శ్రీలంక ప్రస్తుతం ఎదుర్కొంటున్న అస్తవ్యస్త పరిస్థితులకు చెక్ పెట్టేందుకు ఆ దేశ మాజీ అధ్యక్షురాలు చంద్రికా కుమారతుంగ ఓ కొత్త వ్యవస్థ ఏర్పాటును సూచిస్తున్నారు. ‘కౌన్సిల్ ఆఫ్ స్టేట్’(జాతీయ మండలి)గా పిలిచే ఈ వ్యవస్థ ప్రభుత్వానికి సమాంతరంగా పని చేస్తుంటుంది. ఇది ప్రభుత్వానికి లోబడే తన కార్యకలాపాలు నిర్వహిస్తూంటుంది గానీ ప్రతి విషయంలోనూ ప్రభుత్వం ఈ వ్యవస్థను సంప్రదించాల్సి ఉంటుంది. అంతేకాకుండా... ఆ వ్యవస్థ ఇచ్చే సలహా, సూచనలను ప్రభుత్వం చాలా సీరియస్‌గా పరిగణించాల్సి ఉంటుంది కూడా! ఇలాంటి వ్యవస్థ భారత్‌లోనూ ఉండివుంటే చాలా సమస్యలు ఉత్పన్నం అయ్యేవి కావు. ఈ వ్యవస్థ ప్రభుత్వానికీ, పౌర సమాజానికీ మధ్య ఉన్న అంతరాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.
‘‘అవసరం అన్నీ నేర్పుతుందంటారు.’’ చాలాసార్లు విన్న నానుడే అయినా శ్రీలంక మాజీ అధ్యక్షురాలు చంద్రికా బండారునాయకే కుమారతుంగ చేసిన ఓ వినూత్న ప్రతిపాదన వింటే ఇది గుర్తుకు రాకమానదు. శ్రీలంకలో ప్రస్తుత అస్తవ్యస్త పరిస్థితులకు దారితీసిన ప్రభుత్వ పాలనను మెరుగుపరిచేందుకు ఆమె ఒక ప్రతిపాదన చేస్తూ దీన్ని గుర్తు చేశారు. ‘‘అవసరం అన్నీ నేర్పుతుందన్నది నిజమే గానీ, ఆ ముఖ్యమైన అవసరం ఏమిటి?’’ అని ప్రశ్నిస్తే... చంద్రికా కుమారతుంగ ఇచ్చిన సమాధానం ఇది: ‘‘శ్రీలంక ప్రజలందరిలో రాజకీయ నాయకులపై విశ్వాసం పూర్తిగా పోయింది’’ అని చెప్పారు. నిజమే కదా... ఈ సమస్య మనది అంటే భారతదేశానిది కూడా కదా అనిపించింది. మరి, శ్రీలంకకు బండారునాయకే సూచిస్తున్న పరిష్కారం మనకూ అక్కరకు వస్తుందా? బహుశా ఆ ప్రణాళికతో మనమూ ప్రస్తుత అపనమ్మక పరిస్థితి నుంచి బయట పడవచ్చునేమో!
ఇంతకీ చంద్రికా కుమారతుంగ సూచిస్తున్న కొత్త విషయం ఏమిటన్నదేనా మీ సందేహం! అక్కడికే వస్తున్నా. శ్రీలంక ప్రస్తుతం ఎదుర్కొంటున్న అస్తవ్యస్త పరిస్థితులకు చెక్ పెట్టేందుకు ఆమె ఓ కొత్త వ్యవస్థ ఏర్పాటును సూచిస్తున్నారు. ఈ వ్యవస్థ ప్రభుత్వానికి సమాంతరంగా పని చేస్తుంటుంది. ఇది ప్రభుత్వానికి లోబడే తన కార్యకలాపాలు నిర్వహిస్తూంటుంది గానీ ప్రతి విషయంలోనూ ప్రభుత్వం ఈ వ్యవస్థను సంప్రదించాల్సి ఉంటుంది. అంతే కాకుండా... ఆ వ్యవస్థ ఇచ్చే సలహా, సూచనలను చాలా సీరి యస్‌గా పరిగణించాల్సి ఉంటుంది కూడా! ఆ వ్యవస్థ వివరాలేమిటో తెలుసు కుందాం గానీ... అంతకంటే ముందు ఒక్క విషయమైతే స్పష్టం. ఈ వ్యవస్థ ప్రభుత్వానికీ, పౌర సమాజానికీ మధ్య ఉన్న అంతరాన్ని గణనీయంగా తగ్గిస్తుందని మాత్రం చెప్పగలం.
శ్రీలంక మాజీ అధ్యక్షురాలు చంద్రికా కుమారతుంగ ప్రతి పాదిస్తున్న కొత్త వ్యవస్థకు ‘‘కౌన్సిల్ ఆఫ్ స్టేట్’’(జాతీయ మండలి) అని పేరు పెట్టారు. ఐదేళ్లపాటు పదవిలో ఉండే ఈ కౌన్సిల్ ఆఫ్ స్టేట్‌లో మొత్తం 36 మంది ఉంటారు. వీరిలో తొమ్మిదిమంది రాజకీయ నాయకులు. మిగిలిన 27 మంది పౌర సమాజంలోని వేర్వేరు రంగాలకు చెందినవారూ వాళ్ళను నామినేట్ చేస్తారు. అంటే... వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు, ప్రైవేటు రంగానికి చెందిన వాళ్లు, ఇంకా స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వేతర సంస్థలకు చెందిన వారన్న మాట. ఈ పౌర సమాజం నుంచి వచ్చినవారి సంఖ్య రాజకీయ నాయకులకు మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది. సమా జంలోని ఓ విశిష్ట వ్యక్తి ఈ జాతీయ మండలికి అధ్యక్షుడిగా ఉంటారు. ఈ అధ్యక్షుడు రాజకీయ నాయకుడు కావచ్చు గానీ... పదవీ విరమణ చేసినవారై ఉండాలి.
చంద్రికా కుమారతుంగ ఆలోచనల ప్రకారం ఈ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ రెండు ముఖ్యమైన పనులు నిర్వహిస్తుంది. ‘‘పార్లమెంటులో చట్టం చేయడానికి ప్రతిపాదించేం దుకు ముందు గానే అతి ముఖ్యమైన చట్టాల ముసా యిదాలు, విధానాలను ఇది సమీక్షిస్తుంది.’’ ఆర్థిక వ్యవస్థ, పాలన, ఆరోగ్యం, విద్య వంటి అన్ని అంశాలకు సంబంధించిన విధానాలు, చట్టాలను నిశితంగా పరిశీలించి మార్పులు, చేర్పులు సూచిస్తుంది. కౌన్సిల్ ఆఫ్ స్టేట్ బాధ్యతల్లో ఇది మొదటిది కాగా... తను సొంతంగా చట్టాలనూ, విధానాలనూ మంత్రివర్గ కేబినెట్‌కు ప్రతిపాదించడం రెండోది.
ఇదేదో యూపీఏ ప్రతిపాదించిన నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ మాదిరిగా ఉందే అనుకుంటున్నారా? పాక్షికంగా నిజమే గానీ... కౌన్సిల్ ఆఫ్ స్టేట్ దీనికంటే విస్తృతమైందని చెప్పవచ్చు. నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ మాదిరిగా ఇది సోనియాగాంధీ, ఆమె అభిమాను లకు మాత్రమే పరిమితం కాదు. అన్ని రకాల భావనలనూ, వాదన లనూ గౌరవిస్తుంది ఈ కౌన్సిల్ ఆఫ్ స్టేట్! పైగా ఈ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ సభ్యులు ఆయా రంగాల్లో నిష్ణాతులై ఉండాలి.
చంద్రికా కుమారతుంగ లెక్కల ప్రకారం ఈ ‘జాతీయ మండలి’ తాత్కాలిక ఏర్పాటు మాత్రం కాదు. శ్రీలంక ప్రభుత్వ వ్యవస్థలో శాశ్వత భాగస్వామిగా ఉంటుంది. ఈ వ్యవస్థ ఏర్పాటుకు అంగీకారం లభిస్తే కొత్త ప్రభుత్వం ఈ వ్యవస్థ సభ్యులను సొంతంగా నియ మిస్తుందన్నమాట.
చంద్రిక ప్రతిపాదన చాలా సింపుల్. ఎలాంటి శష భిషలు లేనిది. సమాజంలో వేర్వేరు రంగాల్లో పేరెన్నికగన్న, గౌరవం ఉన్నవారి అభిప్రాయాలకు గళమిస్తుంది ఈ కౌన్సిల్ ఆఫ్ స్టేట్. అదే సమయంలో ప్రభుత్వానికి తగిన మార్గదర్శనం కూడా చేస్తుంది. చట్టాలు, విధానాలపై విస్తృత స్థాయిలో చర్చలు మాత్రమే కాకుండా... మార్పులు, చేర్పులు కూడా జరుపుకొనే అవకాశం లభి స్తుంది. ప్రభుత్వం అడిగే ప్రశ్నలకు ఈ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ సంతృప్తికరమైన సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే ఏకాభి ప్రాయంతో చట్టాలు, విధానాలు ఏర్పడతాయి కాబట్టి భవిష్యత్తులో సమస్యలు అతి తక్కువగా ఉంటాయన్నమాట. ఇంకోలా చెప్పాలంటే ప్రస్తుతం వార్తాపత్రికలు, కొన్ని టెలివిజన్ ఛానళ్లకు మాత్రమే పరిమితమైపోయిన ప్రజాస్వామ్య ప్రక్రియలు అనేకం పాలనలో భాగమవుతాయన్నమాట.
కౌన్సిల్ ఆఫ్ స్టేట్ నిర్ణయాలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం కూడా సంభవమే. కానీ చంద్రికా కుమారతుంగ అంచనాల ప్రకారం అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం పాలన పలుచనైనట్లే! ప్రభుత్వ విధానాలను, చట్టాలను పొగిడినా, తెగిడినా సరే ప్రభుత్వం జాతీయ మండలికి తగినన్ని అవకాశాలు ఇచ్చి దాని అభిప్రాయాలను, దృష్టికోణాలను క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది.
ఇది కొంచెం తిరకాసు వ్యవహారమే. తగు విధంగా సంప్ర దింపులు జరపడం అంటే? జాతీయ మండలి అభిప్రాయాలకు సముచిత పరిగణన ఇవ్వడం అంటే? మాటల గారడీతోనో, లేదా ఇతర మార్గాల ద్వారానో జాతీయ మండలికి తగిన ప్రాధాన్యం ఇవ్వకపోతే? ఇవన్నీ జరిగేందుకు అవకాశాలైతే మెండుగా ఉన్నాయి. ఏదో నామ్ కా వాస్తే ఈ కౌన్సిల్ ఆఫ్ స్టేట్‌ను ఏర్పాటు చేయవచ్చు. అది కూడా నామమాత్రంగా పనిచేయనూవచ్చు. ఆ తరువాత వ్యక్తుల గౌరవం, నిబద్ధతలపై మనం ఆధారపడాల్సి వస్తుంది.
భారత్‌లోనూ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ లాంటి వ్యవస్థ ఒకటి ఉంటే అర్థవంతంగా ఉంటుందని నాకు అనిపిస్తోంది. దేశం మొత్తం వర్గాలుగా విడిపోవడం పతాకస్థాయిలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో, ప్రభుత్వం ప్రజలను విడగొడుతోందన్న భావనలు బలపడుతున్న తరుణంలో ఇలాంటి వ్యవస్థ అవసరం ఒకటి కచ్చితంగా ఉందని అనిపిస్తోంది.
మన దేశంలోనూ ఈ జాతీయ మండలి లాంటిది ఒకటి ఉండివుంటే 2016 నవంబరులో జరిగినట్లు పెద్ద నోట్ల రద్దు జరిగి ఉండేది కాదేమో! గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ) అమలు చేయడంలోనూ ఇన్ని రకాల సమస్యలు ఉండేవి కావు. కోవిడ్ మొదలైన తొలినాళ్లలో కేవలం కొన్ని గంటల వ్యవధి మాత్రమే ఇచ్చి దేశం మొత్తాన్ని లాక్‌డౌన్‌లో పెట్టడమూ జరగకపోయేది. ఇలాంటి మూడు అంశాలు చాలవా? శ్రీలంక మాజీ అధ్యక్షులు చంద్రికా కుమారతుంగ ప్రతిపాదిస్తున్న కౌన్సిల్ ఆఫ్ స్టేట్ వ్యవస్థ భారత్‌కూ ఎంతో అవసరమని చెప్పేందుకు!
వ్యాసకర్త: కరణ్ థాపర్
సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment