
ప్రాణాలైనా ఇస్తాం..భూములు వదలం
భూసేకరణ నోటిఫికేషన్‌ను నిరసిస్తూ పురుగు మందు డబ్బాలతో ప్రదర్శన
పోతేపల్లి(కోనేరుసెంటర్) : భూసేకరణ నోటిఫికేషన్‌తో బందరు మండల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పలంగా వేలాది ఎకరాలు పోర్టు పేరుతో లాక్కుంటారో చూస్తామంటూ అటు ప్రభుత్వానికి, ఇటు పాలకులకు సవాళ్లు విసురుతున్నారు. భూములు అప్పగించే పరిస్థితే వస్తే ప్రాణాలైనా వదిలేస్తాం కాని నేల తల్లిని మాత్రం వదుకోమంటూ కరాఖండిగా చెబుతున్నారు. మహిళలైతే పురుగు మందులు తాగి ఆత్మహత్యలకైనా సిద్ధపడతామని చెబుతున్నారు. భూసేకరణ నోటిఫికేషన్ జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ బుధవారం బందరు మండలంలోని పోతేపల్లి, పెదకరగ్రహారం గ్రామాల రైతులు ఆందోళనకు దిగారు. గ్రామంలోని పంచాయతీ కార్యాలయాల వద్ద ధర్నాలు చేపట్టారు. పోతేపల్లిలోని మహిళలు పురుగు మందు డబ్బాలతో ఆందోళన చేపట్టారు. పోర్టు పేరుతో ప్రభుత్వం మా భూములు లాక్కుంటే ఇవే పురుగు మందులు తాగి మూకుమ్మడిగా ఆత్మహత్యలు చేసుకుంటూమంటూ హెచ్చరించారు.
గ్రామంలో సుమారు 400 మంది గ్రామస్తులు గ్రామంలోని రామాలయం వద్ద రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతులు మాట్లాడుతూ గతంలో 3 వేల ఎకరాల్లో బందరు పోర్టు నిర్మించవచ్చని ఇదే నాయకులు చెప్పి అధికారంలోకి వచ్చాక పోర్టు నిర్మాణానికి పది రెట్లు అదనంగా భూములు కావాలంటూ నోటిఫికేషన్ జారీ చేయడం తగదన్నారు. ఒకపుడు 3 వేల ఎకరాలు చాలన్న టీడీపీ నాయకులు ఇపుడు 30 వేల ఎకరాలు రైతుల నుంచి లాక్కుని ఎవరెవరు ఎంతెంత పంచుకుంటారో తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు. నోటిఫికేషన్ జారీతో ఇప్పటికే అనేక మంది రైతులు దిగులుతో మంచం పట్టినట్లు చెప్పారు. తక్షణమే భూసేకరణ నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పోతేపల్లి ఎంపీటీసీ సభ్యుడు పిప్పళ్ల నాగబాబు, మాజీ సర్పంచ్ కాటం మధుసూదనరావు, శ్రీపతి చంద్రం, సర్పంచ్‌లు మేకా లవకుమార్(నాని), చిలకలపూడి పీఏసీఎస్ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ గాజుల నాగరాజు, పెద్ద ఎత్తున రైతులు, మహిళలు పాల్గొన్నారు. పెదకరగ్రహారంలో సర్పంచ్ శొంఠి కల్యాణి, ఫరీద్ బాబా దర్గా కమిటీ కార్యదర్శి శొంఠి ఫరీద్, చలమలశెట్టి ఏడుకొండలు, గురుజు పోతురాజు, కట్టా బైరాగి, సత్తినేడి నాగరాజు, అబ్దుల్హ్రీం, రైతులు పాల్గొన్నారు.
అన్యాయం జరిగితే పదవీ త్యాగం చేస్తా - ఎంపీ కొనకళ్ల నారాయణ
మచిలీపట్నం(కోనేరుసెంటర్) : భూసేకరణకు సంబంధించి రైతులకు అన్యాయం జరిగితే తన పదవిని సైతం వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నానని బందరు ఎంపీ కొనకళ్ల నారాయణరావు స్పష్టం చేశారు. ఈ విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని చెప్పారు. బుధవారం ఎంపీ కొనకళ్ల తన కార్యాలయంలో టీడీపీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ భూసేకరణకు సంబంధించి బాధిత రైతులతో చర్చలు, సంప్రదింపులు జరిపిన తరువాతే భూములు తీసుకుంటారన్నారు. బందరు ప్రాంత అభివృద్ది పోర్టుతోనే ముడిపడిఉందనే విషయాన్ని ప్రజలు గ్రహించాలన్నారు. రైతులకు ఇంటికో ఉద్యోగంతో పాటు భూములకు కౌలు కూడా ఇచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సుముఖంగా ఉన్నట్లు తెలిపారు. మాజీ మంత్రి నడకుదిటి నరసింహారావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, మునిసిపల్ ఛైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షుడు తలారి సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.