రుణంపై రణం !
జిల్లాలో మిర్చి విత్తనాల కొరతపై అధికార, ప్రతిపక్ష సభ్యులు ధ్వజమెత్తారు. రైతులకు విత్తనాలు అందడం లేదంటూ వ్యవసాయాధికారులను నిలదీశారు. గుంటూరులోని జిల్లా పరిషత్ కార్యాలయం సమావేశం హాలులో శుక్రవారం జెడ్పీ చైర్పర్సన్ షేక్ జానీమూన్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం వాడీవేడిగా జరిగింది.
సాక్షి, అమరావతి / గుంటూరు వెస్ట్ :
జెడ్పీ సమావేశంలో మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని రైతులకు జాతీయ, సొసైటీ బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ధ్వజమెత్తారు. నూతక్కి గ్రామంలో ఎరువులు అందక రైతులు నానా అగచాట్లు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో వ్యవసాయానికి సహకరించాలని సభను కోరారు. దీనిపై తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్కుమార్ కలగజేసుకుని ల్యాండ్పూలింగ్లో ఉన్న భూములకు రుణాలు ఏ విధంగా అందుతాయని ఎద్దేవా చేయడంతో ఆర్కే తీవ్రంగా స్పందించారు. వ్యవసాయానికి సహకరించాలని కోరుతున్నామని, జిల్లా సంయుక్త కలెక్టర్ కూడా వ్యవసాయానికి ఆటంకం కలిగించబోమని తమకు లేఖను కూడా పంపించారని పేర్కొన్నారు. రాజధాని నిర్మాణం ఇష్టం లేని మీరు ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకుంటున్నారని శ్రావణ్కుమార్ విమర్శించారు. దీనిపై ఆర్కే తాము రాజధాని నిర్మాణానికి వ్యతిరేకం కాదని, ఈ ప్రాంతంలో రాజధాని నిర్మాణాన్ని ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. తాము రాజధాని నిర్మాణానికి వ్యతిరేకం అయితే ప్రభుత్వం ల్యాండ్పూలింగ్లో భూములు తీసుకునేది కాదని స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో అంతరించిపోతున్న వ్యవసాయాన్ని కాపాడాలనేదే తమ ప్రయత్నమని ఆర్కే పునరుద్ఘాటించారు. సభను పక్కదోవపట్టించేందుకు శ్రావణ్కుమార్ చేసిన ప్రయత్నాలను ఆర్కే సమర్థంగా తిప్పికొట్టారు.
విత్తనాలేవీ...
జిల్లాలో మిర్చి విత్తనాల కొరతపై పిడుగురాళ్ల జెడ్పీటీసీ వీరభద్రుని రామిరెడ్డి, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్కుమార్ జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకుడు డీవీడీ కృపాదాసును నిలదీశారు. మీ అలసత్వం వల్ల రైతులు ఇబ్బందిపడుతున్నారని మండిపడ్డారు. ఈ దశలో వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు జోక్యం చేసుకుని విత్తనాలు, ఎరువుల కొరత లేదని చెప్పే ప్రయత్నం చేశారు. విత్తనాలు ఉండి మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నామో చెప్పండి అంటూ ఎమ్మెల్యే మంత్రిని సూటిగా ప్రశ్నించారు. అధికారులు సక్రమంగా పనిచేయడం లేదంటూ చురకలు అంటించారు. ఇప్పటివరకు మట్టినమూనాలు ఇవ్వలేదని, ఇంకా రుణవిముక్తి పత్రాలు అందలేదని, యాంత్రీకరణ పరికరాలు సక్రమంగా అందజేయడం లేదంటూ పలువురు సభ్యులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. కృష్ణా పశ్చిమ డెల్టాలో సాగునీరు ఎప్పుడు విడుదల చేస్తారో తెలపాలని నిజాంపట్నం జెడ్పీటీసీ ప్రసాదం వాసుదేవ కోరారు. హైలెవెల్ కెనాల్ ద్వారా 27 వేల ఎకరాలకు సాగునీరు అందడం లేదని, ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేయాలని దుగ్గిరాల జెడ్పీటీసీ యేళ్ల జయలక్ష్మి కోరారు.
వైద్య సిబ్బంది అందుబాటులో ఉండటం లేదంటూ ..
గ్రామాల్లో వైద్యసిబ్బంది అందుబాటులో ఉండటం లేదని వినుకొండ ఎమ్మేల్యే జీవీ ఆంజనేయులు సభ దృష్టికి తీసుకువచ్చారు. వినుకొండ పీహెచ్సీలో ఇన్చార్జి వైద్యుడు బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ, సక్రమంగా విధులు చేయడం లే దన్నారు. అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుని, వెంటనే బదిలీ చేయాలని కోరారు.
బిల్లుల జాప్యంపై..
ఇంకుడు గుంతలు, మరుగుదొడ్ల బిల్లులు అందడం లేదంటూ ఆర్డబ్ల్యుఎస్, డ్వామా అధికారులపై ఎంఎల్ఏలు నక్కా ఆనందబాబు, జీవీ ఆంజనేయులుతోపాటు పలువురు సభ్యులు ధ్వజమెత్తారు. కేజీబీవీలు, కంప్యూటర్ ఆపరేటర్లకు నాలుగు నెలలుగా బిల్లులు చెల్లించడం లేదని, అదనపు తరగతులు నిర్మించినా బిల్లులు చెల్లించడంలేదని ఎమ్మెల్సీలు బొడ్డు నాగేశ్వరరావు, ఏఎస్ రామకృష్ణ పేర్కొన్నారు.
కోరం లేదంటూ..
తొలుత చైర్పర్సన్ సమావేశాన్ని ప్రారంభించబోగా కోరం లేదంటూ వైఎస్సార్ సీపీ సభ్యులు దేవళ్ల రేవతి, యేళ్ల జయలక్ష్మి, రామిరెడ్డి అడ్డుకున్నారు. కోరం లేకుండానే సమావేశం ఎలా జరుపుతారని ప్రశ్నించారు. జెడ్పీ ఇన్చార్జి సీఈఓ సోమేపల్లి వెంకటసుబ్బయ్య జోక్యం చేసుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఇంతలో కొంతమంది సభ్యులు రావడం కోరం సరిపోవడంతో సమావేశాన్ని ప్రారంభించారు.
చినకాకానిలో స్థలంపై...
ఎమ్మెల్యే ఆర్కే మంగళగిరి మండలం చినకాకాని గ్రామంలో 59/2 సర్వే నెంబర్లో 55 సెంట్ల భూమిని పెట్రోలు బంకుకు లీజుకు ఇవ్వడాన్ని వ్యతిరేకించారు. నేషనల్ హైవేకి పక్కన ఆస్థలం ఉందని, ఎకరా రూ.10 కోట్లు నుంచి రూ.12 కోట్లు వరకు పలుకుతుందన్నారు. దీని ప్రకారం రూ.6 కోట్ల నుంచి 7 కోట్ల విలువైన స్థలాన్ని పెట్రోలు బంకుకు కేటాయించడం తగదన్నారు. రాజధాని ప్రాంతంలో ప్రభుత్వ భవనాలు కట్టుకోవడానికి ఈ స్థలాన్ని వినియోగించు కోవచ్చన్నారు. లేదా జెడ్పీ భూమిగానే ఉంచాలని కోరారు. జెడ్పీలో ప్రవేశపెట్టిన అజెండా 315 తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.