
పొలంలో క్రిమీ సంహారక మందు చల్లుతున్న రైతు (ఫైల్ ఫొటో)
న్యూఢిల్లీ: మనుషులు, జంతువులకు హానికరంగా పరిగణిస్తున్న 27 క్రిమి సంహారక మందుల తయారీ, వినియోగంపై నిషేధం విధించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రకటించారు. రాజ్యసభలో శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబు ఇచ్చారు. డాక్టర్ అనుపమ్ వర్మ నేతృత్వంలోని నిపుణుల సంఘం 66 కీటక నాశక మందులు కలిగించే దుష్ప్రభావాలను సమీక్షించిన అనంతరం 12 క్రిమి సంహారక మందులను పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు.
మరో 6 క్రిమిసంహారక మందులను క్రమంగా వినియోగం నుంచి తొలగించిందని మంత్రి తోమర్ తెలిపారు. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం 46 క్రిమిసంహారక మందులను నిషేధించడమో లేదా వినియోగం నుంచి తొలగించడమే చేసిందని వివరించారు. 4 క్రిమిసంహారక మందుల ఫార్ములేషన్స్‌ను దిగుమతి, తయారీ, విక్రయాల నుంచి నిషేధించామని, నిషేధించిన 5 క్రిమిసంహారక మందులను కేవలం ఎగుమతి చేయడానికి తయారీకి అనుమతించినట్లు గుర్తుచేశారు. మరో 8 క్రిమిసంహారక మందుల తయారీకి అనుమతించిన రిజిస్ట్రేషన్లను రద్దు చేసినట్లు మంత్రి వెల్లడించారు.
డీడీటీని మాత్రం ప్రజారోగ్య కార్యక్రమాల కోసం వినియోగించేందుకు అనుమతిస్తున్నట్లు మంత్రి నరేంద్రసింగ్ స్పష్టం చేశారు. తెలిపారు. క్రిమిసంహారక మందులు విషతుల్యమే అయినప్పటికీ నిర్దేశించిన రీతిలో వాటి వినియోగంతో పర్యావరణానికి ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు. క్రిమిసంహారక మందుల భద్రత, సామర్ధ్యం వంటి అంశాలపై నిరంతరం జరిగే అధ్యయనాలు, నివేదికలు, సమాచారం ఆధారంగా నిపుణులు తరచు సమీక్షలు నిర్వహించి ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తుంటాయని మంత్రి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment