ఎంసెట్‌ స్కాంలో మోస్ట్‌ వాంటెడ్‌ మృతి | EAMCET Scam Most Wanted is dead | Sakshi
Sakshi News home page

ఎంసెట్‌ స్కాంలో మోస్ట్‌ వాంటెడ్‌ మృతి

Published Thu, Jan 5 2017 1:52 AM | Last Updated on Sat, Aug 11 2018 8:21 PM

ఎంసెట్‌ స్కాంలో మోస్ట్‌ వాంటెడ్‌ మృతి - Sakshi

ఎంసెట్‌ స్కాంలో మోస్ట్‌ వాంటెడ్‌ మృతి

నాలుగు రోజుల క్రితం కమిలేశ్వర్‌ను అదుపులోకి తీసుకున్న సీఐడీ
కస్టడీలో ఉండగా పరిస్థితి విషమించడంతో ఉస్మానియాలో చికిత్స
గుండెపోటుతో మృతి చెందాడంటున్న సీఐడీ అధికారులు
బయటకు పొక్కకుండా ఉస్మానియాలో పోస్టుమార్టం పూర్తి
4 రాష్ట్రాల్లో పలు ప్రశ్నపత్రాల లీకేజీలో కమిలేశ్వర్‌ ప్రధాన నిందితుడు


సాక్షి, హైదరాబాద్‌: ఎంసెట్‌ 2 ప్రశ్నపత్రం లీకేజీ కేసులో మోస్ట్‌ వాంటెడ్‌గా ఉన్న వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం సంచలనం సృష్టించింది. బిహార్‌ రాజధాని పట్నాకు చెందిన కమిలేశ్వర్‌సింగ్‌ ఉస్మానియా ఆస్పత్రిలో రెండు రోజులుగా చికిత్స పొందుతూ మృతి చెందినట్టు సీఐడీ వర్గాలు తెలిపాయి. కమిలేశ్వర్‌ అనుమానాస్పదంగా మృతిచెందాడని వార్తలు వినిపిస్తుండగా, సీఐడీ అధికారులు మాత్రం అతడు గుండెపోటుతో మరణించాడని చెప్తున్నారు. కాగా, కమిలేశ్వర్‌ మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో గుట్టుచప్పుడు కాకుండా పోస్టుమార్టం నిర్వహించడం అనుమానాలకు తావిస్తోంది. ఆర్డీవో నేతృత్వంలో పంచనామా పూర్తి చేసినట్టు పోలీస్‌ ఉన్నతాధికారులు ‘సాక్షి’కి తెలిపారు. నాలుగు నెలలుగా విచారణ సాగుతూ వస్తున్న ఎంసెట్‌ లీకేజీ కేసులో మోస్ట్‌ వాంటెడ్‌ నిందితుని మృతి పోలీసు శాఖలో కలకలం రేపింది.

బిహార్‌ నుంచి రాష్ట్రానికి..
బిహార్‌ రాజధాని పట్నాకు చెందిన ఇద్దరు ప్రధాన నిందితులను సీఐడీ నాలుగు రోజుల క్రితం అదుపులోకి తీసుకుంది. పట్నా కోర్టులో వారిని హాజరుపరిచి ట్రాన్సిట్‌ వారంట్‌పై రాష్ట్రానికి తీసుకొచ్చింది. సీఐడీ కోర్టులో ఇద్దరినీ ప్రవేశపెట్టిన అధికారులు కస్టడీ పిటిషన్‌పై అనుమతి తీసుకుని అదుపులోకి తీసుకున్నారు. కేసులో భాగంగా విచారిస్తున్న సమయంలో కమిలేశ్వర్‌ ఆరోగ్య పరిస్థితి విషమించిందని తెలిసింది. దీంతో సీఐడీ అధికారులు అతడిని ఉస్మానియా ఆస్పత్రిలో చేర్చారు. ఛాతీలో నొప్పి వస్తోందని పదే పదే చెప్పాడని, ఆ మేరకు మంగళ, బుధవారాల్లో అతనికి చికిత్స అందించినట్టు ఉస్మానియా వైద్యులు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం గుండెపోటు రావడంతో కమిలేశ్వర్‌ మృతి చెందినట్టు సీఐడీ వర్గాలు తెలిపాయి. మృతిచెందిన కమిలేశ్వర్‌ పట్నాలో అడ్వొకేట్‌గా పనిచేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.

బయటకు పొక్కకుండా..
ఎంసెట్‌ ప్రశ్నపత్రం స్కాంలో కీలక నిందితుడిగా ఉన్న కమిలేశ్వర్‌ వ్యవహారంలో సీఐడీ అధికారులు నాలుగు నెలలుగా ఏ విషయాన్ని బయటకు పొక్కనివ్వలేదు. అతడి ఆరోగ్యంపై ఆరా తీసినా ఏం కాలేదని, సాధారణమైన ఛాతీ నొప్పి సమస్యతో ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్చార్జి అయ్యాడని చెప్పుకొచ్చారు. తీరా ఉస్మానియా ఆస్పత్రి వర్గాలు కమిలేశ్వర్‌ మృతి చెందినట్టు చెప్పడంతో సీఐడీలో కలవరం మొదలైంది. కస్టడీలో ఉన్న వ్యక్తి మృతి చెందడం అనేక అనుమానాలకు తావిస్తోంది. కమిలేశ్వర్‌ ఆరోగ్య పరిస్థితి విషమిస్తున్న సమయంలోనూ సరైన వైద్యం అందించడంలో సీఐడీ ఉన్నతాధికారులు విఫలమయ్యారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అనుమానాస్పద మృతి ఎంసెట్‌ స్కాం దర్యాప్తు చేస్తున్న అధికారుల మెడకు చుట్టుకునే అవకాశం ఉందని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

 ఒక లీక్‌.. 50 మంది బ్రోకర్లు..
ఎంసెట్‌ 2 ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో ఇప్పటివరకు సీఐడీ అధికారులు 50 మంది బ్రోకర్లను అరెస్ట్‌ చేసినట్టు ఉన్నతాధికారులు తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి 22 మంది బ్రోకర్లున్నారని, మిగతా అంతా కోల్‌కతా, బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, కర్ణాటకకు చెందిన బ్రోకర్లని అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో అరెస్టయిన వారిలో ఇద్దరు ఎంబీబీఎస్‌ డాక్టర్లతో పాటు 40 ఏళ్ల గృహిణి కూడా ఉండటం గమనార్హం.

నాలుగు రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటెడ్‌..
సీఐడీ కస్టడీలో చికిత్స పొందుతూ మృతిచెందిన కమిలేశ్వర్‌ నాలుగు రాష్ట్రాల పోలీసులకు మోస్ట్‌ వాంటెడ్‌ అని సీఐడీ వర్గాలు తెలిపాయి. మెడికల్‌ ప్రశ్నపత్రాల లీకేజీలో కమిలేశ్వర్‌ ఆరితేరాడని, కర్ణాటక, బిహార్, ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌లోని పలు పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల లీక్‌ కేసుల్లో కీలక నిందితుడిగా ఉన్నాడని అధికారుల ద్వారా తెలిసింది. ప్రతీ రాష్ట్రంలో మెడికల్, ఇతరత్రా కీలక ఎంట్రన్స్‌ పరీక్షల సమయంలో తన మనుషులను వర్సిటీలు, ప్రశ్నపత్రాలు ప్రింటింగ్‌ చేసే ప్రెస్‌లో దింపుతాడని.. వారి ద్వారా ప్రశ్నపత్రం లీక్‌ చేయడం, విద్యార్థులకు ఎరవేసి భారీగా డబ్బులు వసూలు చేసేవాడని సీఐడీ దర్యాప్తులో వెలుగులోకి వచ్చినట్టు తెలిసింది. ప్రస్తుతం సీఐడీ చేస్తున్న దర్యాప్తులో 210 మంది విద్యార్థులకు నిందితులు మొత్తం ప్రశ్నపత్రం లీక్‌ చేసినట్టు ఆధారాలు దొరికాయని అధికారులు తెలిపారు.

అన్నీ నిబంధనల ప్రకారమే: సీఐడీ ఐజీ
ఎంసెట్‌ స్కాంలో కీలకంగా వ్యవహరించిన కమిలేశ్వర్‌ను కష్టపడి తమ అధికారులు పట్టుకున్నారని సీఐడీ ఐజీ సౌమ్యామిశ్రా తెలిపారు. నాలుగు నెలల నుంచి తప్పించుకుని తిరుగుతున్న అతడిని పట్టుకుని అక్కడి కోర్టులో ప్రవేశపెట్టామని, ట్రాన్సిట్‌ వారెంట్‌పై తీసుకువచ్చామని చెప్పారు. సీఐడీ కోర్టులో కస్టడీ పిటిషన్‌ వేసి విచారిస్తున్న తరుణంలో కమిలేశ్వర్‌ ఆరోగ్యం విషమించిందని, గుండెపోటు వల్లే అతను మృతిచెందాడని ఉస్మానియా వైద్యులు తెలిపారని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement