చీడపీడల నివారణకు వేపాకు రసం ఉత్తమం
* పావు కిలో వేపాకులు రుబ్బి.. 5 లీ. నీరు కలిపి చల్లాలి
* నందివర్థనం పూలతో తామర పురుగులకు చెక్
* జీవామృతం వాడితే పంటలకు ఎండు తెగులు రాదు
ఇంటి పంట: మహానగరం నడిబొడ్డున అపార్ట్‌మెంట్‌లో నివాసం అయినా.. రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా పండించే సహజాహారంపై ఆసక్తి ఉంటే చాలు ఉన్నంతలో ఇంటిపంటలను సాగు చేయవచ్చని రుజువు చేస్తున్నారు డాక్టర్ గడ్డం రాజశేఖర్. సికింద్రాబాద్ అడిక్‌మెట్‌లోని అనురాధ అపార్ట్‌మెంట్ మొదటి అంతస్థులోని సొంత ఫ్లాట్‌లో డా. రాజశేఖర్ కుటుంబం నివాసం ఉంటున్నది. పార్కింగ్ ప్లేస్ పక్కన ఖాళీ స్థలాన్ని బాగు చేసి ఇంటిపంటల సాగు ప్రారంభించారు. నేలలో కొంచెం పశువుల ఎరువు వేసి వంగ, టమాటా, మిరప మొక్కలు నాటారు. చెక్కలతో ఏర్పాటు చేసిన మడిలో ఎర్ర తోటకూర, ఇతర ఆకుకూరలు సాగు చేస్తున్నారు. కొన్ని కుండీల్లో మెంతికూర, పాలకూర, కొత్తిమీర, మునగ సాగు చేస్తున్నారు. వంటింటి వ్యర్థాలను మొక్కల మొదళ్ల వద్ద మల్చింగ్‌గా వేస్తున్నారు. తన తల్లి శాంతకు ఈ మొక్కలే కాలక్షేపమని రాజశేఖర్ తెలిపారు. రసాయన రహిత సుస్థిర వ్యవసాయంలో అనుభవం ఉన్న శాస్త్రవేత్త కావడం వల్ల రాజశేఖర్(83329 45368) కిచెన్ గార్డెన్ కొన్ని ప్రత్యేకతలను సంతరించుకుంది. ఇవీ ఆయన చెప్పిన విశేషాలు..
* వేప నూనె కన్నా తాజా వేపాకుల రసం చీడపీడల నివారణకు సమర్థవంతంగా ఉపయోగపడుతోంది. పావు కిలో పచ్చి వేపాకులు తీసుకొని మిక్సీలో/రోటిలో వేసి రుబ్బి.. 5 లీటర్ల నీటిని కలిపి.. మొక్కలపై చల్లుతున్నాం.
* వర్మీకంపోస్టు వేసిన కుండీల్లో మెంతికూర వేస్తే.. ఎండు తెగులుతో 20% మొక్కలు చనిపోయాయి. వర్మీకంపోస్టు వాడకుండా ఎర్రమట్టిలో మెంతులు చల్లి జీవామృతం వాడిన కుండీలో ఈ సమస్య లేదు. విత్తనం వెంట వచ్చే ఎండు తెగులు తాలూకు శిలీంద్రాన్ని జీవామృతంలో ఉండే మేలుచేసే సూక్ష్మజీవులు హతమార్చాయన్నమాట. జీవామృతం గ్రోత్ ప్రమోటర్, శిలీంద్రనాశిని కూడా.
* నేల మీద వంగ మొక్కలకు జీవామృతం వాడినప్పుడు 6 అంగుళాల పొడవున పెరిగిన వంకాయలు, జీవామృతం వాడడం మానేస్తే 3 అంగుళాలే పెరిగాయి.
* వంగ, టమాటా, మిరప, కొత్తిమీర, ఆకుకూరలకు తామరపురుగు సోకుతూ ఉంటుంది. దీన్ని అరికట్టడానికి జిగురుపూసిన తెల్ల ఎరలు వాడుతున్నాను. లేదా తెల్లటి పూలు పూసే మొక్కలు పెంచాలి. నందివర్థనం పూలు పూసినంతకాలం తామర పురుగులు వాటిపైనే ఉన్నాయి. పూలు లేనప్పుడు మిరప, వంగ మొక్కలను ఆశించడం గమనించాను. పెంకు పురుగులు ఆశిస్తే పసుపు ఎరలు వాడాలి.
కుండీల్లో మునగాకు సాగు!
* పెరట్లో మునగ చెట్టు ఉంటే విటమిన్లు, టానిక్కులు కొనాల్సిన అవసరం రాదంటారు. మునగను కుండీల్లో ఆకు కోసం, కాయల కోసం కూడా పెంచవచ్చు. విత్తనం వేస్తే ఆరు నెలలు, నెల మొక్క నాటితే 5 నెలల తర్వాత నుంచి మునగాకు కోసుకొని కూరల్లో వాడుకోవచ్చు. ఎండబెట్టి పొడి చేసి.. రోజూ కొంచెం కూరల్లో వేసుకోవచ్చు. ఆకు కోసం పెంచితే.. 4 అడుగుల ఎత్తులో పైచిగురును తుంచేయాలి. పక్కకొమ్మలు పెరిగి ఎక్కువ ఆకు వస్తుంది. కాయలకోసం పెంచితే.. 5 అడుగులు ఎదిగిన తర్వాత పై చిగురును కత్తిరించాలి.
* మునగ చెట్టు పెరట్లో ఉండకూడదన్న సెంటిమెంటు కొందరిలో ఉంది. బొంత(గొంగళి)పురుగు వల్లే ఇది వచ్చి ఉంటుంది. బొంత పురుగు రాకుండా చేయడానికి ఓ చిట్కా ఉంది. మొక్క 6 నెలలు పెరిగిన తర్వాత.. కింది నుంచి 2 అడుగుల ఎత్తు వరకు పాలిథిన్ పేపర్‌ను చుట్టి.. దానిపై నూనెను పూస్తే బొంత పురుగు చెట్టెక్కలేదు. బొంతపురుగులు మొక్క మొదట్లో మట్టిలో ఉండే గుడ్ల నుంచి పుట్టుకొస్తాయి. ఆ గుడ్లను తవ్వితీసి నాశనం చేస్తే సమస్యే ఉండదు.
* కమలాల్లో కంటే 7 రెట్లు ఎక్కువ విటమిన్ సి, క్యారెట్లలో కంటే 4 రెట్లు ఎక్కువ విటమిన్ ఏ, పాలల్లో కంటే 4 రెట్లు ఎక్కువ క్యాల్షియం, అరటిపండ్లలో కంటే 3 రెట్లు ఎక్కువ పొటాషియం, పెరుగులో కంటే 2 రెట్లు ఎక్కువ మాంసకృత్తులు మునగాకులో ఉన్నాయి.
* మునగాకును పప్పులో, సాంబారులో వేయొచ్చు. వేపుడు చేయొచ్చు. మునగ కాయల్లో కన్నా ఆకుల్లో పోషకాలు ఎక్కువ. మునగ పువ్వును చట్నీ చేయొచ్చు.
* మునగాకు పొడి చేసేదిలా: లేత మునగాకును కడిగి, నీడలో ఆరబెట్టాలి. గలగలలాడేలా ఆరిన మునగాకును పొడి చెయ్యాలి. పొయ్యి మీద నుంచి దించిన తరువాత కూరలు, చారు వంటి వాటిల్లో వేసి కలపాలి.