![Hyderabad Osmania Doctors Struck Himachal Floods Updates - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/11/harish-rao-Missing-Osmania-.jpg.webp?itok=EFHJ1kDA)
సాక్షి, హైదరాబాద్: వాతావరణంలో నెలకొన్న అనూహ్య పరిణామాలతో ఉత్తర భారతాన్ని ఎడతెరిపి ఇవ్వని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎటు చూసినా వరద పోటెత్తిన దృశ్యాలు.. మనుషులు, వాహనాలు, భవనాలు కొట్టుకుపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాల ధాటికి 72 మంది మృతిచెందగా.. 10 మంది అదృశ్యమయ్యారు. ఈ క్రమంలో హైదరాబాద్ ఉస్మానియాకు చెందిన ముగ్గురు వైద్యులు హిమాచల్ ప్రదేశ్ వరదల్లో చిక్కుకున్నట్లు సమాచారం.
హిమాచల్ ప్రదేశ్ వరదల్లో ఉస్మానియాకు చెందిన డాక్టర్ బానోత్ కమల్‌లాల్, డాక్టర్ రోహిత్ సూరి, డాక్టర్ శ్రీనివాస్‌లు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురి ఫోన్లు స్విచ్చాఫ్ కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిణామానికి చెందిన మరింత సమాచారం అందాల్సి ఉంది. మరోవైపు హైదరాబాద్‌కు చెందిన ఓ ఫ్యామిలీ సైతం ఉత్తరాది భీకర వర్షాల్లో చిక్కుకుపోగా.. ఆదివారం నుంచి కుటుంబ సభ్యులతో సంబంధాలు తెగిపోయాయి. అయితే.. చివరికి వాళ్లు సురక్షితంగా నగరానికి తిరుగు పయనమైనట్లు తేలింది.
మంత్రి హరీష్ ఆరా
ఢిల్లీ పర్యటనలో భాగంగా.. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ తో మంత్రి హరీష్ రావు భేటీ కానున్నారు. కృష్ణా నది ట్రిబ్యునల్, నీటి ప్రాజెక్టుల అంశాలపై కేంద్రమంత్రితో చర్చించనున్నారాయన. అదే సమయంలో.. హిమాచల్ వరదల్లో ఉస్మానియా వైద్యులు చిక్కుకుపోయిన పరిణామంపై వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఆరా తీశారు. వైద్యులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారాయన.
ఇదీ చదవండి: హిమాన్షు పెద్ద మనసు.. కోటి రూపాయలతో..
Comments
Please login to add a commentAdd a comment