ఖరీఫ్‌లో చీడపీడల నివారణకు పిచికారి
కంగ్టి:ఖరీఫ్ పంటలైన పెసర, మినుము, సోయా పంటలకు చీడపీడల బెడద ఎక్కువ కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలో గత ఇరవై రోజులుగా వర్షాలు లేకపోగా ఎండలకు పంటలు వాడిపోతుండడంతో పూత రాలే పరిస్థితి నెలకొంది. మధ్యాహ్న సమయంలో పెసర, మినుము, సోయా, మొక్కజొన్న, పత్తి పంటలు వాడుముఖం పడుతున్నాయి. దీనికి తోడు పంటలపై చీడపీడలు ఆశించడంతో రసాయన క్రిమిసంహారకాలు పిచికారి చేసే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. రసాయన క్రిమిసంహారకాలు పిచికారి చేయడంతో భూమిలో తేమలేక పూత రాలుతోందని కొందరు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చీడపీడల బెడదతో పెట్టుబడి వ్యయం అదనంగా పడుతోంది. పంటల ప్రారంభంలో వర్షాలు సంతృప్తికరంగా కురిసినా పూత, కాత దశలో వర్షాభావం వల్ల పంటలు నష్టపోయే పరిస్థితి నెలకొందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.