నేటి నుంచి గాంధీలో ఐసీయూ సేవలు
గాంధీ ఆస్పత్రి : ఆధునిక వసతులు, ఆత్యాధునిక వైద్య పరికరాలతో గాంధీ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన 65 పడకల ఇన్‌సెంటివ్ కేర్ యూనిట్ (ఐసీయూ) గురువారం నుంచి అందుబాటులోకి రానుంది. ఆస్పత్రి ఎమర్జెన్సీ భవనం పై అంతస్తులో రూ.5.18 కోట్ల వ్యయంతో నిర్మించిన దీనిని గతనెల 11వ తేదిన రాష్ట్ర గవర్నర్ నరసింహన్ లాంఛనప్రాయంగా ప్రారంభించిన సంగతి విధితమే. సిబ్బంది కొరత, సాంకేతిక సమస్యలను అధిగమించిన ఆస్పత్రి యాజమాన్యం గురువారం ఉదయం నుంచి అత్యవసర రోగులకు అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది.
ఈమేరకు ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్‌కుమార్ నేతృత్వంలో బుధవారం మధ్యాహ్నం సంబంధిత వైద్యాధికారులు, ఆర్‌ఎంఓలు, సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నర్సింగ్ సిబ్బందితో పాటు జూనియర్ వైద్యులు, హౌస్‌సర్జన్లు, ఇంటర్నీస్‌లను కూడా విధుల్లో నియమించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ఐసీయూ ఇన్‌చార్జి, జనరల్ మెడిసిన్ హెచ్‌ఓడీ ప్రొఫెసర్ రాజారావు, స్వైన్‌ఫ్లూ నోడల్ ఆఫీసర్ నరేందర్, వైద్యులు త్రిలోక్‌చందర్, విజయ్‌శేఖర్, ప్రదీప్, ఆర్‌ఎంఓలు జయకృష్ణ, శేషాద్రి, సాల్మన్, గీత, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ అధికారులు పాల్గొన్నారు.