సాక్షి, హైదరాబాద్: ఒక్క కేసు.. 80 మందికి పైగా నిందితులు.. నలుగురికి పైగా మారిన దర్యాప్తు అధికారులు.. అయినా క్లారిటీ లేని ఎంసెట్ కుంభకోణం దర్యాప్తు. అసలు ఎంసెట్ ప్రశ్నాపత్రం లీకేజీ దర్యాప్తులో ఏం జరుగుతుందో ఎవరికీ అంతుపట్టని స్థితి. సీఐడీ అధికారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న పరిస్థితి. 2016లో ప్రశ్నపత్రం లీకేజీ జరిగితే ఇంకా దర్యాప్తు దశలోనే కేసు నడుస్తుండటం అధికారులను ఒత్తిడికి గురిచేస్తోంటే.. మరోవైపు అసలు నిందితులు ఎంత మంది అన్నది అంతుచిక్కని వ్యవహారంగా మారింది. ఇప్పటివరకు 80 మంది నిందితులు అనుకుంటే మరో 40 మంది వెలుగులోకి రావడం వారిని కలవరపెడుతోంది. ఇంత మంది ఇన్నాళ్లు ఎక్కడున్నారు? వీరిని కావాలనే గుర్తించలేదా? తెలియక పట్టుకోలేదా? అన్న అనుమానం వేధిస్తోంది.
దర్యాప్తు అధికారులపై సందేహం
కేసు మొదలైనప్పటి నుంచి నలుగురు దర్యాప్తు అధికారులు మారుతూ వచ్చారు. ఒక దశలో ఓ డీఎస్పీ బ్రోకర్ నుంచి లంచం డిమాండ్ చేసి సస్పెండ్ అయ్యారు. తర్వాత దర్యాప్తు బాధ్యతలు ఎస్పీ స్థాయి వరకు వెళ్లాయి. కానీ తాజా దర్యాప్తులో కొంత మంది పోలీస్ అధికారుల పాత్రపై ఉన్నతాధికారులకు అనుమానం కలుగుతున్నట్లు తెలిసింది. గత దర్యాప్తు సమయంలో కీలక నిందితులతో సంబంధాలున్న వారిని అరెస్టు చేయకపోవడంతో.. వారితో సంబంధాలున్నాయా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇటీవలే అరెస్టయిన బిహార్‌కు చెందిన కొరియర్ అఖిలేష్ వ్యవహారంతో ఈ లింకులపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఎంసెట్ కుంభకోణంలో ప్రభుత్వం వైపు నుంచి కూడా సీఐడీ అధికారులపై ఒత్తిడి పెరుగుతోంది. రెండేళ్లు గడుస్తున్నా చార్జిషీట్ దాఖలులో అలసత్వంపై సర్కారు గుర్రుగా ఉన్నట్టు సీఐడీ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన అనుమానాల నేపథ్యంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను ఉపేక్షించేది లేదని, నిందితులతో ములాఖత్ అయినట్లు రుజువైతే సస్పెన్షన్ వేటు తప్పదని పోలీస్ శాఖ పేర్కొంది.
‘ఎంసెట్’ దర్యాప్తు ఇంకెన్నాళ్లో?
Published Tue, May 8 2018 1:26 AM | Last Updated on Tue, Aug 21 2018 7:26 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment