Osmania doctors
-
ఇటీవలే గోవాకు వెళ్లిన శోభిత, సుదీర్
గచ్చిబౌలి: కన్నడ నటి శోభిత మృతదేహానికి సోమవారం ఉస్మానియా హాస్పిటల్లో పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. గచ్చిబౌలి పీఎస్ పరిధిలోని శ్రీరాంనగర్‌లో భర్త సు«దీర్ రెడ్డితో కలిసి నివాసం ఉంటున్న శోభిత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆమె కుటుంబసభ్యులు గచ్చిబౌలి పీఎస్‌కు వచ్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లి పోస్టు మార్టం పూర్తయిన తర్వాత శోభిత మృతదేహాన్ని బెంగళూర్‌కు తీసుకెళ్లారు. శోభిత ఆత్మహత్యకు పాల్పడినట్లు పోస్టుమార్టంలో నిర్ధారణ అయినట్లు ఉస్మానియా వైద్యులు పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న రోజు రాత్రి 10 గంటల సమయంలో శోభిత తన సోదరితో ఫోన్లో మాట్లాడిందని, తాము సంతోషంగా ఉన్నామని, కొద్ది రోజుల్లోనే ఇద్దరం కలిసి ఊరికి వస్తామని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. కాగా ‘ఎవ్రీ థింగ్ ఫర్ఫెక్ట్, చావాలనుకుంటే డూఇట్’ అని శోభిత రూమ్‌లో నోట్ రాసి ఉందని ఇన్స్పెక్టర్ హభీబుల్లాఖాన్ తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు వెల్లడి కాలేదని, శోభిత బంధువులు అనుమానాలు వ్యక్త చేయలేదని ఆయన పేర్కొన్నారు. భర్త అనుమానంతో డోర్ పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా శోభిత ఉరి వేసుకుని కనిపించిందని, ఆ సమయంలోనూ గదిలో భక్తి పాటలు ప్లే అవుతున్నట్లు తెలిసింది. ఇటీవలే గోవాకు వెళ్లారు కొద్ది రోజుల క్రితమే గోవాలో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్‌కు శోభిత, సుదీర్ వెళ్లినట్లు తెలిసింది. తిరిగి వచ్చిన తర్వాత కూడా భార్యాభర్తలు బాగానే ఉన్నారని ఇరుగు పొరుగు వారితో పాటు వారి కుటుంబ సభ్యులు పేర్కొనడం గమనార్హం. నటనకు అభ్యంతరం చెప్పలేదు: బుచ్చిరెడ్డి మ్యాట్రిమోని ద్వారా ఇరు కుటుంబాల అంగీకారంతోనే వివాహం చేశామని శోభిత మామ(భర్త తండ్రి) బుచ్చిరెడ్డి పేర్కొన్నారు. సినిమాలు, సీరియల్స్‌లో నటించేందుకు తాము ఎప్పడు అభ్యంతరం చెప్పలేదన్నారు. ఆమె ఎప్పుడు భగవంతుని ధ్యానంలో ఉండేదని, తమ ఇంట్లో కూతురి లాగా మెలిగిందని ఆయన పేర్కొన్నారు. కుటుంబ సభ్యురాలిని కోల్పోయామని, సుధీర్ రెడ్డి డిప్రెషన్లో ఉన్నాడన్నారు. శోభిత కుటుంబసభ్యుల కోరిక మేరకు బెంగళూర్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు. -
ప్రభుత్వం మా మధ్య చిచ్చు పెట్టింది ఎట్టి పరిస్థితిలో సమ్మె ఆగదు
-
HYD: హిమాచల్ వరదల్లో చిక్కుకున్న ఉస్మానియా డాక్టర్లు!
సాక్షి, హైదరాబాద్: వాతావరణంలో నెలకొన్న అనూహ్య పరిణామాలతో ఉత్తర భారతాన్ని ఎడతెరిపి ఇవ్వని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎటు చూసినా వరద పోటెత్తిన దృశ్యాలు.. మనుషులు, వాహనాలు, భవనాలు కొట్టుకుపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాల ధాటికి 72 మంది మృతిచెందగా.. 10 మంది అదృశ్యమయ్యారు. ఈ క్రమంలో హైదరాబాద్ ఉస్మానియాకు చెందిన ముగ్గురు వైద్యులు హిమాచల్ ప్రదేశ్ వరదల్లో చిక్కుకున్నట్లు సమాచారం. హిమాచల్ ప్రదేశ్ వరదల్లో ఉస్మానియాకు చెందిన డాక్టర్ బానోత్ కమల్‌లాల్, డాక్టర్ రోహిత్ సూరి, డాక్టర్ శ్రీనివాస్‌లు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురి ఫోన్లు స్విచ్చాఫ్ కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిణామానికి చెందిన మరింత సమాచారం అందాల్సి ఉంది. మరోవైపు హైదరాబాద్‌కు చెందిన ఓ ఫ్యామిలీ సైతం ఉత్తరాది భీకర వర్షాల్లో చిక్కుకుపోగా.. ఆదివారం నుంచి కుటుంబ సభ్యులతో సంబంధాలు తెగిపోయాయి. అయితే.. చివరికి వాళ్లు సురక్షితంగా నగరానికి తిరుగు పయనమైనట్లు తేలింది. మంత్రి హరీష్ ఆరా ఢిల్లీ పర్యటనలో భాగంగా.. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ తో మంత్రి హరీష్ రావు భేటీ కానున్నారు. కృష్ణా నది ట్రిబ్యునల్, నీటి ప్రాజెక్టుల అంశాలపై కేంద్రమంత్రితో చర్చించనున్నారాయన. అదే సమయంలో.. హిమాచల్ వరదల్లో ఉస్మానియా వైద్యులు చిక్కుకుపోయిన పరిణామంపై వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఆరా తీశారు. వైద్యులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారాయన. ఇదీ చదవండి: హిమాన్షు పెద్ద మనసు.. కోటి రూపాయలతో.. -
ఎంసెట్ స్కాంలో మోస్ట్ వాంటెడ్ మృతి
♦ నాలుగు రోజుల క్రితం కమిలేశ్వర్ను అదుపులోకి తీసుకున్న సీఐడీ ♦ కస్టడీలో ఉండగా పరిస్థితి విషమించడంతో ఉస్మానియాలో చికిత్స ♦ గుండెపోటుతో మృతి చెందాడంటున్న సీఐడీ అధికారులు ♦ బయటకు పొక్కకుండా ఉస్మానియాలో పోస్టుమార్టం పూర్తి ♦ 4 రాష్ట్రాల్లో పలు ప్రశ్నపత్రాల లీకేజీలో కమిలేశ్వర్ ప్రధాన నిందితుడు సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ 2 ప్రశ్నపత్రం లీకేజీ కేసులో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం సంచలనం సృష్టించింది. బిహార్ రాజధాని పట్నాకు చెందిన కమిలేశ్వర్సింగ్ ఉస్మానియా ఆస్పత్రిలో రెండు రోజులుగా చికిత్స పొందుతూ మృతి చెందినట్టు సీఐడీ వర్గాలు తెలిపాయి. కమిలేశ్వర్ అనుమానాస్పదంగా మృతిచెందాడని వార్తలు వినిపిస్తుండగా, సీఐడీ అధికారులు మాత్రం అతడు గుండెపోటుతో మరణించాడని చెప్తున్నారు. కాగా, కమిలేశ్వర్ మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో గుట్టుచప్పుడు కాకుండా పోస్టుమార్టం నిర్వహించడం అనుమానాలకు తావిస్తోంది. ఆర్డీవో నేతృత్వంలో పంచనామా పూర్తి చేసినట్టు పోలీస్ ఉన్నతాధికారులు ‘సాక్షి’కి తెలిపారు. నాలుగు నెలలుగా విచారణ సాగుతూ వస్తున్న ఎంసెట్ లీకేజీ కేసులో మోస్ట్ వాంటెడ్ నిందితుని మృతి పోలీసు శాఖలో కలకలం రేపింది. బిహార్ నుంచి రాష్ట్రానికి.. బిహార్ రాజధాని పట్నాకు చెందిన ఇద్దరు ప్రధాన నిందితులను సీఐడీ నాలుగు రోజుల క్రితం అదుపులోకి తీసుకుంది. పట్నా కోర్టులో వారిని హాజరుపరిచి ట్రాన్సిట్ వారంట్‌పై రాష్ట్రానికి తీసుకొచ్చింది. సీఐడీ కోర్టులో ఇద్దరినీ ప్రవేశపెట్టిన అధికారులు కస్టడీ పిటిషన్‌పై అనుమతి తీసుకుని అదుపులోకి తీసుకున్నారు. కేసులో భాగంగా విచారిస్తున్న సమయంలో కమిలేశ్వర్ ఆరోగ్య పరిస్థితి విషమించిందని తెలిసింది. దీంతో సీఐడీ అధికారులు అతడిని ఉస్మానియా ఆస్పత్రిలో చేర్చారు. ఛాతీలో నొప్పి వస్తోందని పదే పదే చెప్పాడని, ఆ మేరకు మంగళ, బుధవారాల్లో అతనికి చికిత్స అందించినట్టు ఉస్మానియా వైద్యులు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం గుండెపోటు రావడంతో కమిలేశ్వర్ మృతి చెందినట్టు సీఐడీ వర్గాలు తెలిపాయి. మృతిచెందిన కమిలేశ్వర్ పట్నాలో అడ్వొకేట్‌గా పనిచేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. బయటకు పొక్కకుండా.. ఎంసెట్ ప్రశ్నపత్రం స్కాంలో కీలక నిందితుడిగా ఉన్న కమిలేశ్వర్ వ్యవహారంలో సీఐడీ అధికారులు నాలుగు నెలలుగా ఏ విషయాన్ని బయటకు పొక్కనివ్వలేదు. అతడి ఆరోగ్యంపై ఆరా తీసినా ఏం కాలేదని, సాధారణమైన ఛాతీ నొప్పి సమస్యతో ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్చార్జి అయ్యాడని చెప్పుకొచ్చారు. తీరా ఉస్మానియా ఆస్పత్రి వర్గాలు కమిలేశ్వర్ మృతి చెందినట్టు చెప్పడంతో సీఐడీలో కలవరం మొదలైంది. కస్టడీలో ఉన్న వ్యక్తి మృతి చెందడం అనేక అనుమానాలకు తావిస్తోంది. కమిలేశ్వర్ ఆరోగ్య పరిస్థితి విషమిస్తున్న సమయంలోనూ సరైన వైద్యం అందించడంలో సీఐడీ ఉన్నతాధికారులు విఫలమయ్యారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అనుమానాస్పద మృతి ఎంసెట్ స్కాం దర్యాప్తు చేస్తున్న అధికారుల మెడకు చుట్టుకునే అవకాశం ఉందని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఒక లీక్.. 50 మంది బ్రోకర్లు.. ఎంసెట్ 2 ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో ఇప్పటివరకు సీఐడీ అధికారులు 50 మంది బ్రోకర్లను అరెస్ట్ చేసినట్టు ఉన్నతాధికారులు తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి 22 మంది బ్రోకర్లున్నారని, మిగతా అంతా కోల్‌కతా, బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, కర్ణాటకకు చెందిన బ్రోకర్లని అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో అరెస్టయిన వారిలో ఇద్దరు ఎంబీబీఎస్ డాక్టర్లతో పాటు 40 ఏళ్ల గృహిణి కూడా ఉండటం గమనార్హం. నాలుగు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్.. సీఐడీ కస్టడీలో చికిత్స పొందుతూ మృతిచెందిన కమిలేశ్వర్ నాలుగు రాష్ట్రాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్ అని సీఐడీ వర్గాలు తెలిపాయి. మెడికల్ ప్రశ్నపత్రాల లీకేజీలో కమిలేశ్వర్ ఆరితేరాడని, కర్ణాటక, బిహార్, ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌లోని పలు పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల లీక్ కేసుల్లో కీలక నిందితుడిగా ఉన్నాడని అధికారుల ద్వారా తెలిసింది. ప్రతీ రాష్ట్రంలో మెడికల్, ఇతరత్రా కీలక ఎంట్రన్స్ పరీక్షల సమయంలో తన మనుషులను వర్సిటీలు, ప్రశ్నపత్రాలు ప్రింటింగ్ చేసే ప్రెస్‌లో దింపుతాడని.. వారి ద్వారా ప్రశ్నపత్రం లీక్ చేయడం, విద్యార్థులకు ఎరవేసి భారీగా డబ్బులు వసూలు చేసేవాడని సీఐడీ దర్యాప్తులో వెలుగులోకి వచ్చినట్టు తెలిసింది. ప్రస్తుతం సీఐడీ చేస్తున్న దర్యాప్తులో 210 మంది విద్యార్థులకు నిందితులు మొత్తం ప్రశ్నపత్రం లీక్ చేసినట్టు ఆధారాలు దొరికాయని అధికారులు తెలిపారు. అన్నీ నిబంధనల ప్రకారమే: సీఐడీ ఐజీ ఎంసెట్ స్కాంలో కీలకంగా వ్యవహరించిన కమిలేశ్వర్ను కష్టపడి తమ అధికారులు పట్టుకున్నారని సీఐడీ ఐజీ సౌమ్యామిశ్రా తెలిపారు. నాలుగు నెలల నుంచి తప్పించుకుని తిరుగుతున్న అతడిని పట్టుకుని అక్కడి కోర్టులో ప్రవేశపెట్టామని, ట్రాన్సిట్ వారెంట్‌పై తీసుకువచ్చామని చెప్పారు. సీఐడీ కోర్టులో కస్టడీ పిటిషన్ వేసి విచారిస్తున్న తరుణంలో కమిలేశ్వర్ ఆరోగ్యం విషమించిందని, గుండెపోటు వల్లే అతను మృతిచెందాడని ఉస్మానియా వైద్యులు తెలిపారని స్పష్టం చేశారు. -
ప్రధాని పర్యటనలో ఉస్మానియా వైద్య బృందం
అఫ్జల్‌గంజ్: తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 7న పర్యటించనున్న భారత ప్రధాన మంత్రి నరేంద్రమోడీ కాన్వాయిలో ఉస్మానియా ఆసుపత్రికి చెందిన వైద్యుల బృందం పాల్గొంటుందని ఆసుపత్రి ఆర్ఎమ్ఓ, ప్రధాని పర్యటన వైద్యబందం టీమ్ లీడర్ డాక్టర్ మహ్మద్ రఫీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రధాని హైదరాబాద్ పర్యటనతో పాటు, మెదక్ జిల్లా మిషన్ భగీరధ ప్రారంభ కార్యక్రమంలో కూడా పాల్గొంటారని అక్కడికి కూడా ఉస్మానియా వైద్యులు వెళుతుందని తెలిపారు. ఈ పర్యటనలో తనతో పాటు ఇతర వైద్యులు, సహాయక సిబ్బంది ఉంటారని తెలిపారు. -
కిడ్నీ రక్తనాళాలకు బైపాస్
దేశంలోనే తొలిసారిగా నిర్వహించిన ఉస్మానియా వైద్యులు సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు మరో ఘనత సాధించారు. హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్న ఓ యువకుడికి దేశంలోనే తొలిసారి విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. నల్లగొండ జిల్లా మాచవరానికి చెందిన హరికృష్ణ (19) హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్నాడు. మందులు వాడినా బీపీ కంట్రోల్ కాలేదు. ఒక్కోసారి 300/120 ఎంఎం నమోదు అయ్యేది. వైద్య పరిభాషలో దీన్ని ‘తక్యాసూస్ ఆర్టిటీస్’గా పిలుస్తారు. శ్వాస సరిగా తీసుకోలేకపోవడం వల్ల గుండె స్పందనపై ఒత్తిడి పెరిగి తీవ్ర ఇబ్బంది పడేవాడు. చికిత్స కోసం అనేక మంది కార్డియాలజిస్టులను సంప్రదించాడు. ఫలితం లేకపోవడంతో ఏడాది క్రితం ఉస్మానియా నెఫ్రాలజీ విభాగాధిపతి డాక్టర్ మనిషా సహాయ్ని కలిశాడు. కిడ్నీ రక్త నాళాల్లో రెనిన్ అనే పదార్థం ఉత్పత్తి కావడమే హైపర్ టెన్షన్‌కు కారణమని మనిషా నిర్ధారించారు. కిడ్నీలకు రక్తాన్ని సరఫరా చేసే రక్త నాళాలకు బైపాస్ చేయడం ఒక్కటే దీనికి పరిష్కారమని భావించారు. ఆ మేరకు ఏడాది క్రితం ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ మధుసూదన్ నేతృత్వంలోని వైద్య బృందం అతని ఎడమ కిడ్నీకి స్ప్లేనో రెనల్ ఆర్టేరియల్ అండ్ ఇన్ఫీరియర్ మెసెంటెరిక్-రెనల్ ఆర్టేరి బైపాస్ చేశారు. మూడు రోజుల క్రితం అతడి కుడి భాగంలోని కిడ్నీకి కూడా చికిత్స చేశారు. పెద్ద పేగులోని మూడు రక్తనాళాల్లో ఒకటి తొలగించి మూత్రపిండాలకు అమర్చారు. ప్రస్తుతం బ్లడ్ ప్రెజర్ కంట్రోల్లోకి వచ్చిందని డాక్టర్ మధుసూదన్ చెప్పారు. ఈ తరహా చికిత్స చేయడం ప్రపంచంలోనే ఇది రెండోసారని పేర్కొన్నారు. ‘ఇండియన్ జర్నల్ ఫర్ నెఫ్రాలజీ’లో దీన్ని ప్రచురించామని, త్వరలోనే ఇంటర్నేషనల్ జర్నల్‌కు పంపుతున్నట్లు ఆయన తెలిపారు. -
చిన్నారి కంటిపై దిగిన చువ్వ తొలగింపు
విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించిన ఉస్మానియా వైద్యులు హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు మరో అరుదైన ఆపరేషన్ చేశారు. పాతబస్తీ జహనుమా ప్రాంతానికి చెందిన పన్నెండేళ్ల చిన్నారి మహ్మద్ బాబా ఖురేషి కంటి భాగంలో ప్రమాదవశాత్తు గుచ్చుకున్న ఇనుప చువ్వను విజయవంతంగా బయటకు తీశారు. ఈ నెల 6న వారి మటన్ దుకాణంలో ఆడుకొంటుండగా మాంసాన్ని వేలాడదీసే పొడవాటి ఇనుప చువ్వ బాబా ఎడమవైపు కంటి పై భాగంలోకి దిగింది. తల భాగంలో మెదడుకు దగ్గరగా చొచ్చుకుపోయింది. వెంటనే అతడిని ఉస్మానియా ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి శస్త్రచికిత్సకు ఉపక్రమించారు. న్యూరో సర్జరీ విభాగాధిపతి డాక్టర్ ప్రేమ్జిత్రాయ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వేణుగోపాల్ ఈ నెల 7న బాబాకు విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. మెదడుకు ఎటువంటి ప్రమాదం జరగకుండా ఇనుప చువ్వను బయటకు తీశారు. చిన్నారి కోలుకోవడంతో శుక్రవారం డిశ్చార్జి చేశారు. బాబా పరిస్థితి మెరుగ్గా ఉందని, ఆందోళన చెందాల్సిన పనిలేదని వైద్యులు తెలిపారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో దాదాపు లక్ష రూపాయల వరకు ఖర్చయ్యే ఆపరేషన్‌ను ఉస్మానియాలో ఉచితంగా చేశామన్నారు. -
ఆరుగురు రైతులకు పునర్జన్మ
సాక్షి, హైదరాబాద్: పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఆరుగురు నిరుపేద రైతు, రైతు కూలీలకు ఉస్మానియా వైద్యులు పునర్జన్మ ప్రసాదించారు. రోజుల తరబడి వెంటిలేటర్లపై ఉండటంతో శ్వాసనాళం కుంచించుకుపోయి ఊపిరి తీసుకోలేకపోతున్న వారికి విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. మృత్యు ద్వారం వరకు వెళ్లి తిరిగిన వచ్చిన వీరు కోలుకోవడంతో బుధవారం డిశ్చార్జి చేశారు. ‘హెల్పింగ్ హ్యాండ్’ సౌజన్యంతో ఉస్మానియా కార్డియో థొరాసిక్ సర్జరీ విభాగాధిపతి జి.శ్రీనివాస్, ఈఎన్టీ విభాగాధిపతి రంగనాథ్‌స్వామి, అనెస్థీషియా విభాగాధిపతి సి.జి.రఘురామ్ల నేతృత్వంలోని వైద్య బృందం నిర్వహించిన ఈ అరుదైన శస్త్రచికిత్స వివరాలివి... అప్పుల బాధతో... అప్పుల బాధకు తట్టుకోలేక నిజామాబాద్ జిల్లా అమృతాపూర్ రైతు బి.సంతోష్(28), మెదక్ జిల్లా నాచారం కౌలు రైతు పి.నర్సింహా(28), మహబూబ్‌నగర్‌కు చెందిన రైతు కూలీ ఎస్.కృష్ణ(24), రంగారెడ్డి జిల్లా చేవెళ్ల రైతు కూలీ జి.లలిత(28), ఖమ్మం జిల్లా రైతు కుటుంబానికి చెందిన విద్యార్థి వీరన్న(20), మహబూబ్‌నగర్‌కు చెందిన రైతు ఎ.నారాయణ(30) ఇటీవల పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. వ్యవసాయం కోసం కొందరు... కుటుంబ పోషణకు మరికొందరు అప్పులు చేసి, అవి తీరే మార్గం లేక ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. చికిత్స కోసం బంధువులు వీరిని ఉస్మానియాకు తీసుకువచ్చారు. చికిత్సలో భాగంగా వైద్యులు బాధితులను 15 నుంచి 25 రోజులపాటు వెంటిలేటర్‌పై ఉంచాల్సి వచ్చింది. ఇన్ని రోజులు వెంటిలేటర్‌పై ఉండటం వల్ల ఒత్తిడికి లోనై, ఇన్ఫెక్షన్ వచ్చింది. దీంతో శ్వాసనాళాలు పూర్తిగా కుంచించుకుపోయాయి. వారికి శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. మాట పడిపోయింది. వైద్య పరిభాషలో దీన్ని ‘ట్రాకియల్ స్టెనోసిస్’గా పిలుస్తారు. దీనికి చికిత్స ఎంతో క్లిష్టమే కాకుండా ఖరీదు కూడా. ఆరోగ్యశ్రీ పథకంలో వీటికి అనుమతి లేదు. ఈ క్రమంలో ‘హెల్పింగ్ హ్యాండ్’ స్వచ్ఛంద సంస్థతో పాటు ‘ఇన్సైట్ ఔట్రిచ్ ప్రైవేట్ లిమిటెడ్’ వైద్య ఖర్చులు భరించేందుకు ముందుకు వచ్చాయి. ఉదయం 9 నుంచి రాత్రి 10 వరకు... డాక్టర్ జి.శ్రీనివాస్ నేతృత్వంలో వైద్య బృందం సెప్టెంబర్ 23న శస్త్రచికిత్స నిర్వహించింది. ఉదయం 9 నుంచి రాత్రి 10 గంటల వరకు శ్రమించిన వైద్యులు... గొంతుకు చిన్న రంధ్రం చేసి శ్వాస నాళంలో ‘డ్యూరాన్ స్టంట్’ను విజయవంతంగా అమర్చారు. బాధితులకు తిరిగి ఊపిరులూదారు. ఒక్కో స్టంట్‌కు రూ.80 వేలు ఖర్చయిందని వైద్యుల బృందం చెప్పింది. హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్, ఇన్సైట్ ఔట్రిచ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు వీటిని సమకూర్చినట్లు ఉస్మానియా సూపరింటిండెంట్ సి.జి.రఘురామ్ తెలిపారు. కాగా, వీరితో పాటు కుటుంబ సమస్యలతో మనస్థాపం చెంది పురుగుల మందు సేవించిన సావిత్రి (32; కడప జిల్లా జమ్మలమడుగు)కి కూడా శస్త్రచికిత్స చేసినట్లు చెప్పారు. -
తీరుమారని ‘ఉస్మానియా’!
=మరోసారి బయటపడిన వైఫల్యం =క్షతగాత్రులకు వైద్యం అందించడంలో నిర్లక్ష్యం =ఆందోళనకు దిగిన బాధితుల బంధువులు =వైద్యుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు ఫిర్యాదు =మెరుగైన వైద్యం కోసం కేర్‌కు తరలింపు సాక్షి, సిటీబ్యూరో: క్షతగాత్రులకు వైద్యం అందించడంలో ఉస్మానియా వైద్యుల వైఫల్యం మరోసారి బయటపడింది. దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల ఘటనలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులకు వైద్యం అందించలేక అభాసు పాలైన ఆస్పత్రి వైద్యులు తాజాగా మరోసారి తమ వైఫల్యాన్ని చాటుకున్నారు. క్షతగాత్రులకు వైద్యం అందించడంలో వైద్యులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ బాధితుల బంధువులు ఆందోళనకు దిగడంతో జిల్లా కలెక్టర్ ముఖేష్‌కుమార్ మీనా స్వయంగా జోక్యం చేసుకోవాల్సి వచ్చిందంటే ఇక్కడి పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. విజయనగర్ కాలనీ కోటమ్మబస్తీలో గోడ కూలిన ఘటనలో తీవ్రంగా గాయడపడిన మావూళ్లు (30), అతని పెద్దకుమారుడు శ్రీహరి (8)లను గురువారం ఉదయం 7 గంటలకు ఉస్మానియా క్యాజువాలిటీకి తీసుకొచ్చారు. ఆ సమయంలో సీనియర్ వైద్యులెవరూ అందుబాటులో లేరని బాధితుల తరఫు బంధువులు ఆరోపించారు. ఎమర్జెన్సీ మెడికల్ డిపార్ట్మెంట్ ఏదీ? రక్తమోడుతున్న క్షతగాత్రులకు వైద్యం అందించడంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, కనీసం ప్రాథమిక చికిత్స కూడా చేయడం లేదని బంధువులు ఆందోళనకు దిగారు. ఇదే అంశంపై జిల్లా కలెక్టర్ ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు. బంధువుల విజ్ఞప్తి మేరకు క్షతగాత్రులను కేర్‌కు ఆస్పత్రికి తరలించారు. అయితే అనుకోని సంఘటనలు, భారీ ఉపద్రవాలు చోటు చేసుకున్నప్పుడు వచ్చే మాస్ క్యాజువాలిటీని ఎదరుర్కొనేందుకు ఉస్మానియా అధికారుల వద్ద ఇప్పటికీ ఓ ప్రత్యేక ప్రణాళికంటూ లేదు. ఫలితంగా దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల బాధితులను మెరుగైన వైద్య సౌకర్యాల కోసం ఉస్మానియా నుంచి ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ ఉదంతంపై అప్పట్లో తీవ్ర విమర్శలు ఎదురైనా అధికారుల తీరులో మార్పు రాకపోవడం గమనార్హం. సవాళ్లను అధిగమించేందుకు అన్ని విభాగాలతో కూడిన ప్రత్యేక ఎమర్జెన్సీ మెడికల్ విభాగాన్ని ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు ఆ ప్రయత్నమే చేయలేదు. మందులు వైద్య పరికరాల కొరత పేరుతో బాధితులను వదిలించుకోవడం మినహా క్యాజువాలిటీ సేవ లను మెరుగు పరిచే దిశగా చర్యలు చేపట్టకపోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. నిర్లక్ష్యం లేదు.. క్షతగాత్రులకు వైద్యం అందించడంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ బంధువులు చేసిన ఆరోపణల్లో ఏ మాత్రం వాస్తవం లేదు. ఎమర్జెన్సీకి వచ్చిన వెంటనే బాధితులను అడ్మిట్ చేసుకున్నాం. సంబంధిత విభాగాలకు తరలించి మెరుగైన వైద్యం అందించాం. బాధితులను కార్పొరేట్ ఆస్పత్రికి తరలించాల్సిందిగా బంధువులు చేసిన విజ్ఞప్తి మేరకే కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అంతే కానీ ఆస్పత్రిలో వైద్యం అందడం లేదనే అంశంపై కాదు. - డాక్టర్ శివరామిరెడ్డి, సూపరింటెండెంట్, ఉస్మానియా ఆస్పత్రి