ఆ తల్లిదండ్రులపైనా చార్జిషీట్!
ఆ తల్లిదండ్రులపైనా చార్జిషీట్!
Published Mon, Jun 19 2017 3:22 AM | Last Updated on Sat, Aug 11 2018 8:21 PM
ఎంసెట్ స్కాంలో పాత్రధారులపై సీఐడీ తకరారు..
- పేరెంట్స్‌ను నిందితుల జాబితాలో చేర్చడంపై సందిగ్ధం
- నేరుగా పాలుపంచుకున్న వారిపై చర్యలు..?
- ప్రభుత్వానిదే తుది నిర్ణయం: సీఐడీ
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ స్కాం.. దేశవ్యాప్తంగా నిందితులు.. 65 మందికి పైగా బ్రోకర్లు.. 15 మందికి పైగా విద్యార్థుల తల్లిదండ్రులు. ఈ స్కాంలో విద్యార్థుల తల్లిదండ్రులను నిందితులుగా చేర్చాలా, వద్దా అన్న అంశంపై సీఐడీ సందిగ్ధంలో పడింది. గతేడాది ఆగస్టులో ప్రారంభమైన ఎంసెట్ ప్రశ్నపత్రం లీక్ దర్యాప్తు పదిహేను రోజుల కిందట పూర్తయింది. బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర.. ఇలా పలు రాష్ట్రాలకు చెందిన నిందితులను సీఐడీ అరెస్టు చేసింది. కేసులో ప్రధాన నిందితుడైన కమిలేశ్ కుమార్ సింగ్ సీఐడీ కస్టడీలో గుండెపోటుతో మృతి చెందాడు. ప్రింటింగ్ ప్రెస్ నుంచి ప్రశ్నపత్రం బయటకు ఇచ్చిన రావత్ కూడా అనారోగ్యంతో పోలీసుల అరెస్ట్‌కు ముందే మృత్యువాత పడ్డాడు. ఇక మిగిలిన కీలక నిందితులతో కలిపి మొత్తం ఇప్పటివరకు 65 మందిని సీఐడీ అరెస్ట్ చేసింది.
వారి విషయంలో స్పష్టత కావాలి
ఈ కుంభకోణంలో బ్రోకర్ల అరెస్ట్ వరకు అంతా బాగానే ఉంది. కానీ బ్రోకర్లతో కలిసిపోయి తమ పిల్లలకే కాకుండా మరికొంత మంది పిల్లలకు ప్రశ్నపత్రం లీక్ చేసిన తల్లిదండ్రులను పాత్రదారులు చేయాలా, వద్దా అన్న అంశంపై సీఐడీ అధికారులు సందిగ్ధంలో పడ్డారు. ప్రశ్నపత్రాలపై శిక్షణ తీసుకొని అక్రమంగా ర్యాంకులు పొందిన విద్యార్థులను సాక్షులుగా మార్చుకున్న సీఐడీ.. వారి తల్లిదండ్రులను నిందితులుగా గుర్తించేందుకు కసరత్తు చేసింది. మొత్తం 125 మంది విద్యార్థులు అక్రమ ర్యాంకులు పొందగా.. వీరిలో 15 మంది విద్యార్థుల తల్లిదండ్రులు బ్రోకర్లుగా తేలారు. వీరినీ నిందితుల జాబితాలో చేర్చాలని సీఐడీ భావిస్తోంది. అయితే దీనికి ప్రభుత్వం ఒప్పుకుంటుందా, లేదా అనే అంశంపై సీఐడీ ఓ నిర్ణయానికి రాలేకపోతోంది. ఒకవేళ వారిని సాక్షులుగా మార్చుకుంటే నిందితుల వైపు నుంచి కేసును నీరుగార్చేందుకు అవకాశం లభిస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. బ్రోకర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు కలసి ఇతర విద్యార్థుల నుంచి రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు వసూలు చేసినట్టు సీఐడీ ఆధారాలు సేకరించింది. ఇలాంటి సందర్భంలో సంబంధిత తల్లిదండ్రులను చార్జిషీట్‌లో పేర్కొనాల్సి ఉంటుందని ఓ సీఐడీ ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వ నిర్ణయమే శిరోధార్యం..
ఈ వ్యవహారంపై న్యాయ సలహా తీసుకోవడంతోపాటు ప్రభుత్వానికి కూడా సమాచారం ఇస్తున్నామని సీఐడీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ప్రకారం తాము ముందుకు వెళ్తామని, తల్లిదండ్రులు పాత్రదారులే కావడంతో ప్రభుత్వం వారిని నిందితులుగా పరిగణించమంటే అలానే చేయాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Advertisement
Advertisement