=మరోసారి బయటపడిన వైఫల్యం
=క్షతగాత్రులకు వైద్యం అందించడంలో నిర్లక్ష్యం
=ఆందోళనకు దిగిన బాధితుల బంధువులు
=వైద్యుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు ఫిర్యాదు
=మెరుగైన వైద్యం కోసం కేర్‌కు తరలింపు
సాక్షి, సిటీబ్యూరో: క్షతగాత్రులకు వైద్యం అందించడంలో ఉస్మానియా వైద్యుల వైఫల్యం మరోసారి బయటపడింది. దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల ఘటనలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులకు వైద్యం అందించలేక అభాసు పాలైన ఆస్పత్రి వైద్యులు తాజాగా మరోసారి తమ వైఫల్యాన్ని చాటుకున్నారు. క్షతగాత్రులకు వైద్యం అందించడంలో వైద్యులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ బాధితుల బంధువులు ఆందోళనకు దిగడంతో జిల్లా కలెక్టర్ ముఖేష్‌కుమార్ మీనా స్వయంగా జోక్యం చేసుకోవాల్సి వచ్చిందంటే ఇక్కడి పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
విజయనగర్ కాలనీ కోటమ్మబస్తీలో గోడ కూలిన ఘటనలో తీవ్రంగా గాయడపడిన మావూళ్లు (30), అతని పెద్దకుమారుడు శ్రీహరి (8)లను గురువారం ఉదయం 7 గంటలకు ఉస్మానియా క్యాజువాలిటీకి తీసుకొచ్చారు. ఆ సమయంలో సీనియర్ వైద్యులెవరూ అందుబాటులో లేరని బాధితుల తరఫు బంధువులు ఆరోపించారు.
ఎమర్జెన్సీ మెడికల్ డిపార్ట్‌మెంట్ ఏదీ?
రక్తమోడుతున్న క్షతగాత్రులకు వైద్యం అందించడంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, కనీసం ప్రాథమిక చికిత్స కూడా చేయడం లేదని బంధువులు ఆందోళనకు దిగారు. ఇదే అంశంపై జిల్లా కలెక్టర్ ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు. బంధువుల విజ్ఞప్తి మేరకు క్షతగాత్రులను కేర్‌కు ఆస్పత్రికి తరలించారు. అయితే అనుకోని సంఘటనలు, భారీ ఉపద్రవాలు చోటు చేసుకున్నప్పుడు వచ్చే మాస్ క్యాజువాలిటీని ఎదరుర్కొనేందుకు ఉస్మానియా అధికారుల వద్ద ఇప్పటికీ ఓ ప్రత్యేక ప్రణాళికంటూ లేదు. ఫలితంగా దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల బాధితులను మెరుగైన వైద్య సౌకర్యాల కోసం ఉస్మానియా నుంచి ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించాల్సిన పరిస్థితి తలెత్తింది.
ఈ ఉదంతంపై అప్పట్లో తీవ్ర విమర్శలు ఎదురైనా అధికారుల తీరులో మార్పు రాకపోవడం గమనార్హం. సవాళ్లను అధిగమించేందుకు అన్ని విభాగాలతో కూడిన ప్రత్యేక ఎమర్జెన్సీ మెడికల్ విభాగాన్ని ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు ఆ ప్రయత్నమే చేయలేదు. మందులు వైద్య పరికరాల కొరత పేరుతో బాధితులను వదిలించుకోవడం మినహా క్యాజువాలిటీ సేవ లను మెరుగు పరిచే దిశగా చర్యలు చేపట్టకపోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది.
నిర్లక్ష్యం లేదు..
క్షతగాత్రులకు వైద్యం అందించడంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ బంధువులు చేసిన ఆరోపణల్లో ఏ మాత్రం వాస్తవం లేదు. ఎమర్జెన్సీకి వచ్చిన వెంటనే బాధితులను అడ్మిట్ చేసుకున్నాం. సంబంధిత విభాగాలకు తరలించి మెరుగైన వైద్యం అందించాం. బాధితులను కార్పొరేట్ ఆస్పత్రికి తరలించాల్సిందిగా బంధువులు చేసిన విజ్ఞప్తి మేరకే కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అంతే కానీ ఆస్పత్రిలో వైద్యం అందడం లేదనే అంశంపై కాదు.
- డాక్టర్ శివరామిరెడ్డి, సూపరింటెండెంట్, ఉస్మానియా ఆస్పత్రి
తీరుమారని ‘ఉస్మానియా’!
Published Fri, Oct 25 2013 3:43 AM | Last Updated on Fri, Sep 1 2017 11:56 PM
Advertisement