గాంధీలో గవర్నర్ కాలికి సర్జరీ
గాంధీలో గవర్నర్ కాలికి సర్జరీ
Published Tue, Sep 5 2017 2:40 AM | Last Updated on Tue, Aug 21 2018 11:41 AM
పాదంలో ఆనె తొలగించిన వైద్యులు
హైదరాబాద్: కొంతకాలంగా కుడి పాదం నొప్పితో బాధపడుతున్న గవర్నర్ నరసింహన్‌కు సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో సోమవారం శస్త్రచికిత్స చేశారు. డిప్యూటీ సూపరింటెండెంట్ నర్సింహారావు నేతృత్వంలోని వైద్య బృందం 25 నిమిషాలపాటు సర్జరీ నిర్వహించి.. పాదంలో ఉన్న ఆనెను (వైద్య పరిభాషలో కార్న్ అంటారు) విజయవంతంగా తొలగించారు. అర్ధగంట పర్యవేక్షణలో ఉంచి డిశ్చార్జి చేశారు. తర్వాత గవర్నర్ నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లారు.
ఇన్‌పేషెంట్‌గా నమోదు...
కుడి పాదం నొప్పితో ఇబ్బంది పడుతున్న నరసింహన్ గత నెల 23న గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకు న్నారు. పాదంలో ఆనె ఉన్నట్టు గుర్తించిన వైద్యులు మైనర్ సర్జరీ చేసి తొలగించాలని గవర్నర్‌కు సూచించారు. మరు సటిరోజు ఆస్పత్రికి వచ్చిన ఆయన రక్త నమూనాలు ఇచ్చివెళ్లారు. సోమవారం మధ్యాహ్నం 12.15కు నరసింహన్ గాంధీకి రాగా.. డీఎంఈ రమేశ్‌రెడ్డి, శ్రవణ్‌కుమార్ ఆయన్ను ఆపరేషన్ థియేటర్‌కు తీసుకువెళ్లారు. అప్పటికే గవర్నర్ ఇన్‌పేషెంట్‌గా చేరినట్లు కేస్‌షీట్ సిద్ధం చేశారు. బీపీ, షుగర్ లెవల్స్ పరీక్షించిన తర్వాత నర్సింహారావు, జనరల్ సర్జన్ ఎన్‌వీఎన్‌రెడ్డి, ప్లాస్టిక్ సర్జరీ, కార్డియాలజీ, జనరల్ మెడిసిన్ హెచ్‌ఓడీలు సుబోధ్‌కుమార్, నితిన్‌కాబ్రా, రాజారావుల బృందం సర్జరీ పూర్తి చేసింది
సతీమణికి ఫోను: వార్డుకు తరలించిన తర్వాత గవర్నర్ తన సతీమణి విమలానరసింహన్‌కు ఫోన్ చేసి ఆపరేషన్ సక్సెస్ అంటూ సంతోషం వ్యక్తంచేశారు. లోకల్ అనస్థీషి యా ఇవ్వడంతో తనకు నొప్పి తెలియలేదని, వైద్యులు చక్కగా శస్త్రచికిత్స పూర్తి చేశారంటూ వివరించారు.
10 రోజులు విశ్రాంతి..: సర్జరీ అనంతరం గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ శ్రవణ్‌కుమార్ మీడియాతో మాట్లాడారు. గవర్నర్‌కు 10 రోజులు విశ్రాంతి అవసరమని చెప్పారు. 3 రోజుల తర్వాత నడ వొచ్చని తెలిపారు. రోజూ వైద్య బృందాన్ని రాజ్‌భవన్‌కు పంపి డ్రెస్సింగ్ చేయిస్తామన్నారు. గాంధీ వైద్యుల పనితీరుపై గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేశారన్నారు.
Advertisement
Advertisement