దేశంలోనే తొలిసారిగా నిర్వహించిన ఉస్మానియా వైద్యులు
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు మరో ఘనత సాధించారు. హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్న ఓ యువకుడికి దేశంలోనే తొలిసారి విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. నల్లగొండ జిల్లా మాచవరానికి చెందిన హరికృష్ణ (19) హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్నాడు. మందులు వాడినా బీపీ కంట్రోల్ కాలేదు. ఒక్కోసారి 300/120 ఎంఎం నమోదు అయ్యేది. వైద్య పరిభాషలో దీన్ని ‘తక్యాసూస్ ఆర్టిటీస్’గా పిలుస్తారు.
శ్వాస సరిగా తీసుకోలేకపోవడం వల్ల గుండె స్పందనపై ఒత్తిడి పెరిగి తీవ్ర ఇబ్బంది పడేవాడు. చికిత్స కోసం అనేక మంది కార్డియాలజిస్టులను సంప్రదించాడు. ఫలితం లేకపోవడంతో ఏడాది క్రితం ఉస్మానియా నెఫ్రాలజీ విభాగాధిపతి డాక్టర్ మనిషా సహాయ్‌ని కలిశాడు. కిడ్నీ రక్త నాళాల్లో రెనిన్ అనే పదార్థం ఉత్పత్తి కావడమే హైపర్ టెన్షన్‌కు కారణమని మనిషా నిర్ధారించారు.
కిడ్నీలకు రక్తాన్ని సరఫరా చేసే రక్త నాళాలకు బైపాస్ చేయడం ఒక్కటే దీనికి పరిష్కారమని భావించారు. ఆ మేరకు ఏడాది క్రితం ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ మధుసూదన్ నేతృత్వంలోని వైద్య బృందం అతని ఎడమ కిడ్నీకి స్ప్లేనో రెనల్ ఆర్టేరియల్ అండ్ ఇన్‌ఫీరియర్ మెసెంటెరిక్-రెనల్ ఆర్టేరి బైపాస్ చేశారు. మూడు రోజుల క్రితం అతడి కుడి భాగంలోని కిడ్నీకి కూడా చికిత్స చేశారు.
పెద్ద పేగులోని మూడు రక్తనాళాల్లో ఒకటి తొలగించి మూత్రపిండాలకు అమర్చారు. ప్రస్తుతం బ్లడ్ ప్రెజర్ కంట్రోల్లోకి వచ్చిందని డాక్టర్ మధుసూదన్ చెప్పారు. ఈ తరహా చికిత్స చేయడం ప్రపంచంలోనే ఇది రెండోసారని పేర్కొన్నారు. ‘ఇండియన్ జర్నల్ ఫర్ నెఫ్రాలజీ’లో దీన్ని ప్రచురించామని, త్వరలోనే ఇంటర్నేషనల్ జర్నల్‌కు పంపుతున్నట్లు ఆయన తెలిపారు.
కిడ్నీ రక్తనాళాలకు బైపాస్
Published Fri, Jun 24 2016 3:34 AM | Last Updated on Mon, Sep 4 2017 3:13 AM
Advertisement