గాంధీ ఆస్పత్రిలో అసలేం జరుగుతోంది
వీల్‌చైర్ ఘటనపై గవర్నర్ ఆరా.. విచారణకు కమిటీ ఏర్పాటు
హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో రోగులకు వీల్‌చైర్లు కూడా అందుబాటులో లేవా? అక్కడ అసలేం జరుగుతోందంటూ గవర్నర్ నరసింహన్ ఆరాతీశారు. తక్షణమే తనకు నివేదిక సమర్పించాలని వైద్యశాఖ అధికారులను ఆదేశించినట్లు తెలి సింది. హైదరాబాద్‌లోని బేగంపేటకు చెందిన రాజు విద్యుదాఘాతానికి గురై నడవలేని స్థితిలో గాంధీ ఆస్పత్రికి వచ్చాడు. అక్కడ వీల్‌చైర్ లేకపోవడంతో మరుసటి రోజు చిన్నపిల్లల సైకిల్‌ను వీల్‌చైర్‌గా వినియోగించాడు. ఈ సంఘటనను ఈనెల 17న ‘హేరాం..ఎంతటి దైన్యం’శీర్షికన ‘సాక్షి’ ప్రచురించింది. దీన్ని చదివిన గవర్నర్ వివరణ ఇవ్వాలని వైద్యశాఖను ఆదేశించారు.
మరోవైపు వీల్‌చైర్ ఘటనపై కమిటీ ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించామని శుక్రవారం విలేకరులకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమణి తెలిపారు. ఆస్పత్రిలో 150 వీల్‌చైర్లు, 200 స్ట్రెచర్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. మద్యం సేవించడం లేదా మానివేసే క్రమంలో కొందరు చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తారని, రాజు అదే కోవకు చెందినట్లు తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. ఇంట్లో చిన్నపిల్లల సైకిల్‌పైనే తిరుగుతాడని అతని కుటుంబ సభ్యులే స్పష్టంచేశారన్నారు. దీనిపై శనివారంలోగా విచారణ పూర్తి చేసి నివేదిక వెల్లడిస్తామన్నారు. ప్రభుత్వాస్పత్రుల సిబ్బందితో సోమవారం సమావేశం నిర్వహించి రోగులతో మాట్లాడే తీరు, వైద్య సేవలు, వ్యవహార శైలి వంటి అంశాలపై అవగాహన కల్పిస్తామన్నారు.