పేదల కోసమే కాదు.. మనందరి కోసం | Governor ESL Narasimhan Inaugurates ICU Center In Gandhi hospital | Sakshi
Sakshi News home page

పేదల కోసమే కాదు.. మనందరి కోసం

Published Fri, Aug 11 2017 1:42 AM | Last Updated on Tue, Aug 21 2018 11:41 AM

పేదల కోసమే కాదు.. మనందరి కోసం - Sakshi

పేదల కోసమే కాదు.. మనందరి కోసం

ప్రభుత్వ దవాఖానాలపై గవర్నర్‌ నరసింహన్‌
వైద్యానికి నేను గాంధీకి వస్తా... మీరూ రండి
తెలంగాణ ఆరోగ్య ముఖచిత్రం మారుతోందని వ్యాఖ్య
గాంధీలో 65 పడకల ఐసీయూ ప్రారంభం


సాక్షి, హైదరాబాద్‌: ‘ప్రభుత్వ దవాఖానాలు పేదల కోసమే కాదు. మనందరి కోసం. నేను కూడా గాంధీ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నాను. సర్జికల్‌ ఇంటర్‌వెన్షన్‌ కోసం ఇక్కడికి వచ్చాను. ప్రస్తుతం హాయిగా ఉన్నాను. ప్రభుత్వ వైద్యశాలలపై నమ్మకం పెంచుకోవాలి. నాకైతే గాంధీ వైద్యశాలపై నమ్మకం ఉంది. నేను హామీ ఇస్తున్నా... ఒకటి రెండేళ్లలో తెలంగాణ ఆరోగ్య ముఖచిత్రం సమూలంగా మారుతుంది. అందరికీ అత్యుత్తమ వైద్యం అందుతుంది’ అని గవర్నర్‌ నరసింహన్‌ చెప్పారు. సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి ఎమర్జెన్సీ బ్లాక్‌లో రూ.5 కోట్లతో ఏర్పాటు చేసిన 65 పడకల అత్యాధునిక ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ను గురువారం ఆయన ప్రారంభించారు. దీంతోపాటు పౌర సమాజ సమాచార యంత్రం, డిజిటల్‌ రేడియోగ్రఫీ, సీటీ స్కాన్, సెంట్రల్‌ డయాగ్నొస్టిక్‌ లేబొరేటరీలను ప్రారంభించారు.

వైద్యం కోసం గాంధీకే రండి...
గవర్నర్‌ మాట్లాడుతూ ‘గాంధీ మనందరి దవాఖానా. నేను కూడా ఇక్కడే చికిత్స తీసుకున్నాను. ఇకపై కూడా తీసుకుంటాను. గతంలో గాంధీకి వచ్చినప్పుడు పరిస్థితి అధ్వానంగా ఉంది. ఇప్పుడా పరిస్థితి మారింది. అధునాతన సదుపాయాలూ అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడకు వేలాది మంది రోగులు వస్తుంటారు. వారి సమస్యలు పరిష్కరించాలి. విమర్శించడం కాదు, భాగస్వాములు కావాలి. ప్రస్తుతం వైద్యులపై బాధ్యత మరింత పెరిగింది. వైద్య రంగంలో రాష్ట్ర ప్రభుత్వం తెస్తున్న మార్పులు ఆరోగ్య తెలంగాణ సాధనే లక్ష్యంగా ఉన్నాయి. మరో రెండేళ్లలో ఆ లక్ష్యం నెరవేరుతుంది. ప్రభుత్వాసుపత్రుల్లో అందుతున్న వైద్య సేవలు, పరికరాల పనితీరుపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలి’అన్నారు.

ఆసుపత్రి ప్రతిష్టను మరింత పెంచాలి...
‘ప్రభుత్వ దవాఖానాల్లో పబ్లిక్, ప్రైవేట్‌ పార్టిసిపేషన్‌ కాదు...గవర్నమెంట్, పబ్లిక్‌ పార్టిసిపేషన్‌ రావాలి. ఏడాది క్రితం నేను గాంధీకి ఇలా వచ్చి అలా వెళ్లాను. సీఎం కేసీఆర్‌... గవర్నర్‌ గాంధీ దవాఖానాకు వచ్చి వెళ్లారని అసెంబ్లీలో చెప్పారు. తర్వాత గాంధీలో అధునాతన ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ని ప్రారంభించుకున్నాం. మంచాలు, పరుపులు, దుప్పట్లు, డాక్టర్లు, నర్సులు, వార్డు బాయ్‌లు, ఆయాలు... ఇలా అనేక మార్పులు వచ్చాయి. ప్రభుత్వం చేయాల్సిందంతా చేసింది. ఇంకా చేస్తూనే ఉంటుంది. ఇక్కడి వైద్య సిబ్బంది దీన్ని సొంత ఆసుపత్రిగా చూసుకోవాలి. ప్రజలందరికీ మంచి వైద్యం అందించేలా కృషి చేసి, ఆసుపత్రి ప్రతిష్టను మరింత విస్తరించాలి’అని నగర మేయర్‌కు నరసింహన్‌ సూచించారు. కార్యక్రమంలో మేయర్‌ బొంతు రామ్మోహన్, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ చైర్మన్‌ కృష్ణమూర్తి, వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రాజేశ్వర్‌తివారీ, డీఎంఈ రమేష్‌రెడ్డి, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీ వేణుగోపాలరావు, గాంధీ ప్రిన్సిపాల్‌ మంజుల, సూపరింటెండెంట్‌ శ్రవణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

ఆ బాధ్యత వైద్యులదే...
నిరుపేదలకు కార్పొరేట్‌ స్థాయిలో వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వైద్యశాలలను తీర్చిదిద్దుతున్నామని ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. ప్రభుత్వ వైద్యశాలల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేశామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు కలిగిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత వైద్యులదేనని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement