చిన్నారి కంటిపై దిగిన చువ్వ తొలగింపు
విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించిన ఉస్మానియా వైద్యులు
హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు మరో అరుదైన ఆపరేషన్ చేశారు. పాతబస్తీ జహనుమా ప్రాంతానికి చెందిన పన్నెండేళ్ల చిన్నారి మహ్మద్ బాబా ఖురేషి కంటి భాగంలో ప్రమాదవశాత్తు గుచ్చుకున్న ఇనుప చువ్వను విజయవంతంగా బయటకు తీశారు. ఈ నెల 6న వారి మటన్ దుకాణంలో ఆడుకొంటుండగా మాంసాన్ని వేలాడదీసే పొడవాటి ఇనుప చువ్వ బాబా ఎడమవైపు కంటి పై భాగంలోకి దిగింది. తల భాగంలో మెదడుకు దగ్గరగా చొచ్చుకుపోయింది. వెంటనే అతడిని ఉస్మానియా ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి శస్త్రచికిత్సకు ఉపక్రమించారు.
న్యూరో సర్జరీ విభాగాధిపతి డాక్టర్ ప్రేమ్‌జిత్‌రాయ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వేణుగోపాల్ ఈ నెల 7న బాబాకు విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. మెదడుకు ఎటువంటి ప్రమాదం జరగకుండా ఇనుప చువ్వను బయటకు తీశారు. చిన్నారి కోలుకోవడంతో శుక్రవారం డిశ్చార్జి చేశారు. బాబా పరిస్థితి మెరుగ్గా ఉందని, ఆందోళన చెందాల్సిన పనిలేదని వైద్యులు తెలిపారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో దాదాపు లక్ష రూపాయల వరకు ఖర్చయ్యే ఆపరేషన్‌ను ఉస్మానియాలో ఉచితంగా చేశామన్నారు.