సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలతోపాటు జాతీయ స్థాయిలో కలకలం రేపిన ఎంసెట్ (మెడికల్) స్కాంలో సీఐడీ పోలీసులు ఎట్టకేలకు చార్జిషీట్ దాఖలు చేశారు. 2016 జూలైలో లీకేజీ ఉదంతం వెలుగుచూడగా 2019 జూలై అంటే నాలుగేళ్ల విచారణ అనంతరం చార్జిషీట్ దాఖలైంది. 90 మంది నిందితులుగా ఉన్న ఈ కేసులో దర్యాప్తు జరుగుతుం డగానే ఇద్దరు మరణించగా ఇప్పటిదాకా 67 మంది అరెస్టయ్యారు. వరంగల్ నుంచి మొదలైన సీఐడీ దర్యాప్తు ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా, ముంబై, కటక్ తదితర ప్రాంతాలకు విస్తరించింది. పలుమార్లు విచారణాధికారులు మారడం, కేసులో జేఎన్టీయూ, శ్రీచైతన్య కార్పొరేట్ కళాశాల డీన్‌కు ఉన్న సంబంధాలు వెలుగుచూడటంతో కేసు మలుపులు తిరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ చరిత్రలో ఒక కుంభకోణంలో చార్జిషీట్ దాఖలుకు ఇంత సుదీర్ఘ సమయం తీసుకున్న అరుదైన కేసుగా ఈ ఘటన నిలిచింది. తాజాగా చార్జిషీటు దాఖలుతో కోర్టులో వాదనలు మొదలు కానున్నాయి.
ఢిల్లీ లింకుతో మొదలు..
వరుసగా రెండోసారి కూడా ఎంసెట్ (మెడికల్) పేపర్ లీకైందన్న విషయం కలకలం రేపడంతో దర్యాప్తు చేసిన నాటి డీఎస్పీ బాలు జాదవ్, కానిస్టేబుల్ సదాశివరావు, మరో ఇన్‌స్పెక్టర్ నిందితుల నుంచి లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో వారిని సస్పెండ్ చేశారు. దర్యాప్తు తీరుపై విమర్శలు రావడంతో కేసును సీఐడీకి బదిలీ చేశా రు. కేసు దర్యాప్తు చేపట్టిన సీఐడీ.. ఢిల్లీలోని జేఎన్టీ యూ ప్రింటింగ్ ప్రెస్ నుంచే పేపర్ లీకైన విషయా న్ని గుర్తించింది. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చెందిన శివబహదూర్ సింగ్ అలియాస్ ఎస్బీసింగ్‌ను సూత్రధారిగా తేల్చింది.
ప్రశ్నపత్రాన్ని ఎస్బీ సింగ్ తన మనుషుల ద్వారా బయటకు తెప్పించాడని గుర్తించింది. ఈ కేసులో 62 మంది బ్రోకర్లు సహా మొత్తం 90 మందిని నిందితులుగా పేర్కొంది. స్థానికంగా ఎడ్యుకేషన్ కన్సల్టెంట్లు గుమ్మడి వెంకటేశ్, ఇక్బాల్‌లు విద్యార్థులకు లీక్ చేసిన పేపర్లను చేరవేసినట్లు దర్యాప్తులో తేలింది. వారితోపాటు శ్రీచైతన్య కాలేజీ డీన్ వాసుబాబు (ఏ–89), మరో ఏజెంట్ శివనారాయణరావు(ఏ–90)లతో కలిపి 90 మంది నిందితులుగా ఉన్నారు. నిందితుల్లో కమిలేశ్ కుమార్ సింగ్ (55), రావత్ (43)లు మరణించారు.
పకడ్బందీగా చార్జిషీటు..
ఈ కేసు దర్యాప్తులో పోలీసులకు చాలా సవాళ్లు ఎదురయ్యాయి. వివిధ రాష్ట్రాలకు విస్తరించిన ఈ కేసులో ఆధారాలు, సాక్ష్యాల సేకరణ క్లిష్టంగా మారింది. ఎస్బీ సింగ్‌ను 2017లో సీఐడీ పోలీసులు అరెస్టు చేసినా తగినన్ని సాక్షాలు లేక చార్జిషీట్ దాఖలు ఆలస్యమైంది. ఉన్నతాధికారులు, రాజకీయ నాయకుల ఒత్తిళ్లు తట్టుకొని చివరకు పోలీసులు నిందితులకు వ్యతిరేకంగా పకడ్బంది సాక్ష్యాలు సేకరించినట్లు సమాచారం. కేసులో 90 మంది నిందితులు, 400 మందికిపైగా తల్లిదండ్రులు, విద్యార్థులు, వారికి సహకరించిన వారు సాక్షులుగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment