విజయ'నరకం' కాలనీ
♦ నెల రోజులుగా బిక్కుబిక్కుమంటు కాలం వెల్లదీస్తున్న కాలనీవాసులు
♦ రాజకీయ చిచ్చుతో పేదల బతుకులు రోడ్డు పాలు
♦ ఎమ్మెల్యే నిర్వాకంతోనే ఇళ్లు కూల్చేశారంటున్న స్థానికులు
⇒ కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలో ఉన్న విజయనగర్‌కాలనీ ఇది.. నిరాశ్రయులు.. రోజు కూలీలు, చిరువ్యాపారులు..ఆటో కార్మికులు.. ఇలా ఎందరో అభాగ్యులు.. ‘గూడు’ కట్టుకున్న కష్టాలతో పగలనక..రాత్రనక అష్టకష్టాలు పడి తినీ తినక తలదాచుకునేందుకు ఇంత ఆశ్రయం కల్పించుకున్నారు. అంతలోనే పాలకులు, అధికారుల కళ్లు కుట్టాయి...రాజకీయ కక్షతో పేదల గుండె‘గూడు’ను ఛిదిమేశారు. గంటల వ్యవధిలోనే ఎందరో బతుకులు ఛిద్రమయ్యాయి.. నిలువనీడ కోల్పోయారు...పిల్లాపాపలు, చిన్నా పెద్ద, ముసలి ముతక అంతా దిక్కులేనివారయ్యారు. సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిల్చారు..ఇది జరిగి సరిగ్గా 34 రోజులవుతున్నా.. ఆశ్రయం లేదు. ఆదుకునేవారు లేక ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. – అనంతపురం న్యూసిటీ:
అమ్మకు అన్నం పెట్టరు కానీ..పిన్నమ్మకు బంగారు గాజులు!
200 ఇళ్లు నేలమట్టమయ్యాయి. 34 రోజులుగా ఈ కుటుంబాలన్నీ రోడ్డున పడ్డాయి. వీళ్లంతా ప్రతిపక్ష పార్టీ వర్గీయులనుకుంటే పొరపాటు. అధికార టీడీపీలో ఉంటూ.. ఆ పార్టీ నేతలు చెప్పడంతో విజయనగర్ కాలనీలో ఓ గూడు కట్టుకున్న నిరుపేదలు. అనంతపురం ఎమ్మెల్యేకు.. అదే పార్టీలోని స్థానిక కార్పొరేటర్‌కు మధ్య నెలకొన్న విభేదాలతో కష్టజీవుల గూడు చెదిరింది. కన్నీటి గాథ మిగిలింది. శిథిలాల మధ్య న్యాయం కోసం నిరీక్షిస్తున్నా.. కనీసం ఆ పార్టీ నాయకులు ఎవరు కూడా ఓ ముద్ద అన్నం పెట్టని పరిస్థితి. ఇదిగో అక్కడే పడున్న సీఎం చంద్రబాబు ఫొటో సాక్షిగా ఇప్పుడు అక్కడ వర్గపోరు రాజ్యమేలుతోంది.
కృతజ్ఞత కూడా చూపలేదు..
ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి సొంత పార్టీ వారినే మోసగించారు.
సంవత్సరాలుగా కష్టపడి రూ. 3 లక్షలతో ఇల్లు కట్టుకున్నా. ఎన్నికల ముందు ఆయన గెలుపునకు ప్రచారం చేసిన కృతజ్ఞత కూడా
చూపలేదు. నేను నా భార్య మాబి కులాంతర వివాహం చేసుకున్నాం.
ఏడాదిన్నర పాప ఉంది. ప్రస్తుతం నా భార్య 9 నెలల గర్భిణి. రాత్రి ఇదే కవర్‌షెడ్డులో ఉంటున్నాం. మా పరిస్థితి ఎవరితో చెప్పుకోవాలి.
పార్టీనే నమ్ముకుని జీవిస్తున్న మాలాంటోల్లకు ఇలా చేస్తే ఎలా. – జగదీష్, విజయనగర్ కాలనీ
అనంతరపురం నగర పరిధిలోని 29వ డివిజన్ విజయనగర్ కాలనీ ఎక్స్‌టెన్షన్‌లో ఏడాదిన్నరగా నిర్మాణాలు జరుగుతున్నాయి. ట్రాన్స్‌కో అధికారులు కరెంటు లైన్ లాగి ఇళ్లకు కరెంటు ఇచ్చారు. నగరపాలక సంస్థ అధికారులు ఇంటి పన్ను వేసేందుకు రంగం సిద్ధం చేశారు. కలెక్టరేట్‌కు సమీపంలో ఉండే విజయనగర్ కాలనీలో నిర్మాణాలు జరుగుతున్నా ఏనాడూ రెవెన్యూ అధికారులు అటువైపు తొంగి చూడలేదు. అన్నీ తెలిసే అధికారులు ఏమీ చేయలేదు. తెలుగుదేశం పార్టీలోని గ్రూపు రాజకీయాలతో నిరుపేదలు రూ. లక్షలు వెచ్చించి కట్టుకున్న ఇళ్లను అక్రమ నిర్మాణం చేపట్టారని రెవెన్యూ అధికారులు నేలమట్టం చేశారు.
రోడ్డువైపు చిన్న బండి పెట్టుకుంటేనే నానా హంగామా చేసే అధికారులు.. పేదలు ఇల్లు నిర్మించుకుంటున్నప్పుడు కళ్లప్పగించి చూస్తూ ఉండిపోయి, తీరా ఇల్లు కట్టుకున్నామనుకున్నాక తొలగించారని ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్థానికులు ఎమ్మెల్యే కారణంగానే ఇళ్లు తొలగించారంటూ ప్రభుత్వ సర్వజనాస్పత్రి ఎదుట ధర్నా చేపట్టారు. అధికార పార్టీ అండదండలతోనే రెవెన్యూ అధికారులు పేదల జీవితాలతో ఆడుకున్నారని బాధితులు చెప్పుకుంటున్నారు.
రాజకీయ కక్షతోనే..
టీడీపీలోని గ్రూపు రాజకీయాలు విజయనగర్ కాలనీ ఎక్స్‌టెన్షన్‌లో ఇళ్లు కట్టుకున్న పేదలకు శాపంగా మారాయి. రాజకీయచిచ్చులో పేదల బతుకులు చిద్రమయ్యాయి. 34 రోజుల క్రితం విజయనగర్ కాలనీ ఎక్స్‌టెన్షన్‌లో రెవెన్యూ అధికారులు సుమారు 200 ఇళ్లును నేటమట్టం చేసిన విషయం విదితమే. ఎండనక, వాననక కష్టపడి కూడబెట్టుకున్న నగదు కొంత, బంగారాన్ని తాకట్టు పెట్టిన సొమ్ము కొంత కలుపుకుని సొంతి ళ్లు కట్టుకున్నారు. అధికారపార్టీ నేతలు వారి సొం తింటి కళను దూరం చేశారు. అధికార పార్టీలోని గ్రూపు రాజకీయాలతో పేద ప్రజలు నెల రోజులుగా ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. అప్పటి నుంచి ఎవరో ఒకరు తమకు దారి చూపుతారని ఆశతో ఎదురు చూస్తున్నారు ఆ అభాగ్యులు.
ప్రత్యక్ష నరకం...:
ఇల్లు కట్టుకున్నాం.. ఇక తలదాచుకోవచ్చనుకునే సమయంలో అన్నీ కూల్చేశారు. నిలువనీడలేకుండా చేశారు. ఇప్పుడేమో వానాకాలం.. ఎక్కడ తలదాచుకోవాలో తెలియదు.. ఎండకు ఎండుతున్నాం.. వానకు తడుస్తున్నాం.. కరెంటు లేదు.. చిమ్మచీకటిలో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నామని బాధితులు వాపోతున్నారు. శివారు ప్రాంతం కావడంతో విషపురుగులు సంచారం ఎక్కువగా ఉంది. చిన్న పిల్లలకు ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంతో కాలం గడుపుతున్నామని కాలనీవాసులు అంటున్నారు.
బంగారం తాకట్టుపెట్టి కట్టుకున్నాం
నా భర్త రత్నం బేల్దారి పని చేస్తాడు. మాది పేద కుటుంబం. ఇద్దరు పిల్లలు ఉన్నారు. రూ.3లక్షలు పోసి ఇల్లు కట్టుకున్నాం. బంగారం తాకట్టు పెట్టడంతో పాటు మా బంధువులతో అప్పుతెచ్చాం. ఇప్పుడేమో వారు అసలిస్తే చాలు వడ్డీ వద్దని డిమాండ్ చేస్తున్నారు. కట్టుకున్న ఇల్లు పోయింది. రోడ్డున పడ్డాం. మా బాధ ఎవరితో చెప్పుకోవాలి. రాత్రి వేళలో పురుగూపుట్ర ఎక్కడ కుడుతాయోనని భయంగా కాలం వెల్లదీస్తున్నాం. – అరుణ, విజయనగర్ కాలనీ
రాజకీయ కుట్రతోనే ఇళ్లు కూల్చారు
రాజకీయ కుట్రతోనే పేదల ఇళ్లు కూల్చారు. నాపై ఉన్న కక్షతోనే ఎమ్మెల్యే ఇంతటి దారుణానికి ఒడిగట్టారు. మూడేళ్లుగా ఇళ్లు కట్టినప్పుడు అధికారులకు కనపడలేదా?..కరెంటు ఇచ్చి, ఇంటి పన్ను వేస్తామని ఇప్పుడిట్ల చేస్తే ఎలా?
– ఉమామహేశ్వర్, 29వ డివిజన్ కార్పొరేటర్