కాల్‌మనీ కోరలకు మరో జీవితం బలైపోయింది. తీసుకున్న సొమ్ముకు నాలుగింతలు అధికంగా చెల్లించినా, వేధింపులు ఆగకపోవడంతో...
పురుగు మందు తాగి చిరువ్యాపారి ఆత్మహత్య
గుంటూరు (పట్నంబజారు): కాల్‌మనీ కోరలకు మరో జీవితం బలైపోయింది. తీసుకున్న సొమ్ముకు నాలుగింతలు అధికంగా చెల్లించినా, వేధింపులు ఆగకపోవడంతో ఆఖరికి ఆత్మహత్యే శరణ్యమనుకున్నాడు. పట్టాభిపురం పోలీసులు, మృతుడి కుమారుడు నాగరాజకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు నగరానికి చెందిన మద్ది శ్రీరామమూర్తి(62)కి చిన్న బడ్డీ కొట్టు జీవనాధారం.అతను ఏడాదిన్నర కిందట శ్యామల అనే మహిళ వద్ద రూ. లక్ష అప్పుగా తీసుకున్నాడు. రోజుకి రూ.వెయ్యి వడ్డీ కడుతున్నాడు.
ఆమెతోపాటు మరో మహిళ నాగలక్ష్మి వద్ద కూడా రూ.1.30లక్షలు తీసుకోగా అధిక వడ్డీలు వేసి ఆయన పాడిన రూ. 2 లక్షల చీటీ డబ్బులు తీసుకుని ఇంకా రూ. 30 వేలు ఇవ్వాలని వే ధింపులకు దిగుతున్నారని బంధువులు తెలిపారు. వేధింపులు అధికమవడంతో శ్రీరామమూర్తి శుక్రవారం సాయంత్రం దుకాణంలోనే పురుగు మందు తాగాడు. స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. శ్రీరామమూర్తి సూసైడ్ నోట్ శనివారం వెలుగులోకి తీసుకురావడంతో విషయం బయటకు పొక్కింది. పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. శ్రీరామమూర్తి మృతి కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పట్టాభిపురం ఎస్‌హెచ్‌వో శేషగిరిరావు చెప్పారు.