ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో ఎటువంటి అవకతవకలు జరిగినా సహించేది లేదని జీడీసీసీ బ్యాంక్ అధ్యక్షుడు ముమ్మనేని వెంకట సుబ్బయ్య హెచ్చరించారు.
►సహకార సంఘాలలో అవకతవకలను సహించం
►స్వాహా నిధులు వసూలు చేస్తాం
►రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తాం
►జీడీసీసీ బ్యాంక్ అధ్యక్షుడు
►ముమ్మనేని వెంకట సుబ్బయ్య
కొత్తపేట(గుంటూరు): ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో ఎటువంటి అవకతవకలు జరిగినా సహించేది లేదని జీడీసీసీ బ్యాంక్ అధ్యక్షుడు ముమ్మనేని వెంకట సుబ్బయ్య హెచ్చరించారు. అవినీతి పాల్పడుతున్న కార్యదర్శులను ఏరిపారేస్తామని చెప్పారు. బుధవారం స్థానిక బ్రాడీపేట 2వలైన్‌లోని బ్యాంకు ప్రధాన కార్యాలయంలో జరిగిన మహాజన సభ సమావేశంలో ఆయన సహకార సంఘ బ్యాంకులను ఉద్దేశించి మాట్లాడారు. కార్యక్రమానికి జిల్లాలోని 167 సహకార సంఘాల చైర్మన్లు, 17 మంది బోర్డు డెరైక్టర్లు హాజరయ్యారు. సమావేశంలో 104 వ వార్షిక బడ్జెట్ నివేదికలను ప్రవేశపెట్టారు.
సహకార సంఘాల నిధుల స్వాహా విషయాన్ని ఆయన ప్రస్తావించారు. మంగళగిరిలో రూ.50లక్షలు, దుగ్గిరాలలో రూ.50 లక్షలు, నరసరావుపేటలో రూ.20 లక్షలు, తాడేపల్లిలో కోటీ 6 లక్షలను కార్యదర్శులు గోల్‌మాల్ చేశారని చెప్పారు. వారిని విధుల నుంచి తొలగించామని వెల్లడించారు. కొంత మేరకు రికవరీ చేశామని తాడేపల్లిలో మాత్రం రికవరీలో జాప్యం జరుగుతోందని, త్వరలో వసూలు చేస్తామన్నారు. రైతుల సంక్షేమానికి సహకార సంఘం పెద్దపీట వేస్తూ వస్తోందని చెప్పారు. 2008లో కాగ్ నివేదికను అనుసరించి రుణాల మాఫీలో అవకతవకలకు పాల్పడిన కార్యదర్శులను, అధ్యక్షులను, రైతులను గుర్తించి రికవరీ చేస్తామన్నారు.
ప్రభుత్వ రుణమాఫీ ప్రకటనతో బ్యాంక్ తరఫున గత ఏడాది డిసెంబర్ 31 వరకు సుమారు కోటీ 40 లక్షల మంది లబ్ధిదారులకు రూ.740 కోట్లు వ్యవసాయ, బంగారు నగ లు, చేనేత, డ్వాక్రా రుణాలు మాఫీ జరగాలన్నారు. ఈ ఏడాది జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలల్లో రైతులు చెల్లించిన రుణాల మాఫీకి ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చిస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ గత ఏడాది డిసెంబర్ 31 వరకు తీసుకున్న రుణాలను మాత్రమే మాఫీ చేస్తుందని ప్రకటన చేసిందని, ఈ క్రమంలో జిల్లాలో 20 వేల మంది లబ్ధిదారులు రూ.300 కోట్ల రుణాలు చెల్లించారని, చెల్లించిన రైతులు రుణాలను రీషెడ్యూల్ చేస్తామని తెలిపారు.
విత్తనాలు, పురుగుమందులు అందిస్తాం.. : అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముందు రోజులలో రైతుల మేలు ఆశించి విత్తనాలు, పురుగుమందులు అందిస్తామని చెప్పారు. ఇప్పటి వరకు రైతులకు ఎరువులు అందించామని, దీనితోపాటు రైతు సంక్షేమానికి అవసరమైన ప్రతి వాటిని సరఫరా చేసేందుకు బ్యాంకు ముందుకు వస్తుందని పేర్కొన్నారు. ఈ ఏడాది రైతులకు పంట నిల్వలపై ప్రత్యేక రుణాలు అందించేందుకు సన్నద్ధం అవుతున్నట్టు వివారించారు. గత పాలమండలిలో చేసిన తప్పలను తాము చేయబోమన్నారు.