EAMCET Scam
-
ఎంసెట్ స్కాంలో ఎట్టకేలకు చార్జిషీట్
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలతోపాటు జాతీయ స్థాయిలో కలకలం రేపిన ఎంసెట్ (మెడికల్) స్కాంలో సీఐడీ పోలీసులు ఎట్టకేలకు చార్జిషీట్ దాఖలు చేశారు. 2016 జూలైలో లీకేజీ ఉదంతం వెలుగుచూడగా 2019 జూలై అంటే నాలుగేళ్ల విచారణ అనంతరం చార్జిషీట్ దాఖలైంది. 90 మంది నిందితులుగా ఉన్న ఈ కేసులో దర్యాప్తు జరుగుతుం డగానే ఇద్దరు మరణించగా ఇప్పటిదాకా 67 మంది అరెస్టయ్యారు. వరంగల్ నుంచి మొదలైన సీఐడీ దర్యాప్తు ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా, ముంబై, కటక్ తదితర ప్రాంతాలకు విస్తరించింది. పలుమార్లు విచారణాధికారులు మారడం, కేసులో జేఎన్టీయూ, శ్రీచైతన్య కార్పొరేట్ కళాశాల డీన్‌కు ఉన్న సంబంధాలు వెలుగుచూడటంతో కేసు మలుపులు తిరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ చరిత్రలో ఒక కుంభకోణంలో చార్జిషీట్ దాఖలుకు ఇంత సుదీర్ఘ సమయం తీసుకున్న అరుదైన కేసుగా ఈ ఘటన నిలిచింది. తాజాగా చార్జిషీటు దాఖలుతో కోర్టులో వాదనలు మొదలు కానున్నాయి. ఢిల్లీ లింకుతో మొదలు.. వరుసగా రెండోసారి కూడా ఎంసెట్ (మెడికల్) పేపర్ లీకైందన్న విషయం కలకలం రేపడంతో దర్యాప్తు చేసిన నాటి డీఎస్పీ బాలు జాదవ్, కానిస్టేబుల్ సదాశివరావు, మరో ఇన్స్పెక్టర్ నిందితుల నుంచి లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో వారిని సస్పెండ్ చేశారు. దర్యాప్తు తీరుపై విమర్శలు రావడంతో కేసును సీఐడీకి బదిలీ చేశా రు. కేసు దర్యాప్తు చేపట్టిన సీఐడీ.. ఢిల్లీలోని జేఎన్టీ యూ ప్రింటింగ్ ప్రెస్ నుంచే పేపర్ లీకైన విషయా న్ని గుర్తించింది. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చెందిన శివబహదూర్ సింగ్ అలియాస్ ఎస్బీసింగ్ను సూత్రధారిగా తేల్చింది. ప్రశ్నపత్రాన్ని ఎస్బీ సింగ్ తన మనుషుల ద్వారా బయటకు తెప్పించాడని గుర్తించింది. ఈ కేసులో 62 మంది బ్రోకర్లు సహా మొత్తం 90 మందిని నిందితులుగా పేర్కొంది. స్థానికంగా ఎడ్యుకేషన్ కన్సల్టెంట్లు గుమ్మడి వెంకటేశ్, ఇక్బాల్‌లు విద్యార్థులకు లీక్ చేసిన పేపర్లను చేరవేసినట్లు దర్యాప్తులో తేలింది. వారితోపాటు శ్రీచైతన్య కాలేజీ డీన్ వాసుబాబు (ఏ–89), మరో ఏజెంట్ శివనారాయణరావు(ఏ–90)లతో కలిపి 90 మంది నిందితులుగా ఉన్నారు. నిందితుల్లో కమిలేశ్ కుమార్ సింగ్ (55), రావత్ (43)లు మరణించారు. పకడ్బందీగా చార్జిషీటు.. ఈ కేసు దర్యాప్తులో పోలీసులకు చాలా సవాళ్లు ఎదురయ్యాయి. వివిధ రాష్ట్రాలకు విస్తరించిన ఈ కేసులో ఆధారాలు, సాక్ష్యాల సేకరణ క్లిష్టంగా మారింది. ఎస్బీ సింగ్‌ను 2017లో సీఐడీ పోలీసులు అరెస్టు చేసినా తగినన్ని సాక్షాలు లేక చార్జిషీట్ దాఖలు ఆలస్యమైంది. ఉన్నతాధికారులు, రాజకీయ నాయకుల ఒత్తిళ్లు తట్టుకొని చివరకు పోలీసులు నిందితులకు వ్యతిరేకంగా పకడ్బంది సాక్ష్యాలు సేకరించినట్లు సమాచారం. కేసులో 90 మంది నిందితులు, 400 మందికిపైగా తల్లిదండ్రులు, విద్యార్థులు, వారికి సహకరించిన వారు సాక్షులుగా ఉన్నారు. -
తెలంగాణ ఎంసెట్ స్కాం: సీఐడీ విచారణ
-
‘ఎంసెట్’ దర్యాప్తు ఇంకెన్నాళ్లో?
సాక్షి, హైదరాబాద్: ఒక్క కేసు.. 80 మందికి పైగా నిందితులు.. నలుగురికి పైగా మారిన దర్యాప్తు అధికారులు.. అయినా క్లారిటీ లేని ఎంసెట్ కుంభకోణం దర్యాప్తు. అసలు ఎంసెట్ ప్రశ్నాపత్రం లీకేజీ దర్యాప్తులో ఏం జరుగుతుందో ఎవరికీ అంతుపట్టని స్థితి. సీఐడీ అధికారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న పరిస్థితి. 2016లో ప్రశ్నపత్రం లీకేజీ జరిగితే ఇంకా దర్యాప్తు దశలోనే కేసు నడుస్తుండటం అధికారులను ఒత్తిడికి గురిచేస్తోంటే.. మరోవైపు అసలు నిందితులు ఎంత మంది అన్నది అంతుచిక్కని వ్యవహారంగా మారింది. ఇప్పటివరకు 80 మంది నిందితులు అనుకుంటే మరో 40 మంది వెలుగులోకి రావడం వారిని కలవరపెడుతోంది. ఇంత మంది ఇన్నాళ్లు ఎక్కడున్నారు? వీరిని కావాలనే గుర్తించలేదా? తెలియక పట్టుకోలేదా? అన్న అనుమానం వేధిస్తోంది. దర్యాప్తు అధికారులపై సందేహం కేసు మొదలైనప్పటి నుంచి నలుగురు దర్యాప్తు అధికారులు మారుతూ వచ్చారు. ఒక దశలో ఓ డీఎస్పీ బ్రోకర్ నుంచి లంచం డిమాండ్ చేసి సస్పెండ్ అయ్యారు. తర్వాత దర్యాప్తు బాధ్యతలు ఎస్పీ స్థాయి వరకు వెళ్లాయి. కానీ తాజా దర్యాప్తులో కొంత మంది పోలీస్ అధికారుల పాత్రపై ఉన్నతాధికారులకు అనుమానం కలుగుతున్నట్లు తెలిసింది. గత దర్యాప్తు సమయంలో కీలక నిందితులతో సంబంధాలున్న వారిని అరెస్టు చేయకపోవడంతో.. వారితో సంబంధాలున్నాయా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే అరెస్టయిన బిహార్‌కు చెందిన కొరియర్ అఖిలేష్ వ్యవహారంతో ఈ లింకులపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఎంసెట్ కుంభకోణంలో ప్రభుత్వం వైపు నుంచి కూడా సీఐడీ అధికారులపై ఒత్తిడి పెరుగుతోంది. రెండేళ్లు గడుస్తున్నా చార్జిషీట్ దాఖలులో అలసత్వంపై సర్కారు గుర్రుగా ఉన్నట్టు సీఐడీ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన అనుమానాల నేపథ్యంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను ఉపేక్షించేది లేదని, నిందితులతో ములాఖత్ అయినట్లు రుజువైతే సస్పెన్షన్ వేటు తప్పదని పోలీస్ శాఖ పేర్కొంది. -
నత్తలా నడుస్తూనే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రెండు కుంభకోణాల కేసులు ఇంకా ‘నానుతూనే’ఉన్నాయి. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడి ఏడాదిన్నర గడిచినా చార్జిషీటు దాఖలుకాని ఎంసెట్ కేసు ఒకటికాగా.. రాష్ట్ర ఖజానాకు వందల కోట్లు కన్నం వేసిన బోధన వాణిజ్య పన్నుల కుంభకోణం మరొకటి. రెండు కేసులూ సీఐడీ చేతుల్లో ఉన్నా.. దర్యాప్తు మాత్రం ‘సాగుతూనే’ఉంది. కేవలం నోటీసులు, లేఖలు, ప్రశ్నించడాలతోనే సరిపోతోంది. ఈ నాన్చివేత ధోరణిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ‘ఎంసెట్’పై కొత్త సందేహాలు? 2016 ఆగస్టులో ఎంసెట్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. కేసు విచారణ ప్రారంభించిన మొదట్లో సీఐడీ చురుగ్గా వ్యవహరించినట్లు కనిపించింది. 68 మంది బ్రోకర్లు, 16 మంది సూత్రధారులను పట్టుకోగలిగింది. అయితే ఓ కీలక సూత్రధారి కస్టడీలో మృతిచెందగా, ప్రశ్నపత్రం లీక్ చేసిన వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఇక ఈ కేసులో ఇప్పటివరకు చార్జిషీట్ దాఖలు చేయలేదు. డ్రాఫ్ట్ చార్జిషీట్ సిద్ధం చేసి నాలుగు నెలలు గడిచింది. ఇది అటు కోర్టుకు వెళ్లక, ఇటు తుది దశకు చేరక సందిగ్ధ పరిస్థితి నెలకొంది. దీనిపై సీఐడీ అధికారులను వివరణ కోరగా... జేఎన్టీయూకు లేఖలు రాశామని, ప్రశ్నపత్రం తయారీ కమిటీ, ఆ కమిటీ మినిట్స్ తదితర సమాచారం కావాలని కోరామని చెబుతోంది. అంటే దర్యాప్తు దాదాపు పూర్తయి డ్రాఫ్ట్ చార్జిషీట్ సిద్ధమయ్యాక మళ్లీ విచారణ యూటర్న్ తీసుకోవడం, జేఎన్టీయూ అధికారులపై అనుమానాలు లేవంటూనే మళ్లీ నోటీసులిచ్చి మినిట్స్ కావాలనడంపై సందేహాలు తలెత్తుతున్నాయి. చార్జిషీట్ రూపొందించడానికి ముందే ఈ నోటీసులు ఎందుకు జారీచేయలేదు. అప్పుడే ఈ కోణంలో ఎందుకు విచారణ సాగించలేదన్న ప్రశ్నలు వస్తున్నాయి. వందల కోట్లు గండికొట్టినా చర్యల్లేవు.. రాష్ట్ర ఖజానాకు రూ.450 కోట్లకుపైగా కుచ్చుటోపీ పెట్టిన బోధన్ కమర్షియల్ ట్యాక్స్ కుంభకోణం వ్యవహారం సీఐడీ మెడకు చుట్టుకునేలా కనిపిస్తోంది. ఈ ఏడాది జనవరి చివరలో కేసు నమోదు చేసిన సీఐడీ.. పాత్రధారులుగా ఉన్న 8 మంది అధికారులను, ఇద్దరు సూత్రధారులను అరెస్టు చేసింది. కానీ ఈ కుంభకోణంలో లబ్ధిపొందిన డిస్టిబ్యూటర్లు, ఏజెన్సీలు, ఇతర వ్యక్తులవైపు సీఐడీ కన్నెత్తి చూడకపోవడం సందేహాలను లేవనెత్తింది. రాజకీయ నేతల ఒత్తిళ్ల కారణంగానే జాప్యం జరుగుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నకిలీ చలానాలను ట్రెజరీ కార్యాలయాలకు పంపి వెరిఫికేషన్ చేయిస్తున్నామని సీఐడీ అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి మేలోనే 5,540 నకిలీ చలాన్లు గుర్తించామని, వాటిని చెక్ చేసేందుకు సీఐడీ బృందం సబ్ ట్రెజరీ కార్యాలయాలకు వెళ్లిందని గతంలోనే ఉన్నతాధికారులు తెలిపారు. కొందరు అధికారులపై విచారణకు ఆ శాఖ ఉన్నతాధికారులు అడ్డుపడ్డారని సీఐడీ ఆరోపించింది. కానీ తర్వాత వారి నుంచి క్లియరెన్స్ వచ్చినా... చర్యలు చేపట్టడంలో ఎందుకు అలసత్వం వహిస్తున్నారన్నది అనుమానాస్పదంగా మారింది. ఇందిరమ్మ కేసు మూసేసినట్లే! ఇందిరమ్మ ఇళ్ల కేసును మూసివేసేందుకు సీఐడీ రంగం సిద్ధం చేసినట్టు తెలిసింది. లబ్ధి దారులు సబ్సిడీ పొందిన సమయం, ఇళ్లు నిర్మించిన సమయం తదితర సరిగా వివరాలు దొరకడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. వివరాలు దొరికినా సరైన తేదీల్లోనే లబ్ధిదారులకు చేరినట్టు కొన్నిచోట్ల వెల్లడికావటంతో బలమైన ఆధారాలు లేవని అభిప్రాయపడుతున్నారు. దీంతో కేసును మూసివేయడమే మేలని సీఐడీ ప్రభుత్వానికి సంకేతాలు పంపింది. ఈ కేసులో సీఐడీకి ముందుకెళ్లే అవకాశం లేదని సీఐడీ ఉన్నతా«ధికారి ఒకరు వెల్లడించారు. కొత్త డీజీపీకి సవాలే.. ఎంసెట్, బోధన్ కుంభకోణాల్లో చార్జిషీట్ల దాఖలు పెండింగ్‌లో ఉంది. ఈ కేసులు కొత్త డీజీపీ మహేందర్‌రెడ్డికి సవాలుగా నిలవనున్నాయి. ఈ కేసులపై ఎలా ముందుకెళ్తారు? చార్జిషీట్ల నమోదు సమస్యలను ఎలా పరిష్కరిస్తారన్న దానిపై అధికారుల్లో చర్చ జరుగుతోంది. -
ఆ తల్లిదండ్రులపైనా చార్జిషీట్!
ఎంసెట్ స్కాంలో పాత్రధారులపై సీఐడీ తకరారు.. - పేరెంట్స్‌ను నిందితుల జాబితాలో చేర్చడంపై సందిగ్ధం - నేరుగా పాలుపంచుకున్న వారిపై చర్యలు..? - ప్రభుత్వానిదే తుది నిర్ణయం: సీఐడీ సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ స్కాం.. దేశవ్యాప్తంగా నిందితులు.. 65 మందికి పైగా బ్రోకర్లు.. 15 మందికి పైగా విద్యార్థుల తల్లిదండ్రులు. ఈ స్కాంలో విద్యార్థుల తల్లిదండ్రులను నిందితులుగా చేర్చాలా, వద్దా అన్న అంశంపై సీఐడీ సందిగ్ధంలో పడింది. గతేడాది ఆగస్టులో ప్రారంభమైన ఎంసెట్ ప్రశ్నపత్రం లీక్ దర్యాప్తు పదిహేను రోజుల కిందట పూర్తయింది. బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర.. ఇలా పలు రాష్ట్రాలకు చెందిన నిందితులను సీఐడీ అరెస్టు చేసింది. కేసులో ప్రధాన నిందితుడైన కమిలేశ్ కుమార్ సింగ్ సీఐడీ కస్టడీలో గుండెపోటుతో మృతి చెందాడు. ప్రింటింగ్ ప్రెస్ నుంచి ప్రశ్నపత్రం బయటకు ఇచ్చిన రావత్ కూడా అనారోగ్యంతో పోలీసుల అరెస్ట్‌కు ముందే మృత్యువాత పడ్డాడు. ఇక మిగిలిన కీలక నిందితులతో కలిపి మొత్తం ఇప్పటివరకు 65 మందిని సీఐడీ అరెస్ట్ చేసింది. వారి విషయంలో స్పష్టత కావాలి ఈ కుంభకోణంలో బ్రోకర్ల అరెస్ట్ వరకు అంతా బాగానే ఉంది. కానీ బ్రోకర్లతో కలిసిపోయి తమ పిల్లలకే కాకుండా మరికొంత మంది పిల్లలకు ప్రశ్నపత్రం లీక్ చేసిన తల్లిదండ్రులను పాత్రదారులు చేయాలా, వద్దా అన్న అంశంపై సీఐడీ అధికారులు సందిగ్ధంలో పడ్డారు. ప్రశ్నపత్రాలపై శిక్షణ తీసుకొని అక్రమంగా ర్యాంకులు పొందిన విద్యార్థులను సాక్షులుగా మార్చుకున్న సీఐడీ.. వారి తల్లిదండ్రులను నిందితులుగా గుర్తించేందుకు కసరత్తు చేసింది. మొత్తం 125 మంది విద్యార్థులు అక్రమ ర్యాంకులు పొందగా.. వీరిలో 15 మంది విద్యార్థుల తల్లిదండ్రులు బ్రోకర్లుగా తేలారు. వీరినీ నిందితుల జాబితాలో చేర్చాలని సీఐడీ భావిస్తోంది. అయితే దీనికి ప్రభుత్వం ఒప్పుకుంటుందా, లేదా అనే అంశంపై సీఐడీ ఓ నిర్ణయానికి రాలేకపోతోంది. ఒకవేళ వారిని సాక్షులుగా మార్చుకుంటే నిందితుల వైపు నుంచి కేసును నీరుగార్చేందుకు అవకాశం లభిస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. బ్రోకర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు కలసి ఇతర విద్యార్థుల నుంచి రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు వసూలు చేసినట్టు సీఐడీ ఆధారాలు సేకరించింది. ఇలాంటి సందర్భంలో సంబంధిత తల్లిదండ్రులను చార్జిషీట్లో పేర్కొనాల్సి ఉంటుందని ఓ సీఐడీ ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ నిర్ణయమే శిరోధార్యం.. ఈ వ్యవహారంపై న్యాయ సలహా తీసుకోవడంతోపాటు ప్రభుత్వానికి కూడా సమాచారం ఇస్తున్నామని సీఐడీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ప్రకారం తాము ముందుకు వెళ్తామని, తల్లిదండ్రులు పాత్రదారులే కావడంతో ప్రభుత్వం వారిని నిందితులుగా పరిగణించమంటే అలానే చేయాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. -
ఎంసెట్ స్కాం దర్యాప్తు ఎటువైపు?
సాక్షి, హైదరాబాద్ : ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ కుంభకోణంలో తర్జనభర్జన కొనసా గుతోంది. దర్యాప్తు చేపట్టి ఏడు నెలలు కావస్తున్నా అసలు నిందితులు దొరకనేలేదు. ఇప్పటివరకు సీఐడీ అధికారులు 81 మంది బ్రోకర్లను అరెస్ట్ చేశారు. వారిలో చాలా మంది బెయిల్ కూడా పొందారు. ఇక ప్రశ్నపత్రం ప్రింటింగ్ వ్యవహారం, ప్రింటింగ్ ప్రెస్‌నుంచి ఎవరు లీక్ చేశారు, అక్కడి నుంచి కీలక బ్రోకర్లకు చేరవేసింది ఎవరన్న వివరాలు పూర్తిస్థాయిలో తెలియలేదు. అంతేగాకుండా ఈ మొత్తం వ్యవహారంలో కీలక నిందితుడిగా ఉన్న కమిలేష్‌కుమార్ సింగ్ ఇటీవలే సీఐడీ కస్టడీలో గుండెపోటుతో మృతిచెందాడు. దీంతో దర్యాప్తు అధికారులు ఆందోళనలో పడ్డారు. తెగిన లింకు? ప్రింటింగ్ ప్రెస్ నుంచి ప్రశ్నపత్రాన్ని బయటకు తీసుకువచ్చింది కమిలేష్‌కుమార్ సింగ్ అని సీఐడీ దర్యాప్తు అధికారులు అను మానించారు. కానీ ఈ అంశంపై విచా రిస్తున్న సమయంలోనే కమిలేష్ గుండె పోటుతో మృతి చెందాడు. దీంతో కేసులో ఎలా ముందుకు వెళ్లాలో అర్థంకావడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. అయితే కమిలేష్తో పాటు మరొకరు కీలక పాత్ర పోషించారని.. అతడి ద్వారా ప్రశ్నపత్రం ప్రింటింగ్ ప్రెస్ నుంచి బయ టకు వచ్చిందని సీఐడీ అధికారుల విచా రణలో వెల్లడైనట్టు తెలిసింది. ఈ నేపథ్యం లో ఆ నిందితుడు ఎవరు, ఎలా గుర్తించాలి, మిగతా బ్రోకర్లు ఎవరనే దానిపై దృష్టి పెట్టారు. ఇక ఢిల్లీ శివారులో ఉన్న సదరు ప్రింటింగ్ ప్రెస్ సిబ్బందిని సీఐడీ అధికారులు ఇప్పటికే నాలుగు సార్లు ప్రశ్నించారు. అయితే కమిలేష్ ఎవరో తమకు తెలియదని, అతడిని ఎప్పుడూ చూడలేదని వారు చెప్పడంతో ఎటూ తేలని పరిస్థితి నెలకొంది. కేసులో అంతే సంగతులా? ఈ కుంభకోణంలో గత ఏడు నెలల్లో ప్రధాన బ్రోకర్లు, బ్రోకర్లుగా మారిన తల్లిదండ్రులు, సాధారణ బ్రోకర్లు కలిపి 81 మందిని అరెస్టు చేసిన సీఐడీ... కీలక నిందితులను పట్టుకోవడంలో విఫలమైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కమిలేష్ మృతితో ఈ కేసులో అసలు నిందితులు దొరకడం కష్టమేనని, దానికి మరింత సమయం పట్టే అవకాశం ఉండటంతో... ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు అంశాలపై చార్జిషీట్లు దాఖలు చేయాలని సీఐడీ అధికారులు యోచిస్తున్నట్లు తెలిసింది. కీలక నిందితుల అరెస్టు తర్వాత అనుబంధ చార్జిషీట్లు దాఖలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. -
ఎంసెట్ స్కాంలో మోస్ట్ వాంటెడ్ మృతి
♦ నాలుగు రోజుల క్రితం కమిలేశ్వర్ను అదుపులోకి తీసుకున్న సీఐడీ ♦ కస్టడీలో ఉండగా పరిస్థితి విషమించడంతో ఉస్మానియాలో చికిత్స ♦ గుండెపోటుతో మృతి చెందాడంటున్న సీఐడీ అధికారులు ♦ బయటకు పొక్కకుండా ఉస్మానియాలో పోస్టుమార్టం పూర్తి ♦ 4 రాష్ట్రాల్లో పలు ప్రశ్నపత్రాల లీకేజీలో కమిలేశ్వర్ ప్రధాన నిందితుడు సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ 2 ప్రశ్నపత్రం లీకేజీ కేసులో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం సంచలనం సృష్టించింది. బిహార్ రాజధాని పట్నాకు చెందిన కమిలేశ్వర్సింగ్ ఉస్మానియా ఆస్పత్రిలో రెండు రోజులుగా చికిత్స పొందుతూ మృతి చెందినట్టు సీఐడీ వర్గాలు తెలిపాయి. కమిలేశ్వర్ అనుమానాస్పదంగా మృతిచెందాడని వార్తలు వినిపిస్తుండగా, సీఐడీ అధికారులు మాత్రం అతడు గుండెపోటుతో మరణించాడని చెప్తున్నారు. కాగా, కమిలేశ్వర్ మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో గుట్టుచప్పుడు కాకుండా పోస్టుమార్టం నిర్వహించడం అనుమానాలకు తావిస్తోంది. ఆర్డీవో నేతృత్వంలో పంచనామా పూర్తి చేసినట్టు పోలీస్ ఉన్నతాధికారులు ‘సాక్షి’కి తెలిపారు. నాలుగు నెలలుగా విచారణ సాగుతూ వస్తున్న ఎంసెట్ లీకేజీ కేసులో మోస్ట్ వాంటెడ్ నిందితుని మృతి పోలీసు శాఖలో కలకలం రేపింది. బిహార్ నుంచి రాష్ట్రానికి.. బిహార్ రాజధాని పట్నాకు చెందిన ఇద్దరు ప్రధాన నిందితులను సీఐడీ నాలుగు రోజుల క్రితం అదుపులోకి తీసుకుంది. పట్నా కోర్టులో వారిని హాజరుపరిచి ట్రాన్సిట్ వారంట్‌పై రాష్ట్రానికి తీసుకొచ్చింది. సీఐడీ కోర్టులో ఇద్దరినీ ప్రవేశపెట్టిన అధికారులు కస్టడీ పిటిషన్‌పై అనుమతి తీసుకుని అదుపులోకి తీసుకున్నారు. కేసులో భాగంగా విచారిస్తున్న సమయంలో కమిలేశ్వర్ ఆరోగ్య పరిస్థితి విషమించిందని తెలిసింది. దీంతో సీఐడీ అధికారులు అతడిని ఉస్మానియా ఆస్పత్రిలో చేర్చారు. ఛాతీలో నొప్పి వస్తోందని పదే పదే చెప్పాడని, ఆ మేరకు మంగళ, బుధవారాల్లో అతనికి చికిత్స అందించినట్టు ఉస్మానియా వైద్యులు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం గుండెపోటు రావడంతో కమిలేశ్వర్ మృతి చెందినట్టు సీఐడీ వర్గాలు తెలిపాయి. మృతిచెందిన కమిలేశ్వర్ పట్నాలో అడ్వొకేట్‌గా పనిచేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. బయటకు పొక్కకుండా.. ఎంసెట్ ప్రశ్నపత్రం స్కాంలో కీలక నిందితుడిగా ఉన్న కమిలేశ్వర్ వ్యవహారంలో సీఐడీ అధికారులు నాలుగు నెలలుగా ఏ విషయాన్ని బయటకు పొక్కనివ్వలేదు. అతడి ఆరోగ్యంపై ఆరా తీసినా ఏం కాలేదని, సాధారణమైన ఛాతీ నొప్పి సమస్యతో ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్చార్జి అయ్యాడని చెప్పుకొచ్చారు. తీరా ఉస్మానియా ఆస్పత్రి వర్గాలు కమిలేశ్వర్ మృతి చెందినట్టు చెప్పడంతో సీఐడీలో కలవరం మొదలైంది. కస్టడీలో ఉన్న వ్యక్తి మృతి చెందడం అనేక అనుమానాలకు తావిస్తోంది. కమిలేశ్వర్ ఆరోగ్య పరిస్థితి విషమిస్తున్న సమయంలోనూ సరైన వైద్యం అందించడంలో సీఐడీ ఉన్నతాధికారులు విఫలమయ్యారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అనుమానాస్పద మృతి ఎంసెట్ స్కాం దర్యాప్తు చేస్తున్న అధికారుల మెడకు చుట్టుకునే అవకాశం ఉందని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఒక లీక్.. 50 మంది బ్రోకర్లు.. ఎంసెట్ 2 ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో ఇప్పటివరకు సీఐడీ అధికారులు 50 మంది బ్రోకర్లను అరెస్ట్ చేసినట్టు ఉన్నతాధికారులు తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి 22 మంది బ్రోకర్లున్నారని, మిగతా అంతా కోల్‌కతా, బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, కర్ణాటకకు చెందిన బ్రోకర్లని అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో అరెస్టయిన వారిలో ఇద్దరు ఎంబీబీఎస్ డాక్టర్లతో పాటు 40 ఏళ్ల గృహిణి కూడా ఉండటం గమనార్హం. నాలుగు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్.. సీఐడీ కస్టడీలో చికిత్స పొందుతూ మృతిచెందిన కమిలేశ్వర్ నాలుగు రాష్ట్రాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్ అని సీఐడీ వర్గాలు తెలిపాయి. మెడికల్ ప్రశ్నపత్రాల లీకేజీలో కమిలేశ్వర్ ఆరితేరాడని, కర్ణాటక, బిహార్, ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌లోని పలు పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల లీక్ కేసుల్లో కీలక నిందితుడిగా ఉన్నాడని అధికారుల ద్వారా తెలిసింది. ప్రతీ రాష్ట్రంలో మెడికల్, ఇతరత్రా కీలక ఎంట్రన్స్ పరీక్షల సమయంలో తన మనుషులను వర్సిటీలు, ప్రశ్నపత్రాలు ప్రింటింగ్ చేసే ప్రెస్‌లో దింపుతాడని.. వారి ద్వారా ప్రశ్నపత్రం లీక్ చేయడం, విద్యార్థులకు ఎరవేసి భారీగా డబ్బులు వసూలు చేసేవాడని సీఐడీ దర్యాప్తులో వెలుగులోకి వచ్చినట్టు తెలిసింది. ప్రస్తుతం సీఐడీ చేస్తున్న దర్యాప్తులో 210 మంది విద్యార్థులకు నిందితులు మొత్తం ప్రశ్నపత్రం లీక్ చేసినట్టు ఆధారాలు దొరికాయని అధికారులు తెలిపారు. అన్నీ నిబంధనల ప్రకారమే: సీఐడీ ఐజీ ఎంసెట్ స్కాంలో కీలకంగా వ్యవహరించిన కమిలేశ్వర్ను కష్టపడి తమ అధికారులు పట్టుకున్నారని సీఐడీ ఐజీ సౌమ్యామిశ్రా తెలిపారు. నాలుగు నెలల నుంచి తప్పించుకుని తిరుగుతున్న అతడిని పట్టుకుని అక్కడి కోర్టులో ప్రవేశపెట్టామని, ట్రాన్సిట్ వారెంట్‌పై తీసుకువచ్చామని చెప్పారు. సీఐడీ కోర్టులో కస్టడీ పిటిషన్ వేసి విచారిస్తున్న తరుణంలో కమిలేశ్వర్ ఆరోగ్యం విషమించిందని, గుండెపోటు వల్లే అతను మృతిచెందాడని ఉస్మానియా వైద్యులు తెలిపారని స్పష్టం చేశారు. -
స్కాంపై సీబీఐ విచారణ జరపాలి