
గుండం రామచంద్రారెడ్డి/సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇటీవల ఎప్లాస్టిక్ ఎనీమియా కేసులు ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి. రకరకాల వైరస్‌లు, బ్యాక్టీరియాల వల్ల అరుదుగా మాత్రమే ఎప్లాస్టిక్ ఎనీమియా కేసులు నమోదవుతున్నా గత మూడు నాలుగేళ్లుగా మాత్రం ఈ తరహా కేసుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరుగుతోంది. పురుగు మందులతోపాటు ఆహార ఉత్పత్తుల్లో పేరుకుపోయిన అవశేషాలు ఈ వ్యాధికి ప్రధాన కారకాలుగా వైద్యులు తేల్చి చెబుతున్నారు. ఈ మందులను పిచికారి చేసిన 60శాతం మందిలో వీటి ప్రభావం చూపిస్తుండగా, మరో 30 శాతం మందికి వీటి అవశేషాలున్న ఆహార పదార్ధాలు తీసుకోవడంవల్ల వ్యాధి సోకుతున్నట్లు నిపుణుల అధ్యయనంలో తేలింది.
రాష్ట్రంలో ఏటా ఈ తరహా కేసులు 3ృ4 వేలకు పైనే నమోదవుతున్నట్టు.. మృతుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉన్నట్లు అంచనా. అయితే, దీనిపై ప్రత్యేకంగా ఎక్కడా రిజిస్ట్రీ (రికార్డులు)లు లేవు. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, కర్నూలు, తిరుపతి తదితర బోధనాసుపత్రుల్లోని పాథాలజీ విభాగాల్లోనే ఈ కేసులు వెలుగుచూస్తున్నాయి. ఎక్కువగా గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో నమోదవుతున్నట్టు తెలుస్తోంది. పాతికేళ్లలోపు యువతీ యువకులు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతుండడంపై వైద్యులూ విస్మయం వ్యక్తంచేస్తున్నారు. తీవ్ర ఆందోళన కలిగిస్తున్న ఈ పరిణామంపై అటు అధికారులు, ఇటు ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరాన్ని ఈ వ్యాధి గుర్తుచేస్తోంది.
రక్తకణాలు, ప్లేట్‌లెట్లకు విఘాతం
తెల్ల, ఎర్ర రక్తకణాలు, ప్లేట్‌లెట్లు శరీరానికి వ్యాధి నిరోధక శక్తినిస్తుంటాయి. ఇంతటి శక్తివంతమైన ఈ రక్షణ వ్యవస్థపై ఇప్పుడు పురుగు మందుల రూపంలో దాడి జరుగుతుండడంతో శరీర రక్షణ గోడ బీటలువారుతోంది. ఎముకల్లోని మూలుగ (స్టెమ్ సెల్స్)పై నేరుగా దాడిచేస్తున్న ఈ వ్యాధివల్ల ఎర్ర, తెల్ల రక్తకణాలు, ప్లేట్‌లెట్ల ఉత్పత్తికి తీవ్ర విఘాతం కలుగుతోంది. రకరకాల రక్తసంబంధిత సమస్యలతో బాధితులను పీల్చిపిప్పి చేస్తోంది. ఇది ఓ రకంగా రక్తహీనత వ్యాధి కావడంతో బాధితులు నిత్యం రక్తం, ప్లేట్‌లెట్లు ఎక్కించుకోవాల్సిన పరిస్థితి. మరోవైపు.. శరీరానికి రక్షణ గోడలా ఉండే మూలుగలోని మూలకణాలపై ఇప్పటివరకూ వైరస్‌లు, బాక్టీరియాలే దాడి చేసేవి. ఇప్పుడు కొత్తగా పురుగు మందుల ప్రభావం ఎక్కువవుతోంది. దీనివల్ల సోకుతున్న ‘ఎప్లాస్టిక్ ఎనీమియా’ను బోన్‌మారో ఫెయిలూర్ సిండ్రోమ్ అని కూడా పిలుస్తున్నారు.
క్రిమిసంహారక మందుల్లో ఇవే ప్రధానం
ఎముకలోని మూలుగ మీద అత్యంత ప్రభావం చూపిస్తున్న క్రిమిసంహారక మందుల్లోని ప్రధానమైనవి... ఆర్గానో ఫాస్పేట్, కార్బొమేట్స్, ఆర్గానో క్లోరిన్, పారాక్వాట్ వంటివి. ఎంతో శక్తి వంతమైన రసాయనాలు కలిసి ఉన్న ఈ క్రిమిసంహారకాలను పిచ్చికారి చేసే సమయంలో నేరుగా పీల్చినప్పుడు లేదా ఆహార పదార్థాల్లో పేరుకుపోయిన అవశేషాలను తీసుకున్నప్పుడు దీని ప్రభావం నేరుగా ఎముకల్లోని మూలుగపై చూపిస్తోంది. మరోవైపు.. ఎరాస్టీన్ బార్ వైరస్, హెపటైటిస్‌ృఎ, హెపటైటిస్‌ృబి, హెపటైటిస్‌ృసి, పార్వో వైరస్‌లు కూడా ఎప్లాస్టిక్ ఎనీమియా వ్యాధికి కారణమవుతున్నాయి. ఈ వైరస్‌ల దాడి ముందే ఊహించలేమని వైద్యులు చెబుతున్నారు. రకరకాల జబ్బులకు మనం వాడే మందులు కూడా ఒక్కోసారి ఇలాంటి భయంకరమైన వ్యాధులకు కారణమవుతున్నాయి. ఫినైటాయిన్, కార్బమొజపైన్, కార్బమొజోల్, నాన్ స్టెరాయిడ్స్ ఇన్‌ఫ్లమేషన్ స్టెరాయిడ్ డ్రగ్స్, యాంటీ థైరాయిడ్ డ్రగ్స్ వంటివి కూడా శరీరంలోని ఇమ్యూనిటీ (వ్యాధినిరోధక శక్తి)పై ప్రతికూలంగా పనిచేసి రక్తహీనత జబ్బులకు కారణమవుతున్నట్టు తేల్చారు.
వ్యాధి లక్షణాలు..
- ఈ వ్యాధి సోకిన బాధితుల ముఖం పాలిపోయినట్టు ఉంటుంది.
- చిగుళ్ల నుంచి రక్తం కారుతుంది.
- తెల్లరక్త కణాలు తగ్గే కొద్దీ తీవ్రంగా జ్వరం వస్తూంటుంది.
- ప్లేట్‌లెట్లు తగ్గడం కారణంగా ముక్కు నుంచిగానీ, నోటి నుంచి గానీ రక్తం వస్తుంది.
- శరీరమంతా ఎర్రని మచ్చలు వస్తాయి.
- వ్యాధి తీవ్రత పెరిగేకొద్దీ ఎలాంటి పనిచేయడానికీ ఆసక్తి ఉండదు.
- శరీరమంతా నిస్సత్తువ ఆవహిస్తుంది.
- ప్రధానంగా ఆయాసం ఎక్కువగా ఉంటుంది.
వ్యాధివల్ల ఏం జరుగుతుందంటే..
- ఎప్లాస్టిక్ ఎనీమియా వల్ల ప్రధానంగా శరీరంలో హిమోగ్లోబిన్ శాతం పడిపోతుంది.
- తెల్లరక్త కణాలు తీవ్రంగా పడిపోతాయి.
- ప్లేట్‌లెట్స్ వందల్లోకి చేరుతాయి. దీనివల్ల మనిషి రోజురోజుకు నీరసపడిపోతాడు.
- సాధారణంగా ఆరోగ్యవంతుడికి హిమోగ్లోబిన్ 14 ఉండాలి. కానీ, ఈ వ్యాధి బాధితుడికి రెండుకి పడిపోతుంది.
- ప్లేట్‌లెట్లు సాధారణంగా 1.50 లక్షల నుంచి 4 లక్షల వరకు ఉండాలి. అలాంటిది వెయ్యికి కూడా పడిపోతాయి. దీనంతటికీ కారణం.. మూలుగులో తెల్లరక్త కణాలు, ఎర్రరక్త కణాలు, ప్లేట్‌లెట్లు ఉత్పత్తి కాకపోవడమే.
ఎలా నిర్ధారిస్తారంటే..
- ఎప్లాస్టిక్ ఎనీమియా బాధితులకు ప్రధానంగా సీబీసీ (కంప్లీట్ బ్లడ్ కౌంట్) పరీక్ష చేసి ఎర్రరక్త కణాలు, తెల్లరక్త కణాలు, ప్లేట్‌లెట్ల సంఖ్యను అంచనా వేస్తారు
- రెటిక్యులో సైట్ కౌంట్ అనే ప్రధానమైన పరీక్ష చేస్తారు
- ఫ్యామిలీ హిస్టరీని పరిశీలించి జన్యుపరంగా ఏమైనా వచ్చిందా అని చూస్తారు
- కాలేయం పరీక్ష విధిగా నిర్వహిస్తారు
- విటమిన్ బి1, బి12, థైరాయిడ్ పరీక్షల ద్వారా..
- బోన్‌మారో బయాప్సీ (మూలుగలోని ఒక భాగాన్ని) ద్వారా..
ఇవన్నీ చేశాకే ఎప్లాస్టిక్ ఎనీమియా వ్యాధిని నిర్ధారిస్తారు.
మూడు రకాలుగా చికిత్స
ఈ వ్యాధిగ్రస్తులు పూర్తిస్థాయిలో కోలుకోవాలంటే బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్ ఓ మార్గమని వైద్యులు చెబుతున్నారు. అంటే ఉన్న మూలకణాల (మూలుగ)ను పూర్తిగా తొలగించి కొత్త మూలకణాలను ఎక్కించడం. దీనికి కనీసం రూ.30లక్షలు పైగా ఖర్చవుతుంది. రెండో రకం చికిత్సలో.. గుర్రం నుంచి సేకరించిన కణాలను శుద్ధిచేసి వ్యాధిగ్రస్తుడికి ఎక్కించడం. ఒక కిలో బరువుకు 40 మిల్లీ గ్రాముల సీరం ఎక్కించాలి. అంటే మనిషి బరువు 60 కేజీలు అనుకుంటే 2400మి.గ్రా హార్స్ సీరం ఎక్కించాలి. ఇందుకు సుమారు రూ.7 లక్షలు అవుతుంది. ఈ విధానంలో రోగి 70 శాతం మేరకే కోలుకునే అవకాశం ఉంటుంది. ఇక మూడో విధానంలో.. వ్యాధిని తొలి దశలోనే గుర్తిస్తే మందులతోనే నయం చేయవచ్చు. ఇది దీర్ఘకాలిక ప్రక్రియ. సుమారు రెండేళ్లపాటు మందులు వాడాల్సి ఉంటుంది. ఈ విధానంలో ప్లేట్‌లెట్ల సంఖ్య పడిపోకుండా ఉండే అవకాశం ఉంది.
కాగా, ఆరోగ్యశ్రీ జాబితాలో ఈ వ్యాధి లేనందున చాలామంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకున్నా డబ్బులు ఇవ్వడంలేదు. కనీసం జాబితాలోనైనా చేరిస్తే కొంతవరకు వైద్యం దక్కుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
గుంటూరు జిల్లాలోనే అత్యధికం
రాష్ట్రంలో క్రిమిసంహార మందుల వాడకం గతంతో పోలిస్తే కొంత తగ్గినా వాటి ప్రభావం ప్రజల జీవితాలపై తీవ్రంగానే ఉంది. రాష్ట్రంలో పురుగు మందుల వాడకం గుంటూరు జిల్లాలోనే అత్యధికంగా ఉంది. గత ఏడాది ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 2,800 టన్నుల పురుగు మందులు వాడితే.. ఈ ఒక్క జిల్లాలోనే 1100 టన్నుల పురుగు మందులను ఉపయోగించడం గమనార్హం. ఎక్కువగా మిరప, పత్తి పైర్లకు ఉపయోగిస్తున్నారు. సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై కాస్త అవగాహన కలిగిన నేపథ్యంలో క్రిమిసంహారక మందుల వాడకం కొంత తగ్గినా ప్రజల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపలేనంతగా తగ్గలేదని నిపుణుల అభిప్రాయం.
ఇటీవల ఈ కేసులు బాగా పెరిగాయి
ఎప్లాస్టిక్ ఎనీమియా వ్యాధి వైరస్, బాక్టీరియాలతో పాటు ఎక్కువగా రసాయన పురుగు మందుల అవశేషాల కారణంగా వస్తున్నట్టు మా పరిశీలనలో తెలుస్తోంది. జబ్బు యుక్త వయసు వారికి వస్తుండటం బాధాకరం. ఈ జబ్బుతో ప్రధానంగా ప్లేట్‌లెట్లు గణనీయంగా పడిపోతాయి. వీటిని ఒక్కసారి ఎక్కించాలంటే రూ.10 వేలు ఖర్చు అవుతుంది. అలా తరచూ ఎక్కించడం వ్యయంతో కూడుకున్నది. ఈ జబ్బును గుర్తించడానికి బోన్‌మారో బయాప్సీ, జెనెటిక్స్ క్రోమోజోమ్, థైరాయిడ్, బి12, ఐరన్ డెఫిషియన్సీ తదితర పరీక్షలు చేసి నిర్ధారిస్తాం. ఆయాసం, నీరసం, తలనొప్పి, తరచూ రక్తస్రావం వంటి లక్షణాలుంటాయి. తొలి దశలో గుర్తిస్తే మందులతో జీవితకాలాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. ఎక్కువగా గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి బాధితులు వస్తున్నారు. దీన్నిబట్టి పెస్టిసైడ్స్ ఎక్కువగా ఉపయోగించే ప్రాంతాల వారు అని ప్రాథమికంగా గుర్తించాం.
- డా.రవికిరణ్ బొబ్బా, హిమటాలజిస్ట్ (రక్తవ్యాధుల నిపుణులు) రవి అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి, విజయవాడ.