గాంధీ ఆస్పత్రి: కరోనా వైరస్ విజృంభణతో కోవిడ్ నోడల్ కేంద్రమైన గాంధీ ఆస్పత్రి అత్యవసర విభాగంలో బాధితుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఐసీయూలో ఉండే రోగుల సంఖ్య శనివారం నాటికి 500కు చేరుకుంది. వీరంతా ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు వైద్య వర్గాలు ధ్రువీకరించాయి. గాంధీ ఆస్పత్రిలో ప్రస్తుతం 850 మంది కరోనా బాధితులకు వైద్యసేవలు అందిస్తుండగా, వీరిలో కరోనాతోపాటు వివిధ రుగ్మతలకు గురై ప్రాణాపాయస్థితిలో ఉన్న సుమారు 500 మందిని ఐసీయూలకు తరలించి వెంటిలేటర్లపై ఉంచి చికిత్స అందిస్తున్నారు. కిడ్నీ, లివర్, ఆస్తమా, షుగర్, బీపీ, గుండె సంబంధ వ్యాధులతో బాధపడుతున్న వారిలో కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉంటుందని, అందుకే వీరిని ఐసీయూలో ఉంచి వైద్యసేవలు అందిస్తున్నామని ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు వెల్లడించారు.
ఆస్పత్రిలో పడకలు, వెంటిలేటర్ల కొరత లేదని ఆయన స్పష్టం చేశారు. క్రిటికల్ పొజిషన్‌లో ఉన్నవారు కూడా కోలుకుని డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని, బాధితుల ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు, సిబ్బంది శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని తెలిపారు. ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం గాంధీ ఆస్పత్రిలో ఇప్పటివరకు తొమ్మిది మందికి ప్లాస్మాథెరపీ చికిత్సలు అందించామని, వందశాతం సక్సెస్ సాధించామన్నారు. ప్లాస్మా చికిత్సతో కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులైన ఐదుగురిని డిశ్చార్జ్ చేశామని, మరో నలుగురు కోలుకుంటున్నారని, వారిని రెండురోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని వివరించారు. మరో ఐదుగురికి ప్లాస్మాథెరపీ చికిత్సలు అందించేందుకు అవసరమైన ప్లాస్మాకణాలు గాంధీ బ్లడ్‌బ్యాంకులో అందుబాటులో ఉన్నాయని, ఐసీఎంఆర్ ఆదేశాల మేరకు వాటిని వినియోగిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment