ్యతిరేకంగా ఊహించినట్లే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్గానిక్‌ పంటలపై అవే వాదనలు, అవే మానసిక భయాలు, ప్రపంచాన్ని తిరోగమనం పాలుచేసిన నకిలీ సైద్ధాంతిక ఆలోచనలు! ప్రపంచ వ్యవసాయ వాణిజ్య దిగ్గజాల సాధికారిక సమతుల్యతను ఎవరైనా విచ్ఛిన్నపరుస్తున్నారని పసిగడితే చాలు.. పదేపదే వారికి వ్యతిరేకంగా నిరసనలు, వ్యతిరేకతల రొద మిన్నుముట్టడం మనకు తెలిసిందే.

ఆరోగ్యకరమైన, మరింత నిలకడైన, న్యాయబద్ధమైన ఆహార వ్యవస్థల వైపు వెళ్లవలసిన అవసరాన్ని ఐక్యరాజ్యసమితి ఆహార వ్యవస్థల సదస్సు ఇంకా గుర్తించకముందే, కొన్ని నెలల క్రితం శ్రీలంక సాహసోపేతమైన చర్యకు శ్రీకారం చుట్టింది. రసాయనిక ఎరువులు, పురుగుమందుల దిగుమతులను నిషేధించడం ద్వారా వ్యవసాయ పర్యావరణ పరివర్తన అనే భావనను ఎంతోముందుగా ఆచరణలోకి తెచ్చింది. మే 6న దేశాధ్యక్షుడి అధికార ప్రకటన ద్వారా ఆర్గానిక్‌ ఆహార ఉత్పత్తుల వైపు తొలి అడుగు వేసిన దేశంగా శ్రీలంక చరిత్రకెక్కింది. అంతకుముందు పామ్‌ ఆయిల్‌ దిగుమతులపై నిషేధం విధించి, ఇప్పటికే సాగు చేస్తున్న పామాయిల్‌ తోటలను దశలవారీగా తొలగించాలని ఆదేశాలు జారీచేసి ఆరోగ్యకరమైన, స్థిరమైన భవిష్యత్తు వైపు గొప్ప నిబద్ధతను ప్రదర్శించింది.

సెప్టెంబర్‌ 22న న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సే మాట్లాడుతూ, శ్రీలంక జాతీయ విధాన చట్రంలో స్వావలంబన ఒక మైలురాయిగా అభివర్ణించారు. నేల ఫలదీకరణ, జీవ వైవిధ్యం, జల మార్గాలు, ఆరోగ్యం వంటివాటిపై ప్రభావం కారణంగా తమ ప్రభుత్వం ఈ సంవత్సరం ప్రారంభంలోనే రసాయనిక ఎరువులు, పురుగుమందుల ఉపయోగాన్ని నిషేధించిందని పేర్కొన్నారు. 

శ్రీలంక భారీ స్థాయిలో విదేశీ రుణ ఊబిలో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. ప్రభుత్వ రాబడిలో 80 శాతం విదేశీ అప్పులు తీర్చడానికే వెచ్చించాల్సి వస్తోంది. అదే సమయంలో స్వదేశంలో తీవ్రమైన ఆహార పదార్థాల కొరతను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఆర్గానిక్‌ వ్యవసాయం చేబడితే ఆహార పదార్థాల ఉత్పత్తి తగ్గిపోయి ఆహార సంక్షోభం ఏర్పడక తప్పదంటూ నడుస్తున్న విష ప్రచారానికి వ్యతిరేకంగా శ్రీలంక అధ్యక్షుడు తన నిర్ణయానికి గట్టిగా కట్టుబడి ఉన్నారు. 1980లలో ఇండోనేషియా అధ్యక్షులు సుహార్తో ఒక్క కలం పోటుతో, వరి సాగుకు ఉపయోగిస్తున్న 57 రసాయనిక పురుగుమందులపై నిషేధం విధించినప్పుడు కొద్ది రోజులలోపే ఆయనపై పెట్టిన తీవ్ర ఒత్తిడి ఈ సందర్భంగా నాకు మళ్లీ గుర్తుకొచ్చింది.

నిజానికి మే నెల ప్రారంభంలోనే శ్రీలంకలో రసాయనిక ఎరువులు, పురుగు మందులపై నిషేధం అమలులోకి వచ్చింది. అప్పటినుంచి ఒక పంట సీజన్‌ మాత్రమే పూర్తయింది. ఆ సీజన్‌లో వరినాట్లు మేలో మొదలై ఆగస్టులో పంటకోతలు పూర్తయ్యాయి. అయితే పంట ఇంకా మార్కెట్‌లోకి రాకముందే శ్రీలంకలో పంట దిగుబడులు తగ్గిపోయాయనే భయాందోళనలను వ్యాపింపజేయడానికి రసాయనిక ఎరువులు, పురుగుమందుల లాబీ పూనుకుంది.

సాధారణంగా రసాయనిక ఎరువులను ఉపయోగించడం నిలిపివేశాక రెండు లేక మూడో సంవత్సరం వరకు మాత్రమే పంట దిగుబడులు కాస్త తగ్గుముఖం పట్టి నెమ్మదిగా మళ్లీ పెరగటాన్ని మనం చూస్తాం. రసాయన ఎరువులు, పురుగుమందులతో సాగే వ్యవసాయం కారణంగా సంభవించే దుష్ఫలితాలు సమాజం తప్పనిసరిగా చెల్లించవలసిన మూల్యంగా భావిస్తుంటారు. మరోమాటలో చెప్పాలంటే ఉత్తర శ్రీలంకలో వరి అధికంగా పండే ప్రాంతంలో, గ్రామీణ పేదల్లో మూత్ర పిండాలు భారీ స్థాయిలో విఫలం కావడానికి రసాయనిక ఎరువులు, పురుగుమందులను మోతాదుకు మించి వాడటమేనని ఎక్కువమంది నమ్ముతున్నారు. కానీ మూత్రపిండాల వైఫల్యానికి, రసాయనిక ఎరువుల వాడకానికి మధ్య ఉన్న లింకును పలువురు నిపుణులు పరిగణనలోకి తీసుకోవడం లేదు. శ్రీలంకలో దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి కారణంగా 20 వేలకంటే ఎక్కువమంది చనిపోయారనీ, గత 20 ఏళ్లుగా 4 లక్షలమంది వ్యాధిగ్రస్తులయ్యారనీ ‘ది ఇండిపెండెంట్‌’ నివేదిక చెబుతోంది. 

దేశంలో రెండో అతిపెద్ద ఎగుమతి సరుకైన తేయాకు విషయాన్ని పరిశీలిస్తే, అనవసరమైన పుకార్లు, భయాలను వ్యాప్తి చేశారు. నిజానికి తేయాకు దిగుబడులు శ్రీలంకలో చాలా తక్కువగానే ఉన్నాయి. కానీ గత దశాబ్దికాలంలో తేయాకు పంట దిగుబడి నిరంతరం తగ్గుముఖం పడుతూనే వస్తోంది. చాలా ప్రాంతాల్లో ఎకరాకు 350 నుంచి 400 కేజీలకు తేయాకు పంట పడిపోగా, కొన్ని సందర్భాల్లో ఎకరాకు 150 కేజీల తేయాకు పంట మాత్రమే సాధ్యమయింది. దేశంలో తేయాకు పంట దిగుబడులు తగ్గడానికి ప్రధాన కారణాల్లో నేల కోత ఒకటి. ఈ నేపథ్యంలో పూర్తిగా ఆర్గానిక్‌ సాగుకు మళ్లితే దాని ప్రయోజనం రాబోయే సంవత్సరాల్లో మాత్రమే కనిపిస్తుంది. వ్యవసాయ పర్యావరణానికి కట్టుబడటం ద్వారా శ్రీలంక నేల ఆరోగ్యాన్ని పరిరక్షించగలదు, తద్వారా తేయాకు తోటలను పునరుజ్జీవింప చేయగలదు. తన పంటలకు ఆర్గానిక్‌ ట్యాగ్‌ ద్వారా ప్రపంచ మార్కెట్లో శ్రీలంక ప్రభంజనం సృష్టించగలదు. అంతర్జాతీయంగా ఆర్గానిక్‌ ఆహార ఉత్పత్తులకు డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో ఆర్గానిక్‌ సాగు చేపడుతున్న మొదటి దేశంగా శ్రీలంక తప్పకుండా లబ్ధి పొందే స్థానంలో ఉంటుంది. 

అయితే ఈ పరివర్తనకు మార్గదర్శకం చేయడానికి శ్రీలంక సరైన చర్యలు చేపట్టవలసి ఉంది. ప్రస్తుతం శ్రీలంక ముందున్న సవాల్‌ ఏమిటంటే, తన పరిశోధన, అభివృద్ధి, పంటల పట్ల వైఖరిని సరికొత్తగా రూపొందించుకోవడమే. ఇందుకోసం విద్యాపరమైన కరిక్యులమ్‌ని మార్చడం ద్వారా జాతీయ వ్యవసాయ పరిశోధనా కార్యక్రమాలకు కొత్త రూపం ఇవ్వాల్సి ఉంది. వ్యవసాయ పరిశోధన కూడా కమ్యూనిటీ జ్ఞానాన్ని, ఆయా సామాజిక బృందాల సృజనాత్మక ఆవిష్కరణలను నిర్ధారించి, పరిరక్షించడంపై దృష్టి సారించాల్సి ఉంది. ప్రత్యేకించి పర్యావరణ మార్పులోని సంక్లిష్టతలను పరిష్కరించడం, సాంప్రదాయిక పంటల రకాలను, లభ్యమవుతున్న సుసంపన్నమైన వైవిధ్యతలను పరిరక్షించగలిగితే అది మొత్తం వ్యవసాయానికి గట్టి స్థిరత్వాన్ని తెచ్చిపెడుతుంది. మరీ ముఖ్యంగా ఆర్గానిక్‌ సాగు ప్రక్రియలో ప్రజల భాగస్వామ్యాన్ని తప్పనిసరి చేయాల్సి ఉంది. బలవంతంగా ఆర్గానిక్‌ వ్యవసాయం వైపు మళ్లాలని రైతులను బలవంతపెడితే దీర్ఘకాలంలో అది పెద్దగా పనిచేయదు.

వ్యవసాయ పర్యావరణం, ఆర్గానిక్, సహజ, జీవవైవిధ్యతతో కూడిన వ్యవసాయ వ్యవస్థలు ప్రపంచం మొత్తానికి ఆహారాన్ని అందించగలవా అని చాలామందికి సందేహాలు పుట్టుకొస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి ఆహార, వ్యవసాయ సంస్థ అత్యున్నత స్థాయి నిపుణుల ప్యానెల్‌ 2019లో వెలువరించిన ఒక నివేదిక వీటికి పరిష్కార మార్గాలను సూచించింది. వ్యవసాయ పర్యావరణ హితంతో కూడిన సాగు వ్యవస్థలు తీసుకొచ్చే ఆర్థిక ప్రయోజనాలను గురించి ఈ ప్యానెల్‌ సవివరంగా పేర్కొంది. ప్రత్యేకించి రఫేల్‌ డి అన్నోల్పో 2017లో చేసిన ఒక విశ్లేషణ ప్రకారం 61 శాతం కేసుల్లో ఆర్గానిక్‌ వ్యవసాయ దిగుబడులు పెరిగినట్లు, 20 కేసుల్లో మాత్రమే ఈ దిగుబడులు తగ్గుముఖం పట్టినట్లు తేటతెల్లమైంది. కాగా 66 శాతం కేసుల్లో ఆర్గానిక్‌ సాగు లాభదాయకత పెరిగిందని కూడా తెలిపింది.

కాబట్టి ఆర్గానిక్‌ సాగు చేపట్టడానికి కావలిసింది సాహసం మాత్రమే. దేన్నయినా నమ్మినప్పుడు మాత్రమే దాని ప్రయోజనాలు సిద్ధిస్తాయి. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే ఆర్గానిక్‌ సాగు పట్ల నిబద్ధత కలిగి ఉండటం అనేది అంతర్జాతీయంగానే వ్యవసాయ భవిష్యత్తుకు తలుపులు తెరిచే అవకాశం ఉంది.


దేవీందర్‌ శర్మ 
వ్యాసకర్త ఆహారం, వ్యవసాయరంగ నిపుణులు
ఈ–మెయిల్‌ : hunger55@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement