రాజేంద్రకుమార్
సాక్షి, అమరావతి బ్యూరో/కారంపూడి: ఆత్మహత్య చేసుకుంటానంటేనే స్పందిస్తారా? అంటూ అధికారులపై యువ రైతు చింతకాయల రాజేంద్రకుమార్(రాజా) మండిపడ్డాడు. పాసు పుస్తకాల కోసం 11 నెలలుగా తిరిగినా పట్టించుకోలేదని, సర్వేయర్ వద్దకు వెళితే కాగితాలు విసిరేశారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. 11 నెలలు తిరిగినా ఎందుకు పట్టించుకోలేదని అధికారులను నిలదీశాడు. ‘కలెక్టర్ ముందే ఆత్మహత్య చేసుకుంటా’ అంటూ శనివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంతో అధికారులు ఉరుకులు పరుగులు తీశారు. జిల్లా కలెక్టర్ కోన శశిధర్ ఆదేశాలతో గురజాల ఆర్డీవో మురళి, ల్యాండ్స్ సర్వే ఏడీ కెజియా కుమారితో పాటు అధికారుల బృందం శనివారం ఉదయం గుంటూరు జిల్లా కారంపూడి మండలం లక్ష్మీపురానికి చేరుకుంది. న్యాయం చేస్తామంటూ ఆర్డీవో మురళి బాధితునితో ఫోన్‌లో మాట్లాడారు. ఇంతకాలం ఎందుకు పట్టించుకోలేదని ఈ సందర్భంగా ఆయన్ని రాజా నిలదీశాడు. ఆర్డీవో స్పందిస్తూ.. న్యాయం చేసేందుకే వచ్చామని, సమస్యను పరిష్కరిస్తామని సర్దిచెప్పినట్టు తెలిసింది.
నాదో కన్నీటి గాథ: అధికారులు వస్తున్నారన్న సమాచారంతో.. రాజా పురుగు మందుల డబ్బాలు తీసుకుని పొలంలోకి వెళ్లి బైఠాయించాడు. అక్కడకు వెళ్లిన విలేకరులకు రాజా తన కన్నీటి గాథను వివరించాడు. తన తండ్రి వెంకటేశ్వర్లు సాగు కోసం అప్పులు చేసి.. వాటిని తీర్చలేక 2010లో ఆత్మహత్య చేసుకోవడంతో తాను చదువు మానేసి వ్యవసాయంలోకి దిగినట్టు తెలిపాడు. ఇద్దరం అన్నదమ్ములమని, తమకు ఎకరం పొలం ఉందని వివరించాడు. ఖరీఫ్‌లో 22 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి వేయగా.. వర్షాలకు ఉరకేసి పంట చేతికి రాలేదని వాపోయాడు. రూ.11 లక్షల దాకా అప్పులయ్యాయని వివరించాడు. అప్పులిచ్చిన వారిని ఇబ్బంది పెట్టకూడదని, తన పొలానికి సంబంధించిన పాసు పుస్తకాల కోసం అధికారుల చుట్టూ 11 నెలలుగా తిరిగినా ఫలితం లేకపోయిందన్నారు. టీడీపీ వాడిననే పేరే కానీ, తనను నాయకులెవరూ పట్టించుకోలేదని వాపోయాడు. చివరకు వీడియో మెసేజ్ పెట్టినట్టు చెప్పాడు.
విచారణకు ఆదేశించాం: వీడియో మెసేజ్ మా దృష్టికి వచ్చిన వెంటనే గురజాల ఆర్డీవో మురళి నేతృత్వంలో విచారణకు ఆదేశించామని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ తెలిపారు. రెవెన్యూ అధికారుల తప్పు ఉన్నట్లు తేలితే, సంబంధితులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆర్డీవో మురళి మాట్లాడుతూ.. గత ఏడాది మే నెలలోనే సర్వే చేశామని, భూ విస్తీర్ణంలో తేడా రావడంతోనే జాప్యం జరిగిందన్నారు. ఎకరం పొలంలో 0.07 సెంట్లు బాటలో పోవడంతో సమస్య తలెత్తిందని చెప్పారు.
అర్ధరాత్రి వరకు రైతు ఇంటివద్ద వేచి వున్న అధికారులు..
రాజాకు పాసుపుస్తకం ఇవ్వడానికి అధికారులు శనివారం రాత్రి 12 గంటల వరకు లక్ష్మీపురంలోనే వేచి వున్నారు. పాసు పుస్తకం తీసుకోవాలంటూ గ్రామ సర్పంచ్ ద్వారా ఫోన్ చేయించినప్పటికీ రాజా ఇంటికి రాలేదు. అతను వస్తే కౌన్సెలింగ్ ఇచ్చి పాసు పుస్తకం ఇవ్వాలనే యోచనలో అధికారులు ఉండగా.. వెళితే తననేదైనా చేస్తారనే భయంతో బాధిత రైతు ఉన్నట్టు తెలుస్తోంది. నిజానికి పాసుపుస్తకం ఇవ్వాల్సింది అతని తల్లికి అయినప్పటికీ.. రాజాకు కౌన్సెలింగ్ ఇవ్వడం ద్వారా ఆత్మహత్య యత్నాన్ని మాన్పించాలనేది అధికారుల భావనగా ఉంది. అయితే ఎంతసేపు వేచి చూసినా రాజా రాకపోవడంతో.. చేసేది లేక చివరకు రాజా తల్లికి పాసుపుస్తకం ఇచ్చి అధికారులు వెనుతిరిగారు.
Comments
Please login to add a commentAdd a comment