‘గాంధీ’.. ఓ ధీమా
►గాంధీలో 65 పడకలతో ఈఎండీ వార్డు
►సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో మరో 45 పడకలు
►110కు చేరనున్న ఐసీయూ పడకల సామర్థ్యం
►త్వరలో ప్రారంభించనున్న గవర్నర్
గాంధీ ఆస్పత్రి.. ఓ ధైర్యం.. ఓ నమ్మకం.. అక్కడికి వెళితే ఏ జబ్బైనా నయమవుతుందనే ధీమా.. వేలాదిమంది గాంధీలో చికిత్స పొందుతుంటారు.. అయితే అత్యవసర రోగుల తాకిడి కూడా ఎక్కువగా ఉంది.. అందుకే 65 పడకలతో ఎమర్జెన్సీ మెడికల్ డిపార్ట్‌మెంట్(ఈఎండీ)ని ఏర్పాటు కానుంది.
సిటీబ్యూరో: గాంధీ జనరల్ ఆస్పత్రిలో అత్యవసర రోగుల కష్టాలు తీరనున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి వచ్చిన రోగులందరికీ మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఆస్పత్రిలో అత్యాధునిక ఐసీయూ అందుబాటోలోకి రాబోతోంది. ఓపీ భవనంలోని మూడో అంతస్తులో 65 పడకల సామర్థ్యంతో ఎమర్జెన్సీ మెడికల్ డిపార్ట్‌మెంట్(ఈఎండీ)ని ఏర్పాటు చేసింది. గరవ్నర్ నరసింహన్ త్వరలోనే దీన్ని ప్రారంభించే అవకాశంఉంది. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి గవర్నర్‌ను కలిసి ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వనించగా, ఆయన ఇందుకు అంగీకరించినట్లు తెలిసింది.
రూ.5.50 కోట్లతో ఏర్పాటు
ప్రతిష్టాత్మాక గాంధీ జనరల్ ఆస్పత్రిలో ప్రస్తుతం 1265 పడకల సామర్థ్యం ఉంది. ఆస్పత్రి అవుట్ పేషంట్ విభాగానికి రోజుకు సగటున 2800–3000 మంది వస్తుండగా, ఇక్కడ నిత్యం 1500 మంది చికిత్స పొందుతున్నారు. 18 ఆపరేషన్ థియేటర్లు ఉండగా, వీటిలో రోజుకు సగటున 150 మైనర్, 50 మేజర్ చికిత్సలు జరుగుతున్నాయి. వివిధ ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులు, హృద్రోగులు, కిడ్నీ, కాలేయ, ఇతర సమస్యలతో బాధపడుతున్న బాధితులు మెరుగైన వైద్యసేవలు పొందవచ్చని భావించి గాంధీ అత్యవసర విభాగానికి వస్తుంటారు. అయితే ఆస్పత్రి అత్యవసర విభాగంలో 25కు మించి పడకలు లేవు. రోగుల నిష్పత్తికి తగినన్ని పడకలు లేకపోవడంతో నిరాశతో వెనుతిరుగాల్సి వస్తుంది. రోగులు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం ఆస్పత్రిలో రూ .5.50 కోట్లతో అత్యాధునిక ఈఎండీని ఏర్పాటు చేయాలని భావించింది. తొలి విడతలో 65 పడకలు ఏర్పాటు చేసి, ఆ తర్వాత సూపర్‌స్పెషాలిటీ ఐసీయూలో మరో 45 పడకలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. హైడ్రాలిక్ పడకలతో పాటు సెంట్రలైజ్ ఏసీ సహా ప్రత్యేక ఆక్సిజన్‌లైన్, అటెండెంట్లకు అవసరమైన కుర్చీలను సమకూర్చింది. గాంధీలో సౌకర్యాలు మెరుగు పరుస్తుండటం పట్ల రోగులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
95 నర్సింగ్, 25 మంది వైద్యులు అవసరం
ఆస్పత్రిలో అత్యాధునిక హంగులతో కొత్తగా ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ మెడికల్ డిపార్ట్‌మెంట్‌లో మెరుగైన వైద్యసేవల కోసం 25 మంది ఇంటెన్సివ్‌కేర్ స్పెషలిస్టులతో పాటు 95 మంది నర్సులు, మరో 75 మంది పారామెడికల్‌స్టాఫ్, స్వీపర్లు, ల్యాబ్ అసిస్టెంట్లు అవసరం. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖకు పంపాం. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే ఈ పోస్టులను భర్తీ చేస్తాం. మూడో అంతస్థులోని ఈఎండీకి చేరుకునేందుకు లిఫ్ట్‌లును కూడా సిద్ధం చేస్తున్నాం. మరో వారం పదిరోజుల్లో ఇవి సిద్ధం అవుతాయి.
– డాక్టర్ శ్రవణ్ కుమార్, సూపరింటెండెంట్, గాంధీ జనరల్ ఆస్పత్రి