ఆరుగురు రైతులకు పునర్జన్మ
సాక్షి, హైదరాబాద్: పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఆరుగురు నిరుపేద రైతు, రైతు కూలీలకు ఉస్మానియా వైద్యులు పునర్జన్మ ప్రసాదించారు. రోజుల తరబడి వెంటిలేటర్లపై ఉండటంతో శ్వాసనాళం కుంచించుకుపోయి ఊపిరి తీసుకోలేకపోతున్న వారికి విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. మృత్యు ద్వారం వరకు వెళ్లి తిరిగిన వచ్చిన వీరు కోలుకోవడంతో బుధవారం డిశ్చార్జి చేశారు. ‘హెల్పింగ్ హ్యాండ్’ సౌజన్యంతో ఉస్మానియా కార్డియో థొరాసిక్ సర్జరీ విభాగాధిపతి జి.శ్రీనివాస్, ఈఎన్‌టీ విభాగాధిపతి రంగనాథ్‌స్వామి, అనెస్థీషియా విభాగాధిపతి సి.జి.రఘురామ్‌ల నేతృత్వంలోని వైద్య బృందం నిర్వహించిన ఈ అరుదైన శస్త్రచికిత్స వివరాలివి...
అప్పుల బాధతో...
అప్పుల బాధకు తట్టుకోలేక నిజామాబాద్ జిల్లా అమృతాపూర్ రైతు బి.సంతోష్(28), మెదక్ జిల్లా నాచారం కౌలు రైతు పి.నర్సింహా(28), మహబూబ్‌నగర్‌కు చెందిన రైతు కూలీ ఎస్.కృష్ణ(24), రంగారెడ్డి జిల్లా చేవెళ్ల రైతు కూలీ జి.లలిత(28), ఖమ్మం జిల్లా రైతు కుటుంబానికి చెందిన విద్యార్థి వీరన్న(20), మహబూబ్‌నగర్‌కు చెందిన రైతు ఎ.నారాయణ(30) ఇటీవల పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. వ్యవసాయం కోసం కొందరు... కుటుంబ పోషణకు మరికొందరు అప్పులు చేసి, అవి తీరే మార్గం లేక ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.
చికిత్స కోసం బంధువులు వీరిని ఉస్మానియాకు తీసుకువచ్చారు. చికిత్సలో భాగంగా వైద్యులు బాధితులను 15 నుంచి 25 రోజులపాటు వెంటిలేటర్‌పై ఉంచాల్సి వచ్చింది. ఇన్ని రోజులు వెంటిలేటర్‌పై ఉండటం వల్ల ఒత్తిడికి లోనై, ఇన్‌ఫెక్షన్ వచ్చింది. దీంతో శ్వాసనాళాలు పూర్తిగా కుంచించుకుపోయాయి. వారికి శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది.
మాట పడిపోయింది. వైద్య పరిభాషలో దీన్ని ‘ట్రాకియల్ స్టెనోసిస్’గా పిలుస్తారు. దీనికి చికిత్స ఎంతో క్లిష్టమే కాకుండా ఖరీదు కూడా. ఆరోగ్యశ్రీ పథకంలో వీటికి అనుమతి లేదు. ఈ క్రమంలో ‘హెల్పింగ్ హ్యాండ్’ స్వచ్ఛంద సంస్థతో పాటు ‘ఇన్‌సైట్ ఔట్‌రిచ్ ప్రైవేట్ లిమిటెడ్’ వైద్య ఖర్చులు భరించేందుకు ముందుకు వచ్చాయి.
ఉదయం 9 నుంచి రాత్రి 10 వరకు...
డాక్టర్ జి.శ్రీనివాస్ నేతృత్వంలో వైద్య బృందం సెప్టెంబర్ 23న శస్త్రచికిత్స నిర్వహించింది. ఉదయం 9 నుంచి రాత్రి 10 గంటల వరకు శ్రమించిన వైద్యులు... గొంతుకు చిన్న రంధ్రం చేసి శ్వాస నాళంలో ‘డ్యూరాన్ స్టంట్’ను విజయవంతంగా అమర్చారు. బాధితులకు తిరిగి ఊపిరులూదారు. ఒక్కో స్టంట్‌కు రూ.80 వేలు ఖర్చయిందని వైద్యుల బృందం చెప్పింది.
హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్, ఇన్‌సైట్ ఔట్‌రిచ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు వీటిని సమకూర్చినట్లు ఉస్మానియా సూపరింటిండెంట్ సి.జి.రఘురామ్ తెలిపారు. కాగా, వీరితో పాటు కుటుంబ సమస్యలతో మనస్థాపం చెంది పురుగుల మందు సేవించిన సావిత్రి (32; కడప జిల్లా జమ్మలమడుగు)కి కూడా శస్త్రచికిత్స చేసినట్లు చెప్పారు.