ఇంత అధ్వానమా!
గాంధీ ఆస్పత్రిలో పారిశుద్ధ్య నిర్వహణపై గవర్నర్ అసంతృప్తి
వైద్య సేవలు, మందులు, భోజనం సరఫరాపై ఆరా
హైదరాబాద్: ‘పరిశుభ్రతకు మారుపేరుగా నిలవాల్సిన ఆస్పత్రి ప్రాంగణం ఇంత అపరిశుభ్రంగా.. అధ్వానంగా ఉంటే ఎలా? వార్డుల్లోని మూత్రశాలలు దుర్వాసన వెదజల్లితే అక్కడ చికిత్స పొందుతున్న రోగుల జబ్బులు ఎలా నయమవుతాయి? ఆస్పత్రిలో చేరిన రోగులు పడుకునేందుకు దిండు, కప్పుకునేందుకు దుప్పటి ఎందుకివ్వడం లేదు?’ అంటూ రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ గాంధీ జనరల్ ఆస్పత్రి వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం గాంధీ ఆస్పత్రిని గవర్నర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఔట్ పేషెంట్ సహా అత్యవసర, ఇన్‌పేషంట్ విభాగాలను సందర్శించి.. రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. దుర్వాసన వెదజల్లుతున్న మూత్రశాలలను ఎప్పటికప్పుడు క్లీన్ చేయించాలని ఆదేశించారు.
ఆస్పత్రిలో రోగులకు ఇస్తున్న మందులు, సరఫరా చేస్తున్న భోజనం తదితర సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. శస్త్రచికిత్సలు, వైద్య సేవల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని కొందరు రోగులు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జేవీ రెడ్డి స్పందిస్తూ.. సిబ్బంది కొరత ఉందని, దీనిపై ప్రభుత్వానికి నివేదిక అందజేశామని గవర్నర్‌కు వివరించారు. ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయించిన నిధుల మంజూరు, వాటి ఖర్చుపై టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మరోసారి ఆస్పత్రిని సందర్శిస్తానని, ఆ లోగా లోపాలను సరిదిద్ది మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యులకు సూచించారు.
గవర్నర్ రాకపై వైద్యమంత్రి ఆరా
గాంధీ ఆస్పత్రిలో గవర్నర్ ఆకస్మిక తనిఖీలపై వైద్య, ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి ఆరా తీశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఫోన్ చేసి గవర్నర్ ఏ అంశాలపై ఆరా తీశారని, ఆయనతో ఆస్పత్రి వైద్యులు ఏ అంశాలు మాట్లాడారనే వివరాలు తెలుసుకున్నారు. ఆస్పత్రిలో గవర్నర్ తనిఖీలు చేసిన విషయం తెలుసుకున్న మంత్రి ఆయా విభాగాల అధికారులతో సమావేశమయ్యారు. అత్యవసర విభాగంలో ఆధునీకరణ పనుల కోసం రూ.5 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జీవో నంబర్ 222ని మార్చి 31లోగా ఇంప్లిమెంట్ చేయాలని ఆదేశించారు.