న్యూఢిల్లీ: కృత్రిమ వాతావరణంలో కుంకుమ పువ్వు సాగును ప్రోత్సహించే దిశగా వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఇప్పటికే చర్యలు తీసుకుందని కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో ఒక యువ వ్యవసాయ పట్టభద్రురాలు ప్రయోగాత్మకంగా కుంకుమ పువ్వును సాగు మొదలెట్టి తొలి ప్రయత్నంలోనే స్వచ్ఛమైన 200 గ్రాముల ఫస్ట్ గ్రేడ్ దిగుబడి సాధించిన విషయం మీ మంత్రిత్వ శాఖ దృష్టికి వచ్చిందా అని రాజ్యసభలో శుక్రవారం వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.
దీనికి మంత్రి జవాబిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అందించిన సమాచారం ప్రకారం వ్యవసాయంలో పోస్టు గ్రాడ్యుయేషన్ చేసిన విద్యార్ధిని ఒకరు అన్నమయ్య జిల్లా మదనపల్లిలో తన ఇంట్లోనే హ్యుమిడిఫైర్స్ సాయంతో సెమి హైడ్రోపోనిక్స్ పరిస్థితులు సృష్టించి కుంకుమ పువ్వును సాగు చేస్తున్నట్లు తెలిసిందని చెప్పారు.
జమ్మూ, కశ్మీర్‌లోని పంపోర్, పుల్వామా, బుడ్గాం, శ్రీనగర్ ప్రాంతాల్లో కుంకుమ పువ్వు సాగుకు అనువైన వాతావరణ పరిస్థితులు ఉన్నందున అక్కడ వాణిజ్య స్థాయిలో ఈ పంట సాగు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. సమశీతోష్ణ వాతావరణం, నీరు నిల్వని వదులైన భూమి కుంకుమ పువ్వు సాగుకు అనువైన పరిస్థితులు కల్పిస్తాయి. భూమిలో పీహెచ్ విలువ 6.3 నుంచి 8.3 వరకు ఉండాలి. వాతావరణం ఎండా కాలంలో 23 నుంచి 27 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య శీతాకాలం అయింతే మైనస్ 15 డిగ్రీల నుంచి మైనస్ 20 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు తగ్గకుండా ఉంటే మంచి నాణ్యమైన కుంకుమ పువ్వు దిగుబడి సాధించవచ్చని మంత్రి తెలిపారు.
కృత్రిమ వాతావరణంలో నిరూపితమైన టెక్నాలజీని వినియోగించి కుంకుమ పువ్వుతో సహా ఎలాంటి పంటలు సాగు చేయడానికైనా ఉద్యానవన పంటల సమగ్ర అభివృద్ధి మిషన్ (ఎంఐడీహెచ్) ద్వారా వ్యవసాయ మంత్రిత్వ శాఖ మద్దతు ఇస్తుందని మంత్రి తెలిపారు. ఈ విధంగా చేపట్టే కృత్రిమ పంటల సాగుకు అవసరమయ్యే పాలిహౌస్, కృత్రిమ వాతావరణ కల్పన కోసం చేపట్టే నిర్మాణాల ఖర్చులో 50 శాతం వ్యవసాయ మంత్రిత్వ శాఖ భరిస్తుందని ఆయన తెలిపారు. ప్లాంటేషన్ కోసం మౌలిక వసతుల అభివృద్ధిలో భాగమైన ఫాన్, పాడ్ సిస్టమ్, సహజమైన వెంటిలేషన్ కోసం నిర్మించే ట్యూబ్యులర్ స్ట్రక్చర్, వుడెన్ స్ట్రక్చర్, బాంబూ స్ట్రక్చర్ వంటి వాటి నిర్మాణంలో 50 శాతం ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని మంత్రి పేర్కొన్నారు.
ఆహార భద్రత మిషన్‌లో చిరుధాన్యాలకు ప్రోత్సాహం
చిరుధాన్యాల ఉత్పత్తిని ప్రోత్సహించే లక్ష్యంగా చేసుకుని వాటిని ప్రజా పంపిణీ వ్యవస్థలో చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత మిషన్ కింద సబ్-మిషన్ ఏర్పాటు చేసిందని ఆహార, ప్రజాపంపిణీ శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి వెల్లడించారు. రాజ్యసభలో ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు.
గడిచిన అయిదేళ్ళలో దేశంలో 814.17 లక్షల మెట్రిక్ టన్నుల చిరుధాన్యాలు ఉత్పత్తి జరిగినట్లు ఆమె తెలిపారు. 2017-18లో 164.36 లక్షల మెట్రిక్ టన్నులు, 2018-19లో 137.17 ఎల్ఎంటీ, 2019-20లో 172.6, ఎల్.ఎం.టీ, 2020-21లో 180.2ఎల్ఎంటీ, 2021-22 లో 159.9 ఎల్ఎంటీ చిరుధాన్యాలు ఉత్పత్తి జరిగినట్లు తెలిపారు.
వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ ఆహార ధాన్యాల ఉత్పత్తి అంచనా ప్రకారం 2022-23లో దేశంలో 159.09 లక్షల మెట్రిక్ టన్నులు చిరుధాన్యాలతో సహా మొత్తం 3235.54 లక్షల మెట్రిక్ టన్నులు వివిధ రకాల ఆహార ధాన్యాలు ఉత్పత్తి జరగనున్నట్లు అంచనా వేశారు. అయితే 2022-23లో అంచనా వేసిన మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో చిరు ధాన్యాల ఉత్పత్తి కేవలం 4.92% మాత్రమే.
టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్, ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్ (మిడ్ డే మీల్) తదితర పథకాల కింద లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు 2021-22 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో 6.07లక్షల మెట్రిక్ టన్నులు చిరుధాన్యాలు కొనుగోలు చేసినట్లు తెలిపారు. జాతీయ ఆహార భద్రతా యాక్ట్-2013 ప్రకారం ధాన్యం, గోధుమలు, ముతక ధాన్యం, నాణ్యత కల్గిన ఇతర రకాలను కేంద్ర ప్రభుత్వం ఆహార ధాన్యాలుగా గుర్తిస్తోందని అన్నారు.
చిరుధాన్యాలకు చట్టంలో ప్రత్యేక నియమం ఏదీ లేదని మంత్రి తెలిపారు. అయితే ఆహార భద్రత చట్టం కింద లబ్ధి పొందుతున్న వారిలో పోషక విలువలు మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఆయా ప్రాంతాల్లో స్థానికంగా వినియోగిస్తున్న చిరుధాన్యాల ప్రాధాన్యతనుబట్టి చిరుధాన్యాలు కొనుగోలు చేయాలని కోరినట్లు తెలిపారు. ఇప్పటికే చిరుధాన్యాలు టార్గెటెడ్ ప్రజాపంపిణీ వ్యవస్థలో భాగమైనట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు డిసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ పద్ధతిలో ముతక ధాన్యం కొనుగోలు, నిల్వ, పంపిణీ చేస్తున్నాయని మంత్రి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment