Emergency Medical Department
-
‘గాంధీ’.. ఓ ధీమా
►గాంధీలో 65 పడకలతో ఈఎండీ వార్డు ►సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో మరో 45 పడకలు ►110కు చేరనున్న ఐసీయూ పడకల సామర్థ్యం ►త్వరలో ప్రారంభించనున్న గవర్నర్ గాంధీ ఆస్పత్రి.. ఓ ధైర్యం.. ఓ నమ్మకం.. అక్కడికి వెళితే ఏ జబ్బైనా నయమవుతుందనే ధీమా.. వేలాదిమంది గాంధీలో చికిత్స పొందుతుంటారు.. అయితే అత్యవసర రోగుల తాకిడి కూడా ఎక్కువగా ఉంది.. అందుకే 65 పడకలతో ఎమర్జెన్సీ మెడికల్ డిపార్ట్మెంట్(ఈఎండీ)ని ఏర్పాటు కానుంది. సిటీబ్యూరో: గాంధీ జనరల్ ఆస్పత్రిలో అత్యవసర రోగుల కష్టాలు తీరనున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి వచ్చిన రోగులందరికీ మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఆస్పత్రిలో అత్యాధునిక ఐసీయూ అందుబాటోలోకి రాబోతోంది. ఓపీ భవనంలోని మూడో అంతస్తులో 65 పడకల సామర్థ్యంతో ఎమర్జెన్సీ మెడికల్ డిపార్ట్మెంట్(ఈఎండీ)ని ఏర్పాటు చేసింది. గరవ్నర్ నరసింహన్ త్వరలోనే దీన్ని ప్రారంభించే అవకాశంఉంది. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి గవర్నర్‌ను కలిసి ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వనించగా, ఆయన ఇందుకు అంగీకరించినట్లు తెలిసింది. రూ.5.50 కోట్లతో ఏర్పాటు ప్రతిష్టాత్మాక గాంధీ జనరల్ ఆస్పత్రిలో ప్రస్తుతం 1265 పడకల సామర్థ్యం ఉంది. ఆస్పత్రి అవుట్ పేషంట్ విభాగానికి రోజుకు సగటున 2800–3000 మంది వస్తుండగా, ఇక్కడ నిత్యం 1500 మంది చికిత్స పొందుతున్నారు. 18 ఆపరేషన్ థియేటర్లు ఉండగా, వీటిలో రోజుకు సగటున 150 మైనర్, 50 మేజర్ చికిత్సలు జరుగుతున్నాయి. వివిధ ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులు, హృద్రోగులు, కిడ్నీ, కాలేయ, ఇతర సమస్యలతో బాధపడుతున్న బాధితులు మెరుగైన వైద్యసేవలు పొందవచ్చని భావించి గాంధీ అత్యవసర విభాగానికి వస్తుంటారు. అయితే ఆస్పత్రి అత్యవసర విభాగంలో 25కు మించి పడకలు లేవు. రోగుల నిష్పత్తికి తగినన్ని పడకలు లేకపోవడంతో నిరాశతో వెనుతిరుగాల్సి వస్తుంది. రోగులు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం ఆస్పత్రిలో రూ .5.50 కోట్లతో అత్యాధునిక ఈఎండీని ఏర్పాటు చేయాలని భావించింది. తొలి విడతలో 65 పడకలు ఏర్పాటు చేసి, ఆ తర్వాత సూపర్‌స్పెషాలిటీ ఐసీయూలో మరో 45 పడకలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. హైడ్రాలిక్ పడకలతో పాటు సెంట్రలైజ్ ఏసీ సహా ప్రత్యేక ఆక్సిజన్లైన్, అటెండెంట్లకు అవసరమైన కుర్చీలను సమకూర్చింది. గాంధీలో సౌకర్యాలు మెరుగు పరుస్తుండటం పట్ల రోగులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. 95 నర్సింగ్, 25 మంది వైద్యులు అవసరం ఆస్పత్రిలో అత్యాధునిక హంగులతో కొత్తగా ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ మెడికల్ డిపార్ట్మెంట్లో మెరుగైన వైద్యసేవల కోసం 25 మంది ఇంటెన్సివ్‌కేర్ స్పెషలిస్టులతో పాటు 95 మంది నర్సులు, మరో 75 మంది పారామెడికల్స్టాఫ్, స్వీపర్లు, ల్యాబ్ అసిస్టెంట్లు అవసరం. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖకు పంపాం. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే ఈ పోస్టులను భర్తీ చేస్తాం. మూడో అంతస్థులోని ఈఎండీకి చేరుకునేందుకు లిఫ్ట్లును కూడా సిద్ధం చేస్తున్నాం. మరో వారం పదిరోజుల్లో ఇవి సిద్ధం అవుతాయి. – డాక్టర్ శ్రవణ్ కుమార్, సూపరింటెండెంట్, గాంధీ జనరల్ ఆస్పత్రి -
ట్రామా కేర్లెస్
జీజీహెచ్ క్యాజువాలిటీలో కనీస సౌకర్యాలు కరువు అత్యవసర సేవల విభాగంలో పనిచేయని ఏసీలు వినియోగంలోకి రాని ఆపరేషన్ థియేటర్ కూర్చునేందుకు బల్లలు,తాగునీటి కొళాయిలూ లేవు వైద్యం కోసం రోగుల అవస్థలు గుంటూరు మెడికల్: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో నాలుగేళ్లకు పైగా కాలయాపన చేసి సుమారు 30 కోట్ల రూపాయలతో నిర్మించిన పొదిల ప్రసాద్ సూపర్ స్పెషాలిటీ అండ్ ట్రామా సెంటర్లో రోగులకు వైద్యం కోసం అవస్థలు తప్పడం లేదు. కార్పొరేట్ ఆస్పత్రి కంటే ధీటుగా భవన నిర్మాణం చేసిన అధికారులు అందులో కనీసం సాధారణ వైద్యసేవలైనా అందేలా చూడడంలో విఫలం అవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ట్రామా సెంటర్‌ను అధికారికంగా జనవరిలో ప్రారంభించినా వైద్యసేవలు మాత్రం గత నెలలోనే ప్రారంభమయ్యాయి. అత్యవసర వైద్యసేవల విభాగం(క్యాజువాలిటీ), ఎక్యూట్ మెడికల్ కేర్ యూనిట్(ఏఎంసీ), ఎక్స్‌రే, సి.టి.స్కాన్, ఈసీజీ ,ల్యాబ్ తదితర వ్యాధి నిర్ధారణ కేంద్రాల్లో తొలుత వైద్యసేవలను అందిస్తున్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం వచ్చే రోగులకు ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయక పోవడంతో రోగుల అవస్థలు పడుతున్నారు. కనీసం కూర్చునేందుకు కుర్చీలు లేదా బల్లలు కూడా అధికారులు ఏర్పాటుచేయలేదు. కొత్త భవనంలో ఎక్కడా కూడా రోగులకు తాగేందుకు మంచినీటి కుళాయి ఏర్పాటు చేయలేదు. కొన్ని రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలకు తప్పనిసరిగా రోగులు మంచినీరు తాగి వెళ్లాలి. భారత వైద్య మండలి నిబంధనల ప్రకారం కుర్చునేందుకు బల్లలు, తాగేందుకు మంచినీటి వసతి తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. మరుగుదొడ్లలో ఉన్న కుళాయిల్లో నీటి సరఫరా సక్రమంగా రావటం లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగా నిర్మించినప్పటికి నీటి సరఫరా లేకపోవటంతో టాయ్స్‌లెట్స్‌కు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. క్యాజువాలిటీలో డ్యూటీ డాక్టర్స్ కోసం ఏర్పాటు చేసిన గదులు అలంకార ప్రాయంగానే ఉంటున్నాయే తప్పా సకాలంలో విధులకు హాజరుకావటం లేదనే ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. రాత్రివేళల్లో ఎక్కువగా ఇలాంటి ఫిర్యాదులు వస్తున్నాయి. పనిచేయని ఏసీలు... నాలుగు రోజులుగా క్యాజువాలిటీలో ఏసీలు పనిచేయటం లేదు. ఏసీల చల్లదనం బయటకు పోకుండా గదులను పూర్తిగా మూసివేసి నిర్మాణాలు చేయటంతో నేడు అవి పనిచేయక గదుల్లో ఉంటున్న రోగులు అల్లాడిపోతున్నారు. ప్రారంభమైన రెండునెలలకే సెంట్రల్ ఏసీలు పనిచేయకపోవటం ఇంజనీరింగ్ అధికారుల పనితీరుకు నిదర్శంగా చెప్పుకోవచ్చు. ప్రాణాపాయ స్థితిలోఉండే రోడ్డు ప్రమాద బాధితులు, వ్యాధి బాధితులు అత్యవసర విభాగంలో ఏసీలు పనిచేయక ఇబ్బందులు పడుతున్నారు. ఆపరేషన్ థియేటర్ ఊసేది... భారత వైద్య మండలి నిబంధనల ప్రకారం ట్రామాకేర్ సెంటర్లో ఆపరేషన్ థియేటర్ తప్పనిసరిగా ఏర్పాటుచేయాలి. జీజీహెచ్ అధికారులు చిన్న ఆపరేషన్ థియేటర్‌ను ఏర్పాటుచేశారు. అది ఆపరేషన్లు చేసేందుకు ఏమాత్రం సరిపోకపోవటంతో రెండునెలలుగా వినియోగంలోకి రాకుండా అలంకార ప్రాయంగానే ఉంది. నిబంధనల ప్రకారం ట్రామాకేర్ సెంటర్లో మేజర్ ఆపరేషన్ థియేటర్‌ను నిర్మిస్తేనే ఆపరేషన్లు చేసే వీలుంటుందని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. ఆపరేషన్ థియేటర్ క్యాజువాలిటిలో లేక పోవటంతో బాధితులను, రోగులను పాతబిల్డింగ్(ఇన్ పేషేంట్ విభాగం) లోకి తరలించేందుకు అధిక సమయం పడుతుందని, ఈ లోగా ప్రమాధ బాధితులకు గోల్డెన్ అవర్‌లో అందాల్సిన వైద్యం అందకుండా పోయే ప్రమాదం ఉంది. అధికారులు ఇప్పటికైనా స్పందించి రోగుల సమస్యలపై దృష్టి పెట్టాలని పలువురు రోగులు కోరుతున్నారు. క్యాజువాలిటీలో రోగులు అవస్థలపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ తన్నీరు వేణుగోపాలరావును వివరణ కోరగా రోగులకు వైద్య పరీక్షల గది వద్ద నిలబడి ఉండకుండా కుర్చీలు, బల్లలు త్వరలోనే కొనుగోలు చేయిస్తామన్నారు. ఆపరేషన్ థియేటర్స్ నిర్మాణం పై విభాగంలో కొనసాగుతున్నట్లు తెలిపారు. -
తీరుమారని ‘ఉస్మానియా’!
=మరోసారి బయటపడిన వైఫల్యం =క్షతగాత్రులకు వైద్యం అందించడంలో నిర్లక్ష్యం =ఆందోళనకు దిగిన బాధితుల బంధువులు =వైద్యుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు ఫిర్యాదు =మెరుగైన వైద్యం కోసం కేర్‌కు తరలింపు సాక్షి, సిటీబ్యూరో: క్షతగాత్రులకు వైద్యం అందించడంలో ఉస్మానియా వైద్యుల వైఫల్యం మరోసారి బయటపడింది. దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల ఘటనలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులకు వైద్యం అందించలేక అభాసు పాలైన ఆస్పత్రి వైద్యులు తాజాగా మరోసారి తమ వైఫల్యాన్ని చాటుకున్నారు. క్షతగాత్రులకు వైద్యం అందించడంలో వైద్యులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ బాధితుల బంధువులు ఆందోళనకు దిగడంతో జిల్లా కలెక్టర్ ముఖేష్‌కుమార్ మీనా స్వయంగా జోక్యం చేసుకోవాల్సి వచ్చిందంటే ఇక్కడి పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. విజయనగర్ కాలనీ కోటమ్మబస్తీలో గోడ కూలిన ఘటనలో తీవ్రంగా గాయడపడిన మావూళ్లు (30), అతని పెద్దకుమారుడు శ్రీహరి (8)లను గురువారం ఉదయం 7 గంటలకు ఉస్మానియా క్యాజువాలిటీకి తీసుకొచ్చారు. ఆ సమయంలో సీనియర్ వైద్యులెవరూ అందుబాటులో లేరని బాధితుల తరఫు బంధువులు ఆరోపించారు. ఎమర్జెన్సీ మెడికల్ డిపార్ట్మెంట్ ఏదీ? రక్తమోడుతున్న క్షతగాత్రులకు వైద్యం అందించడంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, కనీసం ప్రాథమిక చికిత్స కూడా చేయడం లేదని బంధువులు ఆందోళనకు దిగారు. ఇదే అంశంపై జిల్లా కలెక్టర్ ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు. బంధువుల విజ్ఞప్తి మేరకు క్షతగాత్రులను కేర్‌కు ఆస్పత్రికి తరలించారు. అయితే అనుకోని సంఘటనలు, భారీ ఉపద్రవాలు చోటు చేసుకున్నప్పుడు వచ్చే మాస్ క్యాజువాలిటీని ఎదరుర్కొనేందుకు ఉస్మానియా అధికారుల వద్ద ఇప్పటికీ ఓ ప్రత్యేక ప్రణాళికంటూ లేదు. ఫలితంగా దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల బాధితులను మెరుగైన వైద్య సౌకర్యాల కోసం ఉస్మానియా నుంచి ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ ఉదంతంపై అప్పట్లో తీవ్ర విమర్శలు ఎదురైనా అధికారుల తీరులో మార్పు రాకపోవడం గమనార్హం. సవాళ్లను అధిగమించేందుకు అన్ని విభాగాలతో కూడిన ప్రత్యేక ఎమర్జెన్సీ మెడికల్ విభాగాన్ని ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు ఆ ప్రయత్నమే చేయలేదు. మందులు వైద్య పరికరాల కొరత పేరుతో బాధితులను వదిలించుకోవడం మినహా క్యాజువాలిటీ సేవ లను మెరుగు పరిచే దిశగా చర్యలు చేపట్టకపోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. నిర్లక్ష్యం లేదు.. క్షతగాత్రులకు వైద్యం అందించడంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ బంధువులు చేసిన ఆరోపణల్లో ఏ మాత్రం వాస్తవం లేదు. ఎమర్జెన్సీకి వచ్చిన వెంటనే బాధితులను అడ్మిట్ చేసుకున్నాం. సంబంధిత విభాగాలకు తరలించి మెరుగైన వైద్యం అందించాం. బాధితులను కార్పొరేట్ ఆస్పత్రికి తరలించాల్సిందిగా బంధువులు చేసిన విజ్ఞప్తి మేరకే కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అంతే కానీ ఆస్పత్రిలో వైద్యం అందడం లేదనే అంశంపై కాదు. - డాక్టర్ శివరామిరెడ్డి, సూపరింటెండెంట్, ఉస్మానియా ఆస్పత్రి -
అత్యవసర వైద్యం...దైన్యం
=గాంధీ, ఉస్మానియాల్లో ఇదీ తీరు.. =ప్రాణాలు పోయని ధర్మాసుపత్రులు =జాడలేని అత్యవసర వైద్య విభాగాలు =దగాపడుతున్న రోగులు =వైద్యం అందక గాల్లో కలుస్తున్న ప్రాణాలు కొన ఊపిరితో కొట్టుమిట్టాడే వారు ఆ ఆస్పత్రి మెట్లెక్కగలిగితే చాలు.. ప్రాణాలు దక్కినట్టేనని భావిస్తారు.. ఆ గాలి సోకితే పోతుందనుకున్న ప్రాణం నిలుస్తుందని నమ్ముతారు.. అనుకోని విపత్తులు, ఊహించని ప్రమాదాల బారినపడి క్షతగాత్రులైన వారు మొదట చూసేది వాటివైపే... ఆసియా ఖండంలోనే అతిపెద్ద ధర్మాసుపత్రులవి. రోగుల సేవలో దశాబ్దాల ఖ్యాతిని మూటగట్టుకున్నా ఏం లాభం? ఘనతంతా గతం.. వైద్యమందని దైన్యమే నిజం. ఆశలు ఆవిరవుతున్నాయి. నమ్మకం వమ్మవుతోంది. గుప్పెడు ప్రాణాన్ని కాపాడుకునేందుకు వస్తున్న రోగుల్ని ఈ దవాఖానాలు దగా చేస్తున్నాయి. అత్యవసర విభాగం.. కొన ప్రాణంతో వచ్చే వారికి ఆయుష్షు పోయాల్సిన విభాగమిది. అటు గాంధీ.. ఇటు ఉస్మానియా.. రెండుచోట్లా నయం కాని రీతిలో ఈ విభాగాలు నీరసించిపోయాయి. ‘గోల్డెన్ అవర్’గా పిలిచే చివరి క్షణాలు ఈ ఆసుపత్రుల ఆవరణలోనే అంతిమ గడియలుగా మారిపోతున్నాయి. ఇప్పుడక్కడ పేద రోగుల గుండెచప్పుడు వినేవారు లేరు. ఆదుకోవాల్సిన వైద్య నారాయణులే చేతులెత్తేస్తున్నారు. సాక్షి, సిటీబ్యూరో: కరీంనగర్ జిల్లా పోతర్లపల్లికి చెందిన బోడం సతీష్ (24) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. రక్తమోడుతున్న అతనిని రెండ్రోజుల క్రితం ఉస్మానియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. గంటల తరబడి వైద్యులెవరూ పట్టించుకోలేదు. చేసేది లేక మరో ఆస్పత్రికి వెళ్లిపోయాడు. నగరంలోని వారాసిగూడకు చెందిన చింటూ (22) ఎంఎంటీఎస్ రైలు నుంచి జారి కిందపడితే.. 108లో ఉస్మానియాకు తరలించారు. అత్యవసర విభాగంలో చేరిన అతనిని అరగంటైనా పట్టించుకున్న వైద్యుడే లేడు. దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రమ్య ఇంట్లో వంట చేస్తూ కాలిన గాయాలకు గురైంది. తీవ్ర విషమస్థితిలో చేరిన ఆమెకు దాదాపు రెండు గంటల వరకు కనీసం ప్రథమ చికిత్స కూడా అందించలేకపోయారు. పేదల దవాఖానాలు ప్రభుత్వ నిర్లక్ష్యంతో దగాపడటమే కాక.. తమనే నమ్ముకుని వస్తున్న రోగుల్ని ఉస్సూరనిపిస్తున్నాయి. ప్రాణాలు పోయాల్సిన ఈ ప్రాంగణాలు వైద్యానికి నోచుకోని రోగుల హాహాకారాలతో హోరెత్తుతున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు పొరుగునే ఉన్న న ల్లగొండ, మహబూబ్‌నగర్, వరంగల్, మెదక్ జిల్లాల నుంచి వివిధ ప్రమాదాలు, విపత్తుల్లో గాయపడిన క్షతగాత్రులందరికీ ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులే పెద్దదిక్కు. ఇటువంటి కేసుల్లో అత్యవసర విభాగాలందించే సేవలే కీలకం. కానీ దురదృష్టవశాత్తూ ఁగోల్డెన్ అవర్రూ.గా పిలిచే సమయమంతా పడిగాపులతోనే హరించుకుపోతోంది. పేదల పెద్దదిక్కుగా చెప్పుకునే ఉస్మానియా ఆస్పత్రి అత్యవసర విభాగానికి రోజూ 250-300 మంది రోగులు వస్తుంటారు. సకాలంలో వైద్యం అందక నెలకు ఇద్దరు నుంచి ముగ్గురు మృత్యువాత పడుతున్నట్లు స్వయంగా ఆస్పత్రి వర్గాలే చెబుతున్నాయి. గాంధీ ఆస్పత్రిలోనూ అదే పరిస్థితి నెలకొంది. అనుకోని ప్రమాదాల్లో పదుల కొద్దీ క్షతగాత్రులు గాయాలపాలై ఇక్కడకు వస్తే.. ఆస్పత్రి సిబ్బంది కిందామీదా పడే దుస్థితి నెలకొంటోంది. నిబంధనలేం చెబుతున్నాయంటే.. అన్ని విభాగాల నిపుణులతో కూడిన అత్యవసర వైద్య విభాగం ఎప్పుడూ అందుబాటులో ఉండాలి జనరల్ ఫిజీషియన్, సర్జన్, ఆర్థోపెడిక్, కిడ్నీ, హృద్రోగ నిపుణుడు, అనెస్థీషియా నిపుణులతో పాటు సహాయకులుగా పీజీలు 24 గంటలూ దశల వారీగా విధుల్లో ఉండేలా చూడాలి ఆస్పత్రిలో విధిగా ట్రామా సెంటర్ ఉండాలి రోగుల నిష్పత్తికి తగినన్ని హైడ్రాలిక్ బెడ్స్‌తో పాటు పారామెడికల్ స్టాఫ్, వార్డ్బోయ్లను నియమించాలి రోగుల తరలింపునకు సరిపడే స్ట్రెచర్లు, ట్రాలీలను నిరంతరం అందుబాటులో ఉంచాలి వెంటిలేటర్లు, మొబైల్ ఆక్సిజన్ సిలిండర్లు వంటివి తప్పనిసరి హృద్రోగుల కోసం ఈసీజీ యంత్రం, క్షతగాత్రుల కోసం ప్రత్యేక ఎక్స్‌రే యంత్రాన్ని ఏర్పాటు చేయాలి సత్వర వైద్య పరీక్షల కోసం ప్రత్యేక ల్యాబ్‌తో పాటు రక్తనిధి కేంద్రం అవసరం ఇదీ ‘అత్యవసర వైద్యం’ తీరు నయం కాని రోగం ఉస్మానియా ఆస్పత్రి ఎమర్జెన్సీ విభాగంలో చేరుతున్న బాధితులకు ప్రాథమిక పరీక్షలు చేసి వెంటనే ఆయా విభాగాలకు తరలించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది సమయానికి సూపర్ స్పెషాలిటీ నిపుణులు అందుబాటులో ఉండట్లేదు. వార్డు బోయ్‌లు, స్ట్రెచర్లు, ఇతర సౌకర్యాలు లే క.. బంధువులే రోగుల్ని భుజాన ఎత్తుకుని తీసుకెళ్తున్నారు శ్వాస సరిగా తీసుకోలేని వారికి వెంటనే వెంటిలేటర్ అమర్చాలి. కానీ అత్యవసర విభాగంలో ఒక్క వెంటిలేటరూ కన్పించడం లేదు హైడ్రాలిక్ బెడ్స్ ఏర్పాటు చేయాల్సిన చోట చిరిగిపోయిన పరుపులు, తుప్పుపట్టిన రేకు మంచాలే దిక్కవుతున్నాయి మొబైల్ ఆక్సిజన్ సిలిండర్లు, హృద్రోగులకు అమర్చే ఈసీజీ లీడ్స్, ఎక్సరే యంత్రాలు మచ్చుకైనా లేవు చూసేందుకే సెంట్రలైజ్డ్ ఆక్సిజన్ సిష్టమ్.. పనితీరు మాత్రం పడకేస్తోంది బాంబు పేలుళ్లు, భారీ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నప్పుడు పెద్దసంఖ్యలో వచ్చే క్షతగాత్రులకు వైద్యం అందించేందుకు అవసరమైన అత్యవసరమైన వైద్య విభాగం ఇప్పటికీ లేదు. హే రామ్.. సికింద్రాబాద్‌లోని గాంధీ జనరల్ ఆస్పత్రిలో నిత్యం 1565 మందికిపైగా రోగులు చికిత్స పొందుతుంటారు. అత్యవసర విభాగానికి రోజూ 200 మందికిపైగా రోగులు వస్తుంటారు ఇక్కడ కేవలం 24 పడకలు, ఒక వెంటిలేటర్, ఒక్కోటి చొప్పున ఈసీజీ, ఎక్స్‌రే యంత్రం ఉన్నాయి. వార్డులో సెంట్రలైజ్డ్ ఆక్సిజన్ సిష్టమ్ ఉన్నా పని చేయట్లేదు క్షతగాత్రులకు సత్వర వైద్యం అందించేందుకు ఏడాది క్రితం ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ ల్యాబ్ మూలనపడింది. చిన్నచిన్న పరీక్షలకు సైతం బయటికి వెళ్లాల్సిందే అత్యవసర విభాగంలో హౌస్సర్జన్ల సేవలే కీలకం. వీరు 250 మంది ఉండగా, నిత్యం 50 మందికిపైగా విధులకు హాజరుకావడం లేదు. నిత్యం 7-8 మంది హౌస్ సర్జన్లు పని చేయాల్సిన చోట ఇద్దరు, ముగ్గురే కన్పిస్తున్నారు ఎమర్జెన్సీకి వచ్చిన క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్సలు చేసి అక్కడి నుంచి ఏఎంసీకి తరలించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది అన్ని విభాగాల్లోని నిపుణులతో ఇటీవల ఎమర్జెన్సీ మెడికల్ విభాగాన్ని ఏర్పాటు చేసినా, నేటికీ అమలుకు నోచుకోలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య నిపుణులకు కొరత లేదు. కానీ, కార్పొరేట్ ఆస్పత్రులతో పోలిస్తే సుశిక్షిత పారామెడికల్ సిబ్బంది, వైద్య పరికరాల కొరత ఉంది. పేదల దవాఖానాల్లో రోగులకు వైద్యం అందకపోవడానికి ప్రభుత్వ వైఖరే కారణం. మందులు, ఆస్పత్రి నిర్వహణకు అవసరమైన బడ్జెట్ కేటాయించట్లేదు. మెడికల్ ల్యాబ్‌లు, సాంకేతిక సిబ్బంది, ఇతర యంత్ర పరికరాలు సమకూర్చడం లేదు. అత్యవసర విభాగాల్లో వైద్యులు అందుబాటులో లేకపోవడానికి అధికారుల ఉదాసీన వైఖరే కారణం. - డాక్టర్ నాగేందర్, తెలంగాణ వైద్యుల సంఘం, ఉస్మానియా శాఖ అధ్యక్షుడు